అందరికీ అగ్నిపరీక్షే!

ABN , First Publish Date - 2021-02-22T05:18:23+05:30 IST

పురపోరు ప్రధాన రాజకీయ పార్టీలన్నిటికీ అగ్ని పరీక్ష కానుంది. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పెరిగిన ధరలు తమకు కలిసి వస్తాయని తెలుగుదేశం భావిస్తుండగా.. సంక్షేమం తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని వైసీపీ లెక్కగడుతోంది.

అందరికీ అగ్నిపరీక్షే!

రసకందాయంలో ఆత్మకూరు పురపోరు!

రెబల్స్‌ను బుజ్జగిస్తున్న వైసీపీ

ఐక్యతగా ముందుకెళ్లే దిశగా టీడీపీ

సఖ్యతగా బీజేపీ, జనసేన

పోరాటమే లక్ష్యంగా వామపక్షాలు


ఆత్మకూరు, ఫిబ్రవరి 21 : పురపోరు ప్రధాన రాజకీయ పార్టీలన్నిటికీ అగ్ని పరీక్ష కానుంది. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పెరిగిన ధరలు తమకు కలిసి వస్తాయని తెలుగుదేశం భావిస్తుండగా.. సంక్షేమం తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని వైసీపీ లెక్కగడుతోంది. జనసేన, బీజేపీ, వామపక్షాలు ఏదో రూపంలో తమకు అంతో ఇంతో చోటు దక్కుతుందని విశ్వసిస్తున్నాయి. గత ఏడాది అర్ధంతరంగా ఆగిన మున్సిపల్‌ ఎన్నికలు ఈ సారి ఏ రూపంలో ఉండబోతాయోనన్న ఆత్రుత అందరిలోనూ నెలకొంది. ఉద్యోగులు, వ్యాపారులతోపాటు అన్ని వర్గాల వారు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఓటర్ల నాడి కనిపెట్టేందుకు అన్ని పార్టీలు సర్వేకు దిగాయి.  23 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో వైసీపీ నుంచి 42 మంది, టీడీపీ నుంచి 28 మంది, బీజేపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి నలుగురు, బీఎస్పీ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి నలుగురు, సీపీఎం నుంచి మరో నలుగురు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారు.  


వైసీపీలో రెబల్స్‌..

రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సొంత ఇలాఖా ఆత్మకూరులో జరిగే మున్సిపల్‌ ఎన్నికలు అత్యంత కీలకం కాబోతున్నాయి. అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులు గెలిచేలా ఎత్తుగడలు వేస్తూ.. రెబల్స్‌ను బుజ్జగించే దిశగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు.  రెండు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. 8వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పుచ్చలపల్లి రాధికారెడ్డి నామినేషన్‌ వేశారు. టీడీపీ, ఇతర పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. దీంతో  ఈ వార్డు ఏకగ్రీవం అవుతుందని భావిస్తున్న తరుణంలో వైసీపీ నాయకుడు, సిండికేట్‌ ఫార్మర్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ మాజీ అధ్యక్షుడు చిట్టమూరు వెంకటేశ్వర్లురెడ్డి తల్లి చిట్టమూరు లక్ష్మీకాంతమ్మ, సతీమణి శశికళ రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అదే క్రమంలో 15వ వార్డులో వైసీపీ అభ్యర్థులుగా గందళ్ల వేణు, సుప్రజ నామినేషన్లు దాఖలు చేశారు. 


వ్యూహరచనలో టీడీపీ..   

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు 4 వార్డుల్లో మాత్రమే గెలుపొందారు. ఇప్పుడు ఎన్ని వార్డుల్లో గెలుస్తామనే అయోమయంలో ఉన్నారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతికేకత, వైసీపీకి రెబల్స్‌ బెడద తప్పలేదు. ఈ క్రమంలో జోష్‌ మీద ఉన్న టీడీపీ శ్రేణులు మున్సిపల్‌ ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు వ్యూహరచనలో పడ్డారు. ఎక్కువ వార్డుల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. 


మిత్రుల మధ్య సఖ్యత

గత ఏడాది బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులు లేకుండానే బరిలోకి దిగాయి. బీజేపీ నుంచి  ఏడుగురు, జనసేన నుంచి నలుగురు నామినేషన్లు వేసి వున్నారు. ఈ క్రమంలో బీజేపీ, జనసేన సఖ్యతగా ముందుకెళ్లి తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.  


పోరాటమే లక్ష్యంగా వామపక్షాలు

గత ఎన్నికల్లో సీపీఎంకు చెందిన షేక్‌ సందాని స్వతంత్ర అభ్యర్థిగా 3వ వార్డు నుంచి గెలుపొంది మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌గా పని చేశారు. ఈసారి కూడా సందాని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 1, 16, 17, 19 వార్డుల్లో సీపీఎం, 12, 14 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, 14వ వార్డులో సీపీఐ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన రామ్మూర్తి ఇటీవల మృతి చెందారు. ప్రజా సమస్యలపై తాము చేసిన పోరాటాలే తమకు కలిసి వస్తాయని వామపక్ష నేతలు ధీమాగా ఉన్నారు. 

 

సీపీఐకి మళ్లీ చాన్స్‌!

14వ వార్డులో అభ్యర్థి మృతి

మరొకరు నామినేషన్‌ దాఖలుకు అవకాశం


ఆత్మకూరులో 144 మంది నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారు. వీరిలో సీపీఐ అభ్యర్థులుగా 12వ వార్డు నుంచి షేక్‌ అహ్మద్‌ బాష, 14వ వార్డు నుంచి రామ్మూర్తి నామినేషన్లు వేశారు. అయితే, రామ్మూర్తి ఇటీవల మృతి చెందారు. ఈయన స్థానంలో ఆ పార్టీ నుంచి మరొకరు నామినేషన్‌ దాఖలు చేయడానికి వీలు కల్పిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 14వ వార్డుకు సంబంధించి సీపీఐ నుంచి  ఒకరి ద్వారా ఆర్వో ఈ నెల 26వ తేదీన నామినేషన్‌ స్వీకరిస్తారు. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, 3న నామినేషన్ల ఉపసంహరణ, 10న యఽథావిధిగా పోలింగ్‌ జరుగుతుంది. అయితే, సీపీఐ  కొత్త అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

Updated Date - 2021-02-22T05:18:23+05:30 IST