బస్తా సిమెంటుపై రూ.100 పెంపు

ABN , First Publish Date - 2021-01-13T07:12:53+05:30 IST

ఇల్లు కట్టాలంటే ప్రస్తుతం బెంబేలెత్తుతున్నారు. ఆ ఆలోచన చేయాలన్నా.. భీతిల్లుతున్నారు. నిర్మాణ సామగ్రి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, ఎంత డబ్బు పోసినా.. ఇసుక దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు.

బస్తా సిమెంటుపై రూ.100 పెంపు
నిర్మాణంలో ఉన్న భవనాలు

ధరా భారం..!

బస్తా సిమెంటుపై రూ.100 పెంపు

టన్ను ఇనుముపై రూ.20వేలు..

అందుబాటులోలేని ఇసుక

నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం

పెరిగిన ధరలతో అర్ధాంతరంగా నిలిపివేత

బెంబేలెత్తుతున్న  గృహ నిర్మాణదారులు

తగ్గిన కొనుగోళ్లతో వ్యాపారుల బేలచూపులు

ఉపాధి లేక కార్మికులకు తప్పని కష్టాలు 

బిల్డర్లలో అయోమయం

అనంతపురం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఇల్లు కట్టాలంటే ప్రస్తుతం బెంబేలెత్తుతున్నారు. ఆ ఆలోచన చేయాలన్నా.. భీతిల్లుతున్నారు. నిర్మాణ సామగ్రి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, ఎంత డబ్బు పోసినా.. ఇసుక దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచననే వదిలేస్తున్నారు. దీంతో నిర్మాణ రంగం కుదేలవుతోంది. దానిపై ఆధారపడిన వారు రోడ్డున పడుతున్నారు. నిర్మాణ సామగ్రి ధరలపై నియంత్రణ కొరవడటమే ఇందుకు ప్రధాన కారణమన్నది నిర్వివాదాంశం. సిమెంటు, ఇనుము, ఇసుక ధరలు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన విధానంతో ఇసుక దొరక్క.. దొరికినా అంత ధర చెల్లించలేక భవన నిర్మాణదారులు అల్లాడిపోతున్నారు. దానికితోడు సిమెంటు, ఇనుము (స్టీల్‌) ధరలు అమాంతం పెరిగిపోవటంతో భవన నిర్మాణ రంగం కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సిమెంటు, ఇనుము వ్యాపారులు కొనుగోళ్లు లేక బేల చూపులు చూస్తున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలంటే.. అదనపు భారంతో బిల్డర్ల పరిస్థితి అయోమయంగా మారింది. అన్నివర్గాల ప్రజలను పెరిగిన ఇనుము, సిమెంటు ధరలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయనటంలో సందేహం లేదు. 


భారంగా మారిన ఇనుము, సిమెంటు

ఇనుము, సిమెంటు ధరల పెరుగుదలతో సొంత ఇల్లు కట్టు కోవాలనుకునే సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. ఇప్పటికే ఇసుక కొరతతో నిర్మాణరంగం అతలాకుతలమవుతుంటే.. గోరుచుట్టుపై రోకటిపోటన్నట్లు ఇనుము, సిమెంటు ధరలు నిర్మాణదారుల కంటతడి పెట్టిస్తున్నాయి. మునుపెన్నడూ ఇనుము ధరలు పెరిగాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌కు ముందు ఇనుము కేజీ రూ.50 అంటే టన్ను రూ.50 వేలు పలికేది. ప్రస్తుతం కేజీ రూ.65కు చేరింది. టన్నుకు రూ.65 వేలు చెల్లించాల్సి వస్తోంది. అంటే వినియోగదారుడు టన్నుపై రూ. 15 వేలు అదనపు భారాన్ని భరించాలి. ఇవి సాధారణ ఇనుము ధరలు. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ఇనుము కొనుగోలు చేయాలంటే కేజీ రూ.70 నుంచి రూ.80 వెచ్చించాల్సి వస్తోంది. ఈ లెక్కన టన్నుపై రూ.20 వేలు అదనపు భారం పడుతోంది. సిమెంటు ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు బస్తా రూ.270 నుంచి రూ.280 ఉండేది. ప్రస్తుతం బస్తాపై రూ.100 పెంచేశారు. వివిధ కంపెనీలకు సంబంధించి ప్రస్తుతం పెరిగిన ధరలు పరిశీలిస్తే... కోరమాండల్‌ రూ.380, పెన్నా రూ. 380, అల్ర్టాటెక్‌ రూ.385, భారతి రూ.390 పలుకు తున్నాయి. ఈ ధరలతో నిర్మాణ రంగం కుదేలు దిశగా వెళుతోంది.


