ఉక్కు బంద్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2021-03-06T06:55:37+05:30 IST

విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.

ఉక్కు బంద్‌ ప్రశాంతం
అనంతపురం ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థలు, 

వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్‌

మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

విద్యా సంస్థల మూసివేత

అనంతపురం టౌన్‌, మార్చి 5 : విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం సీపీఎం, సీపీఐఎంఎల్‌, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన తెలిపారు. అనంతరం గణేనాయక్‌భవన్‌ నుంచి సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణకళామందిర్‌ నుంచి సీపీఎంతోపాటు కార్మికసంఘాలు, ఏపీఎన్జీఓ సంఘం కలిసి టవర్‌క్లాక్‌ మీదుగా సప్తగిరి సర్కిల్‌, తిరిగి క్లాక్‌టవర్‌ వరకు ర్యాలీ చేపట్టారు. బంద్‌కు రాష్ట్రప్రభుత్వం మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు సైతం మధ్యాహ్నం వరకు బస్టాండ్లకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. అక్కడక్కడ తెరిచి ఉంచిన పలు దుకాణాలను నాయకులు బంద్‌ చేయించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలను, ఇతర విద్యాసంస్థలను బంద్‌కు మద్దతుగా మూసివేయించారు. వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతంగా ముగిసింది. 


విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడమంటే దేశాన్ని అమ్మడమే

సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు శ్రీనివాసరావు

ఆంధ్రుల హక్కుగా ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడ మంటే దేశాన్ని అమ్మేసినట్లేనని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించరాదని డిమాండ్‌ చేస్తూ కార్మికసంఘాల ఆధ్వ ర్యంలో శుక్రవారం అనంతపురంలో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు శ్రీనివాసరావుతోపాటు జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌, సీపీఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్‌, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు అతావుల్లా తదితరులు హాజరై కేంద్రప్రభుత్వ విధానాలను ఖండించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ... కేంద్రం రాష్ట్ర ప్రజల పట్ల వివక్ష చూపుతోందన్నారు.  రాష్ట్రాన్ని ఆదుకోకపోగా ప్రభుత్వరంగసంస్థగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి పూనుకోవడం దారుణమన్నారు. లక్షలాది మంది ఆధారపడి పనిచేస్తున్న ఈ పరి శ్రమను ప్రైవేటీకరిస్తే వారందరి జీవితాలు అభద్రతలో పడతాయన్నారు. సీపీఐఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ ఐకమత్యంతో పోరాడి విశాఖ ఉక్కును కా పాడుకోవాల్సిన అవసరముందన్నారు. సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామంటే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శివర్గసభ్యులు నాగేంద్రకుమార్‌, సావిత్రి, బాలరంగయ్య, జిల్లాకమిటీ సభ్యులు రామిరెడ్డి, ఐద్వా నగర కార్యదర్శి చంద్రిక, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి రవికుమార్‌, సహాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, జమీలాబేగం, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నగరాధ్యక్షురాలు జమున తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-03-06T06:55:37+05:30 IST