శాంపిళ్లు తగ్గినా.. తగ్గని వైరస్‌

ABN , First Publish Date - 2021-06-23T06:54:41+05:30 IST

కరోనా నియంత్రణకు శాంపిళ్ల సేకరణ చాలా కీలకం. జిల్లాలో కొన్ని రోజులుగా శాం పిళ్ల సేకరణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

శాంపిళ్లు తగ్గినా.. తగ్గని వైరస్‌
శాంపిళ్లు తగ్గినా.. తగ్గని వైరస్‌

కేసుల ప్రకటనలోనూ అరకొర సమాచారం

264 మందికి కరోనా పాజిటివ్‌

మరో నలుగురు మృతి

అనంతపురం వైద్యం, జూన్‌22: కరోనా నియంత్రణకు శాంపిళ్ల సేకరణ చాలా కీలకం. జిల్లాలో కొన్ని రోజులుగా శాం పిళ్ల సేకరణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇటీవలి వరకు రోజూ 6 వేల నుంచి 7 వేలకు పైగానే శాంపిళ్లు సేకరించి, నిర్ధారణ ప రీక్షలు నిర్వహించేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం సగానికి పడిపోయింది. ఆదివారం 2039 శాంపిళ్లు సేకరించి, పరీక్షలు చేయగా.. 128 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ లెక్కన కరోనా పాజిటివిటీ రేటు 6.28గా తేలింది. సోమవారం 3561 శాంపిళ్లు పరీక్షించగా.. 264 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ లెక్కన పాజిటివిటీ రేటు 7.41 శాతంగా నమోదైంది. వీటిని పరిశీలిస్తే శాంపిళ్లు తగ్గినా కరోనా పాజిటివిటీ అధికంగానే కనిపిస్తోంది. వైద్యశాఖ సైతం శాంపిళ్ల సేకరణపై శ్రద్ధ చూపడం లేదు. జనం కూడా గతంలో ఏమాత్రం అనుమానం అనిపించినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవడానికి పరుగులు తీసేవారు. ప్రస్తుతం అలాంటి అనుమానపు లక్షణాలు కనిపించినా శాంపిళ్లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. సొంతంగా కొందరు వైద్యం తీసుకుంటుండగా.. మరికొందరు డాక్టర్లను అడిగి వారు చెప్పిన మేరకు చికిత్స పొందుతున్నారు. దీనివల్ల కూడా శాంపిళ్ల సేకరణ జిల్లాలో భారీగా పడిపోయినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం అధికార యంత్రాంగానికి తెలిసినా.. పట్టించుకోవడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది కూడా ఇదే త మకు మేలని మౌనంగా ఉండిపోతున్నారు. అనుమానపు కరో నా లక్షణాలున్నవారు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. ప్ర యాణాలు చేస్తున్నారు. దీనివల్ల తగ్గుతున్న కరోనా ప్రభావం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం శాంపిళ్ల సేకరణ విషయంలో అశ్రద్ధ చూపకుండా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి శాంపిల్‌ తీసి, పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.


కేసుల ప్రకటనలోనూ అరకొరే..

జిల్లాలో కరోనా కేసుల ప్రకటనలోనూ యంత్రాంగం అరకొర సమాచారమే ఇస్తోంది. గతంలో 24 గంటల్లో ఎన్ని పాజిటివ్‌ కేసులు వచ్చాయి, ఏ నగరం, ఏ నియోజకవర్గం, మండలాల్లో ఎన్నెన్ని కేసులు నమోదయ్యాయో అధికారికంగా తెలిపేవారు. దాని ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉంటూ కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటించేవారు. ప్రస్తుతం ఒక్కరోజులో ఎన్ని కేసులు వచ్చాయి, ఎంతమంది చనిపోయారో వాటి వివరాలు తెలిపి, యంత్రాంగం చేతులు దులుపుకుంటోంది. దీనిపైనా జనం నుంచి విమర్శలు వస్తున్నాయి.


కొత్తగా 264 కేసులు... నలుగురు మృతి

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారికి మరో నలుగురు బలయ్యారు. దీంతో జిల్లాలో మొత్తమ్మీద కరోనా కేసుల సంఖ్య 152425కి చేరింది. ఇందులో 150313 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1034 మంది మరణించారు. ప్రస్తుతం 1078 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-06-23T06:54:41+05:30 IST