అయోమయంలో బిల్డర్లు

సిమెంటు బస్తా రూ.400కు చేరుకుంటోంది. ఇనుము ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. ట్రాక్టర్‌ ఇసుక రూ.4500, టిప్పర్‌ ఇసుక రూ.16 వేల వరకూ చెల్లించాల్సి వస్తోంది. అందులోనూ జిల్లాలో ఇసుక అందుబాటులో లేకుండాపోతోంది. ఐదు స్టాకు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నా.. నెలరోజులైనా ఇసుక చేరదు. వచ్చినా నాణ్యమైనది లభ్యం కాదు. ఇలా పెరిగిన ధరలతో అంచనా వ్యయం పెరిగిపోతుండటంతో యజమానులతో మునుపు చేసుకున్న ఒప్పందం మేరకు.. బిల్డరు నిర్మాణాలు పూర్తి చేయాలంటే అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బిల్డర్లు ఉన్నారనడంలో సందేహం లేదు. ధరల పెరుగుదలతో ఇనుము, సిమెంటు వ్యాపారాలు భారీగా తగ్గాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు బిల్డర్లు, కాంట్రాక్టర్లు, యజమానులు ముందుకు రావట్లేదు. కరోనా కు ముందు నెలకు 150 టన్నుల వరకు సిమెంటు అమ్మే వ్యాపారులకు ప్రస్తుతం 70 టన్నులు కూడా విక్రయించలేకపోతున్నారు. అంటే 50 శాతం వ్యాపారం తగ్గినట్లు స్పష్టమ వుతోంది. ఇనుము విక్రయాలదీ ఇదే పరిస్థితి.


కార్మికుల కష్టాలు వర్ణనాతీతం

జిల్లాలో నిర్మాణ రంగంపై ఆధారపడి 3.50 లక్షల మంది కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో నిర్మాణ రంగం పూర్తిస్థాయిలో ఆగిపోవడంతో ఒకపూట తిండికి అలమటించిన రోజులను వారు చవిచూశారు. లాక్‌డౌన్‌ మినహాయింపు తరువాత నిర్మాణ రంగంలో చలనం రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. వారానికి రెండ్రోజుల పని దొరికినా సంతోషించారు. రోజు కూలీ ఐదారు వందలు వచ్చినా సర్దుకుని బ తు కు వెళ్లదీశారు. అలా నెట్టుకొస్తున్న తరుణంలో సిమెంటు, ఇనుము ధరలు పెరగటంతో నిర్మాణరంగంలో కుదుపు వచ్చింది. నిర్మాణా లు చేపట్టేందుకు ఎవరూ సుముఖంగా లేకపోవటంతో కార్మికుల ఉపాధి భారంగా మారింది. వారానికి రెండ్రోజులు పనులు దొరకడం కూడా కష్టంగా మారుతోంది. రోజుకు రూ.300 కూలీకి వస్తామన్నా పని కల్పించేవారు కరువయ్యారు. కార్మిక చట్టాల ద్వారా లబ్ధి పొందుదామన్నా.. సంబంధిత శాఖాధికారులు పట్టించుకోకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. నిర్మాణరంగం అనుబంధ రంగాలైన చెక్కపని, పెయింటింగ్‌, వెల్డింగ్‌, ఇటుకలు, నాపరాయి, విద్యుత్‌ తదితర పనులు చేసుకునే కార్మికులు, వ్యాపారులకు చేతినిండా పనిలేకుండా పోయింది.


నిర్మాణ స్థలాన్ని బట్టి లక్షల్లో భారం

రెండు సెంట్ల (96 గజాలు)లో సాదాసీదాగా అందులోనూ రూ.15 లక్షల్లోగా ఇల్లు నిర్మించుకోవాలని ఓ యజమాని అంచనా వేసుకున్నాడు. సిమెంట్‌ బస్తా రూ.270, ఇనుము కేజీ రూ.50 ఉన్నప్పటి అంచనా ఇది. ప్రస్తుతం సిమెంటు బస్తాపై రూ.100కుపైగా, ఇనుము కేజీపై రూ.15 నుంచి రూ.20 పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయం దాదాపుగా రూ.20 లక్షలకు చేరింది. దీంతో మరో రూ.5 లక్షలు ఆ యజమానిపై అదనపు భారం పడుతోంది. ఇది కేవలం ఒక సామాన్యుడు నిర్మించుకునే ఇంటిపై మాత్రమే. అదే బహుళ అంతస్థుల యజమానులపై ధరల ప్రభావం విపరీతంగా చూపుతోంది. దీనికి భయపడి నిర్మాణాలు చేపట్టేందుకు వారు సుముఖత చూపడం లేదు. నిర్మాణంలో ఉన్న వాటిని అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. అడుగుకు రెండు కేజీల ఇనుము అవసరం. ఈ లెక్కన సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటి నిర్మాణానికి సుమారు ఒకటిన్నర టన్ను కావాలి. గత ధరల ప్రకారం ఇనుముకు రూ.75 వేలు ఖర్చయ్యేది. పెరిగిన ధరలతో రూ. 1.05 లక్షలు అవుతోంది. ఒక్క ఇనుము పైనే రూ.30 వేలు అదనంగా భారం పడుతోంది. అంత ఖర్చు చేసి, భవనాలు నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.


