ఆత్మకూరు తీర్పే చెప్తుంది ఆంధ్ర ప్రజల అంతరంగం!

ABN , First Publish Date - 2022-06-23T06:54:10+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ప్రీతిపాత్రమైన నియోజకవర్గం, గతంలో ఆయన స్వల్ప ఓట్లతో ఓడిపోయి తర్వాత జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన కారణంగా...

ఆత్మకూరు తీర్పే చెప్తుంది ఆంధ్ర ప్రజల అంతరంగం!

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ప్రీతిపాత్రమైన నియోజకవర్గం, గతంలో ఆయన స్వల్ప ఓట్లతో ఓడిపోయి తర్వాత జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన కారణంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గం– ఆత్మకూరు నియోజక వర్గం. ఈ నియోజక వర్గంలో పారిశ్రామిక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి, ఆత్మకూరు ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచి, పరిశ్రమల శాఖా మంత్రిగా ఎదిగిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇలాంటి ఉపఎన్నికల్లో సర్వసాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తలపడాలి. కానీ టీడీపీ సాంప్రదాయ పద్ధతుల పేరుమీద పోటీ నుంచి విరమించుకుంది. బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బరిలో నిలిచింది. ఇక్కడ క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి ఉన్న బలమైన కార్యకర్తల శ్రేణిని ఢీకొట్టే పయత్నం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 151 శాసన సభ స్థానాలతోను, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయంతోనూ మదపుటేనుగులా ఘీంకరిస్తున్న అధికారపార్టీని నిలువరించటానికి బీజేపీ పూనుకొన్నది. 


ప్రతి ఎన్నికలోనూ అధికార పార్టీ దొంగ ఓట్లతో విజృంభించటం, తర్వాత సొంత మీడియా ద్వారా ఎన్నికల్లో జనం తమకు బ్రహ్మరథం పట్టినట్లు కలరింగ్ ఇచ్చుకోవటం పరిపాటిగా మారింది. ఇటీవల బద్వేల్ ఉప ఎన్నికలో కూడా ఇదే జరిగింది. అధికారపార్టీ పొరుగు నియోజకవర్గాల నుంచి బస్సుల్లో మనుషులను తరలించిమరీ దొంగ ఓట్లను సమీకరించింది. అంతేగాక, తనకున్న బలమైన వాలంటరీ వ్యవస్థ ద్వారా అప్పటికే చనిపోయిన, పక్క ఊళ్లల్లో నివసిస్తున్న స్థానిక ఓటర్ల పేరు మీద దొంగ ఓటరు గుర్తింపు కార్డులను సృష్టించి మరీ ఓట్లు వేయించుకుంది. ఇప్పుడు కూడా అదే దుష్ట సంప్రదాయాన్ని  పునరావృతం చేయటానికి పూనుకొంటున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రివర్గంలో దొంగ ఓట్ల మంత్రిగా గుర్తింపు పొందిన పెద్దరెడ్డితోసహా, మండలానికి  ఇద్దరు మంత్రులు, పంచాయతీకి ఒక ఎమ్మెల్యే చొప్పున నీతిమాలిన వ్యూహాలను రచించటంలో తలమునకలై ఉన్నారు. 


