కరోనా వ్యాప్తి చెందుతున్నా.. పట్టించుకోని టీచర్లు..

ABN , First Publish Date - 2021-04-16T06:34:48+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. విద్యాశాఖ మాత్రం మేల్కోవడంలేదు. ఏ పాఠశాలలోనూ కరోనా నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు నిదర్శనం.

కరోనా వ్యాప్తి చెందుతున్నా.. పట్టించుకోని టీచర్లు..
కురుగుంటలోని ఎస్‌ఎఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో భౌతికదూరం లేని, మాస్కులు ధరించని విద్యార్థులు

గాలికొదిలేశారు..!

మాస్కులు ధరించని విద్యార్థులు.. కనిపించని భౌతికదూరం

అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి

పిల్లలను బడికి పంపేందుకు జంకుతున్న తల్లిదండ్రులు

‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో వెల్లడైన వాస్తవాలివీ..

అనంతపురం, ఏప్రిల్‌15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. విద్యాశాఖ మాత్రం మేల్కోవడంలేదు. ఏ పాఠశాలలోనూ కరోనా నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు నిదర్శనం. విద్యార్థులెవరూ మాస్కులు ధరించడం లేదు. భౌతికదూరం అసలే పాటించడం లేదు. ఏ పాఠశాలలోనూ శానిటైజర్లు అందుబాటులో లేవు. విద్యార్థులకు ఽథర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించడం లేదు. వీటిని బట్టి చూస్తే.. విద్యాశాఖ కరోనా లేదన్న భావనలోనే ఉందనడంలో సందేహం లేదు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కరోనా నిబంధనలు ఏ మేరకు అమలవుతున్నాయి...? విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఏ మేరకు శ్రద్ధ తీసుకుంటున్నారు..? అనే అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ గురువారం పలు పాఠశాలలను క్షేత్రస్థాయిలో విజిట్‌ చేసింది. జిల్లా వ్యాప్తంగా 63 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను విజిట్‌ చేయగా... కేవలం 10 శాతం పాఠశాలల్లో మాత్రమే కరోనా నిబంధనలు అరకొరగా అమలవుతున్న విషయం తెలిసింది. 90 శాతం పాఠశాలల్లో కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. క్షేత్రస్థాయిలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా జిల్లాలో అత్యధిక పాఠశాలల్లో కరోనా నిబంధనలు అమలు కావడం లేదన్నది నిర్వివాదాంశం. విద్యాశాఖ ఉన్నతాధికారులు మొదలుకొని... ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు కరోనా నిబంధనలు పట్టడం లేదు. విద్యార్థులే  కాదు.. ఉపాధ్యాయులు సైతం మాస్కులు ధరించడం లేదు. కరోనా వైరస్‌ ప్రమాదకరమని తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు మాస్కు లు ధరించినా.. ధరించకపోయినా.. భౌతికదూరం పాటించకపోయినా.. టీచర్లు పట్టించుకోవడం లేదు. జిల్లాలో కరోనా సెకెండ్‌వేవ్‌ ప్రారంభ దశలోనే రోజూ వందలాది పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 1992 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 11 మంది మృతి చెందారు. కరోనా బాధితుల్లో ఉపాధ్యాయు లు, విద్యార్థులు లేకపోలేదు. అయినా జిల్లాలో ఏ పాఠశాలలోనూ కరోనా నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. నిబంధనలను అమలు చేయడంలోనూ జిల్లా విద్యాశాఖ శ్రద్ధ చూపడం లేదు. జిల్లాలో కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో విద్యార్థినీవిద్యార్థులు దాని బారిన పడకుండా మాస్కు ధరించేలా.. భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు చేతులెత్తేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు జంకుతున్నారు. దీంతో పాఠశాలల్లో హాజరుశాతం భారీగా పడిపోతోంది. విద్యాశాఖ అలసత్వమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుండటం గమనార్హం. ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో వెల్లడైన వాస్తవాలను పరిశీలిస్తే... 