నెలకు 70 టన్నులు అమ్మలేకపోతున్నాం

లాక్‌డౌన్‌ తర్వాత సిమెంటు బస్తా ధర రూ.100 పెంచేశారు. దీంతో. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. దీంతో సిమెంటు వ్యాపారం మందగించింది. గతంలో నెలకు 150 టన్నుల సి మెంటు అమ్మేవాళ్లం. ప్రస్తుతం 50 శా తం విక్రయించలేకపోతున్నాం. ఖర్చులు యథావిధిగా ఉంటున్నాయి. జీతాలు, షాపు బాడుగలు చెల్లించలేని పరిస్థితి ఎదురవుతోంది. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. సిమెంటు కంపెనీలు ధర లు తగ్గిస్తేనే ఊరట లభిస్తుంది. 

- రామచంద్రారెడ్డి, సిమెంటు డీలర్‌


రెండు రోజులు పనులు దొరికితే గగనం

కరోనా పరిస్థితుల్లో ప నుల్లేక ఇబ్బందులు పడ్డాం. లాక్‌డౌన్‌ తరువాత అరకొరగా పనులు దొరికేవి. ప్రస్తుతం సిమెం టు, ఇనుము ధరలు పెరగడంతో వారానికి రెండ్రో జులు కూడా పనులు దొరికే పరిస్థితులు లేవు. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారుతోంది. కష్టాలు తలచుకుంటుంటే కన్నీళ్లు ఆగడం లేదు.

-  మధు, భవన నిర్మాణ కార్మికుడు


కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లకే లాభాలు..

ఇనుము ధరలు అమాం తం పెరిగిన నేపథ్యంలో కంపెనీలు, డిస్ర్టిబ్యూటర్లే లాభపడుతున్నా రు. డీలర్లు, కొనుగోలుదారులు నష్టపోతున్నారు. లా క్‌డౌన్‌కు మునుపు ఇను ము కేజీ రూ.50 ఉండేది. ప్రస్తుతం రూ.65కు చేరింది. ఇవి సాధారణ ఇనుము ధరలు. ప్రముఖ కంపెనీలకు సంబంధించి కొనుగోలు చేయాలంటే కేజీ రూ.70 నుంచి రూ.80 ధర పలుకుతోంది. ధరల పెరుగుదలతో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఇనుము కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదు. 2008 తరువాత ఇప్పుడే నష్టాలు చూస్తున్నాం. ప్రభుత్వం స్పందించి, స్టీల్‌ కంపెనీలతో చర్చించి, సాధారణ ధరలు నిర్ణయిస్తే తప్పా గట్టెక్కలేం.

- సురేష్‌, జొన్నా ఐరన్‌ మార్ట్‌ నిర్వాహకుడు



ధరలు పెరగటంతో  నిర్మాణాలు చేపట్టలేకున్నాం

కరోనాతో నిర్మాణ రంగం కుదేలైంది. ప్రస్తుతం ఇ సుక కొరత.. ఇనుము, సిమెంటు, ఇటుకల ధరల పెరుగుదలతో ని ర్మాణాలు చేపట్టలేకపోతున్నాం. ఒక భవనానికి ప్లా నింగ్‌ ఇవ్వాలంటే.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000, మున్సిపాల్టీల్లో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ చార్జ్‌ చేస్తాం. ప్రస్తుతం నిర్మాణ రంగం సామగ్రి ధరలు పెరగడంతో ఇంటి నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావట్లేదు. ధరల పెరుగుదలకు మునుపు కుదుర్చుకున్న ఒప్పందం మేరకే.. ఇప్పుడు నిర్మాణాలు చేపట్టాలని యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. తద్వారా 30 నుంచి 40 శాతం నష్టపోవాల్సి వస్తోంది. మరికొన్ని భవన నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఇసుక కొరత బిల్డర్లను వేధిస్తోంది.

- సుధాకర్‌రెడ్డి,  బిల్డర్‌, ఇంజనీర్‌

Updated Date - 2021-01-13T07:12:53+05:30 IST