ముప్ఫై ఎనిమిది నెలల పాలనా కాలం తర్వాత కూడా ఆత్మకూరు నియోజక వర్గంలో రోడ్డు రవాణాలాంటి మౌలిక సదుపాయాలు సవ్యంగా లేవు. ఇదే నియోజక వర్గం నుంచి పరిశ్రమల శాఖా మంత్రిగా ఎదిగిన గౌతమ్ రెడ్డి ఇక్కడికి ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్థానిక సంస్థల నిధులను కూడా ఖర్చు పెట్టకుండా దారి మళ్లించారు. దీంతో ఏ సౌకర్యమూ లేక అవస్థలు పడుతున్న ఇక్కడి ప్రజల్లో సానుభూతి ఓటర్లు కూడా ఎవరూ మిగల్లేదు. ప్రచార సమయంలో బీజేపీ ప్రజల్లో అవగాహన కలగ చేయటానికి ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పల్లె సీమల అభివృద్ధి కోసం ఏటేటా విడుదల చేస్తున్న నిధుల వివరాలను, ఆ నిధులు విడులవుతున్న కాలపట్టికలను కార్యకర్తల ద్వారా ఇంటింటా పంచిపెట్టింది. ఇలా అధికారపార్టీ వైఫల్యం బహిరంగంగా వ్యక్తం కావటంతో ప్రజలలో ఆలోచన మొదలైంది. అధికారపార్టీ అభ్యర్థి ఎంపిక కూడా ప్రజల్ని నిరాశపరిచింది. ఒకవైపు బీజేపీ తన అభ్యర్థిగా యువజన రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగి, ఎన్నో సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్‌ను ఎంపిక చేస్తే, మరో పక్క అధికారపార్టీ మరణించిన మంత్రి సోదరుడు విక్రమ్ రెడ్డిని అమెరికానుంచి తీసుకువచ్చి అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన గెలిచినా విమానాల్లో తిరుగుతాడు తప్ప, తమకు అందుబాటులో ఉండడన్న నమ్మకం ప్రజల్లో ఇప్పటికే బలపడింది. 


పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉందో గమనించిన అధికార పార్టీ ధన ప్రలోభ పర్వానికి తెర లేపింది. వాలంటీర్ల ద్వారా ఓటర్లకు నగదు పంపిణీ మొదలైంది. ప్రతి ఇంటికి 500 రూపాయల నోట్లు పంపిణీ చేసేశారు. ఎర్రచందనం, మద్యం, ఇసుక మాఫియాల నుంచి పైకి తేలిన అవినీతి నోట్ల కట్టలన్నీ ఆత్మకూరులో పొంగి పొర్లుతున్నాయి. ఇంత డబ్బు పంచిపెడుతున్నా కూడా అధికార పార్టీకి ఇంత హైరానా ఎందుకో ఇక్కడ తిష్ట వేసిన మంత్రులకే తెలియాలి! మరోవైపు బీజేపీ అభ్యర్థి తరపున పార్టీ కార్యకర్తలు ప్రతి పౌరుడినీ కలిసి తమ విధానాలను చెప్పి ఓట్లు అడుగుతున్నారు.  


ఏదేమైనా– జగన్‌కు కళ్లు తెరిపించే సమయం ఆసన్నమైంది. మూడేళ్ళ క్రితం పాదయాత్ర సందర్భంగా హామీలు ఇచ్చినట్టే ఇచ్చి, అధికారంలోకి రాగానే వాటి ఊసేమరిచిన వైనానికి, ప్రజలు బుద్ధి చెప్పే తరుణం త్వరలోనే ఉంది. నూతన మద్యం పాలసీ పేరుతో సొంత బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం దెబ్బతీయడం, ఇసుక మాఫియా ద్వారా బ్లాక్ మార్కెట్, చార్జీలు పెంచను అని చెప్పి నేడు విద్యుత్తూ ఆర్టీసీ చార్జీలను అమాంతంగా పెంచిన వైనం, పెరిగిన నిత్యావసర ధరలు, మహిళలకు భద్రత లేకపోవడం... ఇలా ప్రజల పట్ల అక్కర లేని అస్తవ్యస్త విధానాలతో ముందుకుపోతున్న ఈ గుడ్డి ప్రభుత్వానికి ఓటరు తీర్పుతో ఓళ్ళు జలదరించాలి. ఇదో సువర్ణ అవకాశం!

నాగోతు రమేశ్ నాయుడు 

(బీజేపీ రాష్ట్ర కార్యదర్శి)

Updated Date - 2022-06-23T06:54:10+05:30 IST