- అనంతపురం రూరల్‌ మండలం ఏ. నారాయణపురం పంచాయతీ భాగ్యనగర్‌లో ఉన్న ఎస్‌ఎఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలలో విద్యార్థులెవరూ మాస్కు ధరించలేదు. భౌతికదూరానికి తావులేదు. దీనికితోడు విద్యార్థులందరూ ఒకేచోట కూర్చుని, భోజనం చేయడం కనిపించింది. ఇదే మండలంలోని ఓ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినా అప్రమత్తం కావడం లేదు. దీన్నిబట్టి చూస్తే.. విద్యార్థుల ఆరోగ్యాల పట్ల టీచర్లు ఏపాటి శ్రద్ధ చూపుతున్నారో అర్థమవుతోంది. 

- బుక్కరాయసముద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ మొత్తం 600 మందికిపైగా విద్యార్తినీవిద్యార్థులున్నారు. వీరిలో కొవిడ్‌ భయంతో కేవలం 300 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో ఏ ఒక్కరూ మాస్కు ధరించలేదు. సాధారణ రోజుల్లో ఏ విధంగా తరగతి గదుల్లో కూర్చుంటారో అలానే ఒకరికొకరు ఆనుకొని కూర్చున్నారు. దీంతో భౌతికదూరం ఎక్కడా కనిపించలేదు. కరోనా వ్యాప్తి చెందనున్న నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించాలనీ, తరగతి గదులు, బయట గుంపులుగుంపులుగా ఉండకూడదని ఆ పాఠశాల టీచర్లు.. విద్యార్థులకు చెప్పిన దాఖలాలు లేవు. విద్యార్థులే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు.

- కదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులెవరూ మాస్కు లు ధరించకపోగా.. ఒకే బెంచీపై ముగ్గురు, నలుగురు కూర్చున్నారు. ఇక్కడి టీచర్లు.. కరోనా జాగ్రత్తలు చెప్పడంలో అశ్రద్ధ వహిస్తున్నారు.

- గుత్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయు డు మాస్కు ధరించకపోగా.. తన చుట్టూ విద్యార్థినీవిద్యార్థులను నిలుచోబెట్టుకొని పాఠాలు చెబుతున్నారు. ఈ పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థీ మాస్కు ధరించకపోవడం గమనార్హం. క్లాసు రూములో విద్యార్థులు ఎవరికి వారు దగ్గరదగ్గరగా కూర్చొని, చదువుకుంటున్నా... భౌతికదూరం పాటించాలని సంబంధిత టీచర్‌ చెప్పకపోవడం చూస్తే.... కరోనా నిబంధనలకు అయ్యవార్లే తిలోదకాలిస్తున్నారు.

- తలుపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాస్కుల్లేకుండానే తరగతులకు హాజరవుతున్నారు. పాఠశాలలో శానిటైజర్‌ కనిపించడం లేదు. భౌతికదూరం బహుదూరమే. విద్యార్థినులు ఒకరి మోకాళ్లు ఒకరు తాకేలా కూర్చున్నారు. పాఠశాలలో ఒకరిద్దరు మినహా... మిగిలిన వారంతా మాస్కులు ధరించలేదు. కరోనా నిబంధనలు ఆ పాఠశాల అధ్యాపకులు ఏ మేరకు అమలు చేస్తున్నారో అర్థమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అధ్యాపకులే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుండటం గమనార్హం. 

- శింగనమలలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 300 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా.. ఏ ఒక్కరూ మాస్కులు ధరించడం లేదు. క్లాసురూముల్లోనూ, క్రీడా మైదానంలోనూ భౌతికదూరం పాటించడం లేదు. విద్యార్థుల వ్యవహారం అలా ఉండగా.. ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సైతం మాస్కులు ధరించకుండా.. చేతులకు గ్లౌజులు వేసుకోకుండా వంట చేయడంతోపాటు విద్యార్థులకు వడ్డిస్తున్నారు.

