ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటు : ఆర్డీవో

ABN , First Publish Date - 2021-04-24T03:49:31+05:30 IST

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో రోగుల సౌకర్యార్థం ఆత్మకూరు డివిజన్‌లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి పేర్కొన్నారు.

ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటు : ఆర్డీవో
వైద్యులతో చర్చిస్తున్న ఆర్డీవో చైత్రవర్షిణి

ఉదయగిరి రూరల్‌, ఏప్రిల్‌ 23: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో రోగుల సౌకర్యార్థం ఆత్మకూరు డివిజన్‌లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఆమె పరిశీలించి వైద్యులతో చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూరు జిల్లా, అభిరామ్‌, శ్రీవెంకటేశ్వర, వింజమూరు, ఉదయగిరి సీహెచ్‌సీలో 100 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఆత్మకూరు టిడ్కోలో 500 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో 30 నుంచి 40 శాతం అక్సిజన్‌ బెడ్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరతను ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. అలాగే వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు ఆరు నెలలుగా వేతనాలు రావడంలేదని, కుటుంబ పోషణ కష్టతరమైందని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేతనాలు చెల్లించేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు ఫజిహ, వైద్యులు సందానీబాషా, సుభానీబాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T03:49:31+05:30 IST