బెంబేలెత్తిస్తోన్న కరోనా

ABN , First Publish Date - 2021-04-18T06:17:30+05:30 IST

జిల్లా ప్రజానీకాన్ని కరోనా బెంబేలెత్తిస్తోంది.

బెంబేలెత్తిస్తోన్న కరోనా

కేసులు ఉధృతం 

ఒక్కరోజే 420 నమోదు

అప్రమత్తత వీడితే  ప్రమాదం పొంచి ఉన్నట్లే

ఆంక్షల కఠినతరంతోనే  నియంత్రణ

ఆగిన కరోనా పరీక్షలు


అనంతపురం, ఏప్రిల్‌17(ఆంధ్రజ్యోతి): 

జిల్లా ప్రజానీకాన్ని కరోనా బెంబేలెత్తిస్తోంది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 420 కేసులు నమోదయ్యాయి. సెకెండ్‌వేవ్‌లో ఈ స్థాయిలో కేసులు నమోదవటం జిల్లాలో ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం స్వీయనియంత్రణ పాటించకపోయినా కరోనా అంటుకోవటం ఖాయం. ఇప్పటికే జిల్లాలో కరోనా వైర్‌సతో 615 మంది మృతిచెందారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కొన్ని కుటుంబాల జీవన ప్రమాణాలు అతలాకుతలం కాగా... మరికొన్ని దీనావస్థలో కాలం వెల్లబుచ్చుతున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సెకెండ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే మాస్కు ధరించడం తప్పనిసరి చేసుకోవడంతోపాటు భౌతికదూరాన్ని పాటిస్తేనే కరోనాకు చిక్కకుండా ఉంటారు. ప్రజలు ఎవరికివారు బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది. జిల్లా యంత్రాంగం కరోనా కట్టడి విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సి ఉంది. పోలీసుశాఖ ఈ విషయంలో ఆంక్షలను కఠినతరం చేయాల్సి ఉంది. రద్దీ ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, టీ కేఫ్‌లు, సినిమాహాళ్లు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిఒక్కరూ మాస్కు ధరించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.


నాలుగు రోజులుగా ఆగిన కరోనా పరీక్షలు

జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు విరివిగా చేయాల్సిన జిల్లా యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రజల నుంచి శాంపిళ్లు సేకరిస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నాలుగు రోజులుగా ల్యాబ్‌లో పరీక్షలు ఆగిపోవడమే ఇందుకు నిదర్శనం. అదేమంటే సర్వర్‌డౌన్‌ సాకు చూపుతున్నారు. కరోనా కట్టడికి ఏకైక మార్గం పరీక్షలు నిర్వహించడమే. ఆ విషయాన్నే అధికారులు మరచిపోవటం వల్ల వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు 5 వేల శాంపిళ్లు.. పరీక్షల కోసం నిరీక్షిస్తున్నాయి.


జిల్లా కేంద్రంలోనే 151 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో శనివారం నమోదైన 420 పాజిటివ్‌ కేసుల్లో.. అనంత ననగరంలోనే 151 ఉన్నాయి. మిగిలిన కేసులు 44 మండలాల్లో నిర్ధారణ అయ్యాయి. మండలాల వారీగా.. ధర్మవరం 49, గుంతకల్లు 57, హిందూపురం 18, పెనుకొండ, రాయదుర్గం 12, గాండ్లపెంట 9, బుక్కరాయసముద్రం, తాడిపత్రి 8, తాడిపత్రి, ఓబుళదేవరచెరువు 7, పామిడి, గుత్తి, కదిరి 5, మిగిలిన మండలాల్లో 1 నుంచి 4 వరకూ కేసులు వచ్చాయి. ఇతర జిల్లాలకు సంబంధించి ముగ్గురు, కర్ణాటక వాసులు ఇద్దరు వైరస్‌ బారిన పడ్డారు.

Updated Date - 2021-04-18T06:17:30+05:30 IST