- గార్లదిన్నెలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే కాదు.. ఉపాధ్యాయులూ మాస్కులు ధరించడం లేదు. ఇక్కడ ఒక తరగతి గదిలో ఏకంగా 40 మంది విద్యార్థులను కూర్చోబెట్టి, పాఠాలు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ విద్యార్థులు గుంపులుగా కూర్చుని, భోజనం చేస్తున్నారు. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడంలో అధ్యాపకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

- రాప్తాడు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. విద్యార్థులు మాస్కులు దరించకున్నా, భౌతికదూరం పాటించకపోయినా.. అధ్యాపకులు నోరుమెదపడం లేదు. వారే మాస్కులు ధరించడం భారంగా భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గొందిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మాస్కులు ధరించకుండా, గుంపులుగుంపులుగా కూర్చున్నారు. అన్నం తినే సమయంలోనూ భౌతికదూరం పాటించలేదు. ఇలా అయితే కరోనా సోకే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

- చెన్నేకొత్తపల్లిలో కేజీబీవీ, ముదిగుబ్బ ఉన్నత పాఠశాలలో ఇరుకైన తరగతి గదుల్లో విద్యార్థులు ఇరుకిరుకుగా కూర్చుంటున్నారు. ఇక్కడ విశాలంగా కూర్చునేందుకు కూడా స్థలం చాలడం లేదు. బుక్కపట్నం బాలికల హైస్కూల్‌లో ఇటీవలే ఆరుగురు విద్యార్థులు కరోనా బారిన పడినా.. విద్యార్థులు మాస్కులు వేసుకునే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవడం లేదు. భౌతికదూరం పాటించే విధంగా వారిలో చైతన్యం నింపడం లేదు. కరోనా నిబంధనలు అమలు చేయడంలో ఇక్కడ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు తదితర మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

- హిందూపురం, పెనుకొండ నియోజక వర్గాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలకు పాతరేశారు. విద్యార్థులు మాస్కులు ధరించకుండానే పాఠశాలలకు హాజరవుతున్నారు. హిందూపురం ఎంజీఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తరగతి గదుల్లో భౌతిక దూరం, మాస్కులు, శానిటేషన్‌ నిబంధనలు పాటించకుండా గుంపులుగుంపులుగానే హాజరయ్యారు. గోరంట్ల ప్రాథమిక వంక పాఠశాల, పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి, రొద్దం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు మాస్కులు లేకుండా హాజరయ్యారు. పెనుకొండ, లేపాక్షి, చిలమత్తూరులో ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు విద్యార్థులు మాస్కులు ధరించగా కొందరు వేసుకోలేదు.

- యాడికి హైస్కూల్‌లో దాదాపు 800 మంది విద్యార్థులున్నారు. అత్యధిక శాతం మంది విద్యార్థులు మాస్కులు ధరించలేదు. క్లాసుల్లో భౌతికదూరం పాటించకపోవడమే కాకుండా మాస్కు లేకుండా పక్కపక్కన కూర్చోవడం కనిపించింది. ఈ హైస్కూల్‌లో 9వ తరగతి విద్యార్థికి కరోనా సోకింది. ఆ తరగతిలో 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఐదు రోజుల క్రితం విద్యార్థికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని విద్యార్థిగానీ, తల్లిదండ్రులుగానీ రహస్యంగా ఉంచి, పాఠశాలకు పంపారు. ప్రస్తుతం 70 మంది విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. వారికి ఇంతవరకు కొవిడ్‌ పరీక్షలు జరపలేదు. పెద్దవడుగూరులోని పాఠశాలలో 550 మందికిపైగా విద్యార్థులున్నారు. క్లాసుల్లో విద్యార్థులు భౌతికదూరం పాటించలేదు. పక్కపక్కన కూర్చోవడం కనిపించింది. ఏ ఒక్క విద్యార్థి మాస్కులు ధరించలేదు. మాస్కు లేకుండా పలువురు ఉపాధ్యాయులు.. విద్యార్థులనే అనుసరించారు.



- రాయదుర్గం పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీలో ఉన్న పాఠశాలలో చదువుతున్న చిన్నారులు మాస్కులు ధరించడం లేదు. ఇక్కడ ఉపాధ్యాయులు సైతం విద్యార్థులనే అనుసరిస్తున్నట్లుగా పరిస్థితులున్నాయి. బొమ్మనహాళ్‌ మండలంలోని గోనేహాళ్‌ క్రాస్‌లో ఉన్న శ్రీసాయిమారుతి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముప్పు పొంచివుందన్న విషయం తెలిసినప్పటికీ ఉపాధ్యాయులు ఏ మాత్రం కరోనా నిబంధనలు పాటించడం లేదు. ఒకే గదిలో 30 మందికి పైగా విద్యార్థులను పక్కపక్కనే కూర్చోబెట్టి, చదువులు చెబుతున్నారు. కరోనా నిబంధనలు ప్రచారానికే తప్పా... ఆచరించడానికి కాదన్న రీతిలో ఉపాధ్యాయులుండటం గమనార్హం.




