కరోనా విజృంభిస్తున్నా మేల్కోని వైనం..

ABN , First Publish Date - 2021-04-15T06:39:37+05:30 IST

కరోనా విజృంభిస్తున్నా.. నిర్లక్ష్యం తాండవిస్తోంది. ప్రజల నుంచి యం త్రాంగం, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ మేల్కోవడంలేదు. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.

కరోనా విజృంభిస్తున్నా   మేల్కోని వైనం..

అందరిలోనూ నిర్లక్ష్యం..!

నిబంధనలు పట్టించుకోని ప్రజలు..

కట్టడి చర్యలపై యంత్రాంగం మీనమేషాలు

టెస్టింగ్‌పై శ్రద్ధ కరువు

ఫలితాల వెల్లడిలో జాప్యం

కాంటాక్ట్‌లపై అశ్రద్ధ

హాట్‌స్పాట్‌లేవీ...?

కొవిడ్‌ ఆస్పత్రులుగా  గుర్తించినా...  బాధితులు కరువు..

ఎవరికి వారే గుట్టుగా చికిత్స..

నెలలో ఇప్పటివరకూ  1659 కేసుల నమోదు

9 మంది మృతి

అనంతపురం, ఏప్రిల్‌14 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభిస్తున్నా.. నిర్లక్ష్యం తాండవిస్తోంది. ప్రజల నుంచి యం త్రాంగం, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ మేల్కోవడంలేదు. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.  

వందల్లో కేసులు నమోదవుతున్నాయి. రోజుమార్చి రోజు కొవిడ్‌ మరణాలు సంభవిస్తుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రజల్లో విచ్చలవిడితనమూ లేకపోలేదు. వెరసి కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఎవరైతే కరోనా బాధితులున్నారో.. వారికి ప్రత్యేకంగా కొవిడ్‌ ఆస్పత్రుల్లోనే చికిత్స అందించే చర్యలు చేపట్టకపోవడం.. కాంటాక్ట్‌లను గుర్తించకపోవడమే ఇందుకు నిదర్శనం. టెస్టింగ్‌లు చేయడంలోనూ తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. టెస్టింగ్‌లు చేసినా... ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరుగుతోంది. ఈలోపు కరోనా బాధితుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందనడంలో సందేహం లేదు. గతేడాదిలో పరిస్థితే ఇందుకు అద్దం పడుతోంది. జిల్లాలో రోజురోజుకీ కరోనా కోరలుచాస్తున్నా.. గతం పునరావృతమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా.. యంత్రాంగం ఆ మేరకు పాఠాలు నేర్వలేదనే చెప్పాలి. గతేడాది మార్చి 29 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకూ 602 మంది కరోనాతో చనిపోయారు. ఈ నెలలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు, మరణాలను పరిశీలిస్తే... పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా అయితే ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహం లేదు.


నిర్లక్ష్యం కాటేస్తోందా..?

కరోనా వైరస్‌ విషయంలో నిర్లక్ష్యమే కాటేస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో విచ్చలవిడితనమే ఇందుకు కారణమనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అటు రెవెన్యూ.. ఇటు పోలీసు యంత్రాంగంపై ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చెబుతున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఆధ్వర్యంలోనూ అదేస్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. వందలాది మంది ఒకేచోటకు చేరుస్తున్న క్రమంలో కరోనా నిబంధనలను అమలు చేయాల్సిన యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. అధికారులు మాత్రమే మాస్కులు ధరించడంతో సరిపెడుతున్నారు. కార్యక్రమాలకు హాజరైన వారు కరోనా నిబంధనలు పాటించకపోయినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కరోనా అంటే లెక్కలేనితనంగా మారిందనడంలో సందేహం లేదు. తాజాగా.. నిర్వహించిన వలంటీర్లకు సత్కార సభల్లోనూ ప్రజాప్రతినిధులే కాదు.. వలంటీర్లు సైతం మాస్కులు ధరించకపోయినా.. భౌతికదూరం పాటించకపోయినా.. పట్టించుకోలేదు. దీన్నిబట్టి చూస్తే నిర్లక్ష్యమే కాటేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది నిర్వివాదాంశం.


