Atmakur By Poll Results: ఆత్మకూరులో ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఎన్ని రౌండ్లలో లెక్కిస్తారంటే..

ABN , First Publish Date - 2022-06-26T03:18:07+05:30 IST

ఆత్మకూరులోని ఆంధ్ర బీటెక్‌ కాలేజ్‌లో ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 20 రౌండ్‌లలో..

Atmakur By Poll Results: ఆత్మకూరులో ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఎన్ని రౌండ్లలో లెక్కిస్తారంటే..

నెల్లూరు: ఆత్మకూరులోని ఆంధ్ర బీటెక్‌ కాలేజ్‌లో ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 20 రౌండ్‌లలో లెక్కింపు జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం తగ్గింది. దీంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, లక్ష ఓట్ల మెజారిటీ చూపించి ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటి చెప్పాలని వైసీపీ అధిష్ఠానం భావించింది. ఆ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా మోహరించి, స్థానిక నాయకులకు దిశానిర్ధేశం చేయడంతోపాటు ఓటర్లకు భారీగానే తాయిలాలు అందజేశారు. ఆ మేర ఓటింగ్‌ శాతం పెంచేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గురువారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి  64.17 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 82 శాతం పోలింగ్‌ జరిగింది. అంటే 18 శాతం పోలింగ్‌  తగ్గడంతో లక్ష ఓట్ల మెజారిటీ అసాధ్యమని అధికార పార్టీ నేతలు కూడికలు తీసివేతల్లో నిమగ్నమై ఉన్నారు. అనుకున్న మెజారిటీ రాకపోతే తమ అధినాయకుడికి ఏం సమాధానం చెప్పాలా.. అనే ఆలోచనలో పడ్డారు.



ఆత్మకూరు నియోజకవర్గంలో గురువారం ఉదయం పోలింగ్‌ మందకొడిగా సాగింది. 11 గంటలు తరువాత అనూహ్యంగా పోలింగ్‌ శాతం పెరిగింది. నియోజకవర్గంలో 2,13,338 మంది ఓటర్లు ఉండగా 1,37,038 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 493 మంది పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటు వేశారు. మొత్తం మీద ఓటింగ్‌ శాతం 64.17 నమోదైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11.56 శాతం పోలింగ్‌ నమోదవగా, 11 గంటలకు 24.92 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 44.14 శాతం, 3 గంటలకు 54.66 శాతం, సాయంత్రం 6గంటలకు 64.17 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి బ్రాహ్మణపల్లిలో, బీఎస్పీ అభ్యర్ధి నందా ఓబులేశు ఆత్మకూరు మండలం గండ్లవీడులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూటూరు మురళీకన్నబాబు కరటంపాడులో ఓటు వేశారు.

Updated Date - 2022-06-26T03:18:07+05:30 IST