- అనంతపురం రూరల్‌ మండలం ఏ. నారాయణపురం పంచాయతీ భాగ్యనగర్‌లో ఉన్న ఎస్‌ఎఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలలో విద్యార్థులెవరూ మాస్కు ధరించలేదు. భౌతికదూరానికి తావులేదు. దీనికితోడు విద్యార్థులందరూ ఒకేచోట కూర్చుని, భోజనం చేయడం కనిపించింది. ఇదే మండలంలోని ఓ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినా అప్రమత్తం కావడం లేదు. దీన్నిబట్టి చూస్తే.. విద్యార్థుల ఆరోగ్యాల పట్ల టీచర్లు ఏపాటి శ్రద్ధ చూపుతున్నారో అర్థమవుతోంది. 


- మడకశిర మండలంలోని ఛత్రం, కదిరేపల్లి, అగళి, అమరాపురం, గుడిబండ మండలం మందలపల్లి, రొళ్ల మండలం హెచ్‌టీహళ్లి గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా మాస్కులు ధరించడం లేదు. భౌతికదూరం పాటించడం లేదు. ఏ పాఠశాలలోనూ శానిటైజర్‌ కనిపించదు.


- కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు భౌతికదూరం పాటించడంలేదు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నా.. నివారణ చర్యలపై ఉపాధ్యాయులు చర్యలు చేపట్టడం లేదు. విద్యార్థులు సగానికి సగం పాఠశాలలకు హాజరు కావడం లేదు. 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నారు. కంబదూరు ఉన్నత పాఠశాలలో 620 మంది విద్యార్థులకుగాను 250 మంది హాజరయ్యారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టడంలో ఉపాధ్యాయులు చొరవ చూపడం లేదు.


- గుంతకల్లులోని ఎస్‌జేపీ ఉన్నత పాఠశాలలో కొవిడ్‌ నిబంధనలు పట్టించుకోవడంలేదు. కొందరు విద్యార్థులు మాస్కులు లేకుండా పాఠశాలకు వచ్చారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించకుండా ఒక బెంచీలో ముగ్గురు కూర్చున్నారు. ఒక్కో తరగతి గదిలో 50 నుంచి 60 మంది విద్యార్థులు కూర్చున్నారు. మాస్కులతో రావాలని విద్యార్థులకు చెప్పడంలో టీచర్లు విస్మరిస్తున్నారు. విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించడం లేదు. మండల కేంద్రంలోని శుభోదయ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో విద్యార్థులు మాస్కులు ధరించలేదు. భౌతికదూరం పాటించడం లేదు. శానిటైజర్‌ కూడా వాడటం లేదు. జడ్పీ ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులున్నా రు. తరగతి గదిలో  భౌతికదూరం  పాటించకుండా కూర్చుంటున్నారు. ఉపాధ్యాయులు కరోనా నిబంధనలు పాటించడం లేదు.


- కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు భౌతికదూరం పాటించడంలేదు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నా.. నివారణ చర్యలపై ఉపాధ్యాయులు చర్యలు చేపట్టడం లేదు. విద్యార్థులు సగానికి సగం పాఠశాలలకు హాజరు కావడం లేదు. 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నారు. కంబదూరు ఉన్నత పాఠశాలలో 620 మంది విద్యార్థులకుగాను 250 మంది హాజరయ్యారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టడంలో ఉపాధ్యాయులు చొరవ చూపడం లేదు.


- మడకశిర మండలంలోని ఛత్రం, కదిరేపల్లి, అగళి, అమరాపురం, గుడిబండ మండలం మందలపల్లి, రొళ్ల మండలం హెచ్‌టీహళ్లి గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా మాస్కులు ధరించడం లేదు. భౌతికదూరం పాటించడం లేదు. ఏ పాఠశాలలోనూ శానిటైజర్‌ కనిపించదు.

Updated Date - 2021-04-16T06:34:48+05:30 IST