టెస్టింగ్‌పై శ్రద్ధ చూపని వైనం

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా.. జిల్లా యంత్రాంగం టెస్టింగ్‌పై శ్రద్ధ చూపడం లేదు. గతేడాది రోజుకు 50 నుంచి 60 కేసులు నమోదైతేనే... అప్రమత్తమయ్యే యంత్రాంగం ప్రస్తుతం 300 దాకా వస్తున్నా.. టెస్టింగ్‌లు పెంచేందుకు చర్యలు తీసుకోవడంలేదు. 3 వేలలోపు మందికి మాత్రమే టెస్టింగ్‌ చేస్తున్నారు. ఉదాహరణకు ఈనెల 13వ తేదీన 2587 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 128 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గతంలోలాగానే రోజుకు ఏడెనిమిది వేల మందికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. మరోవైపు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితాలు వెల్లడించడంలో జాప్యమవుతోంది. టెస్టింగ్‌ చేసిన తరువాత పాజిటివా.. నెగిటివా అని నిర్ధారించేందుకు రెండుమూడు రోజులు జాప్యమవుతుండటంతో బాధితుడి ద్వారా కుటుంబసభ్యులు, బయటి వ్యక్తులకు సోకుతోంది. ఈ నేపథ్యంలో మరొకరికి సోకకుండా ఎవరికైతే టెస్టింగ్‌ చేశారో ఆ వ్య క్తికి నిర్ధారణ అయే వరకూ ఇతరులను కలవకుండా జాగ్రత్తలు సూచించడం లో అధికారులు శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కేసులు పెరగడానికి ఇదొక కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


హాట్‌స్పాట్‌లేవీ..?

జిల్లాలో కరోనా కోరలు చాస్తున్నా.. పాజిటివ్‌ కేసులు వందలాదిగా నమోదవుతున్నా... హాట్‌స్పాట్‌లను గుర్తించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ప్రజలు విచ్చలవిడిగా తిరగాడేస్తున్నారు. గతంలో మాదిరిగా ఎక్కడైతే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా గుర్తించి, అక్కడి ప్రజలను అప్రమత్తంచేసేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలకు తిలోదకాలిచ్చారంటే కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం అశ్రద్ధ చూపుతోందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, కూరగాయలు, చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు, బస్సులు, ఆటోలు ఇలా ఎక్కడ చూసినా కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. ఎవరూ మాస్కులు ధరించకపోయినా.. పట్టించుకోవడం లేదు. భౌతికదూరమన్నది బహుదూరంగా మారింది. జిల్లా కేంద్రంలో టీ కేఫ్‌లు, హోటళ్లు, కూడళ్లు నిత్యం జనంతో కిటకిటలాడిపోతున్నాయి. అయినా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి అత్యధికంగా కనిపిస్తోంది. జిల్లాలో బుధవారం నమోదైన 297 పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా అనంతపురంలోనే వచ్చాయి. కేసులు ఏయే ప్రాంతాల్లో నమోదయ్యాయో స్పష్టంగా అధికారులు వెల్లడించడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు. ఇలా హాట్‌స్పాట్లను గుర్తించకపోవడం మూలంగా కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారులు కరోనా కట్టడికి ఏకైక మార్గంగా హాట్‌స్పాట్‌లను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


కొవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించినా.. బాధితులేరీ...?

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లా యంత్రాంగం 8 కొవిడ్‌ ఆస్పత్రులను గుర్తించింది. వాటిలో చికిత్స కోసం చేరే బాధితుల సంఖ్యను పోలిస్తే.. పాజిటివ్‌ కేసులకు చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్యకు పొంతన లేకుండాపోతోంది. జిల్లాలో 1382 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. అధికారులు గుర్తించిన మేరకు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోని కొవిడ్‌ సెంటర్‌లో 94, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రిలో 176 మంది దాకా చికిత్స పొందుతున్నారు. కదిరి, గుంతకల్లు, హిందూపురం తదితర ఏరియా ఆస్పత్రుల్లో ఆ సంఖ్య వందలోపే ఉంది. అంటే మిగిలిన 1000 మందిదాకా కరోనా బాధితులు ఎక్కడ చికిత్స పొందుతున్నారో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పాజిటివ్‌ అని తేలగానే ఆ బాధితుడిని కొవిడ్‌ సెంటర్‌కు తరలించి, మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఎవరికి వారు చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కరోనా బాధితుల పట్ల యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విస్మరిస్తే గతం పునరావృతమయ్యే పరిస్థితులు లేకపోలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


14 రోజుల్లో 1659 కేసులు..

జిల్లాలో కరోనా వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో చెప్పటానికి ఈ నెలలో ఇప్పటి వరకూ అంటే.. 14 రోజుల్లో నమోదైన 1659 కేసులే నిదర్శనం. 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నాయో గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గతేడాది మార్చి 29 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకూ 68422 మంది కరోనా బారిన పడగా... 602 మంది చనిపోయారు. మరో 67495 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మిగిలిన 325 మంది చికిత్స పొందుతున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 70081 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 611 మంది చనిపోయారు. 68088 మంది కరోనా నుంచి కోలుకున్న వారిలో ఉన్నారు. మిగిలిన 1382 మందిలో కొందరు అధికారులు గుర్తించిన కొవిడ్‌ సెంటర్లలో వైద్యసేవలు పొందుతుండగా.. మరికొందరు ఎవరికి వారు వైద్యం చేయించుకుంటున్నారు.

Updated Date - 2021-04-15T06:39:37+05:30 IST