కొవిడ్‌ టీకాకు సిద్ధం

ABN , First Publish Date - 2021-01-11T06:39:22+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా టీకా అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ నెల 16 నుంచి దేశంలో కరోనా టీకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తున్నామని కేంద్రం తెలిపింది.

కొవిడ్‌ టీకాకు సిద్ధం
జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో కోల్డ్‌ స్టోరేజ్‌లో కరోనా టీకా భద్రపరిచేందుకు సిద్ధంగా ఉంచిన రిఫ్రిజిరేటర్‌లు

జిల్లాకు చేరిన సిరంజ్‌లు, ఐస్‌బాక్స్‌లు

వ్యాక్సిన్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

అనంతపురం వైద్యం, జనవరి 10 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా టీకా అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ నెల 16 నుంచి దేశంలో కరోనా టీకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తున్నామని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్‌, జేసీలు, జిల్లా వైద్యశాఖ కరోనా టీకాకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తొలి విడతలో వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల్లోని సిబ్బందికి టీకా వేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఇప్పటికే సేకరించారు. జిల్లాలో 47818 మంది ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు.  టీకా నిల్వ చేసేందుకు ఐఎల్‌ఆర్‌, డీఎ్‌ఫలు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ అంతరాయానికి ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, ఇన్వర్టర్లు సిద్ధం చేశారు. వ్యాక్సిన్‌ ఉంచే కోల్డ్‌ స్టోరేజ్‌ను పర్యవేక్షించేందుకు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ క్యారియర్‌లు, ఐస్‌ప్యాక్‌లు, సిరంజ్‌లు అవసరం మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. జిల్లాకు 0.5 ఎంఎల్‌ సిరంజ్‌లు 4 లక్షలు ప్రతిపాదించగా 3 లక్షలు పంపించారు. 4500 వ్యాక్సిన్‌ క్యారియర్‌లు 30 వేలు ఐస్‌ప్యాక్‌లు పంపాలని కోరగా 3 వేలు ఐస్‌ప్యాక్‌లు 2వేలకు పైగా వ్యాక్సిన్‌ క్యారియర్‌లు జిల్లాకు ఆదివారం రాత్రి పంపించారు. ఇంకా శీతల పెట్టలు, రిఫ్రిజిరేటర్లు రావాల్సి ఉంది. మొత్తంమీద కొవిడ్‌ టీకాకు జిల్లా వైద్య శాఖ సిద్ధమైంది. 


30 ఆస్పత్రుల్లో టీకా 

జిల్లాకు టీకా ఎప్పుడు వచ్చినా 30 ఆస్పత్రులలో ప్రా రంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ 30 ఆస్పత్రులకు ఆమోదం లభించింది. అందు లో ఇందిరాగాంధీ నగర్‌ అర్బన్‌ ఆస్పత్రి(అనంతపురం) జిల్లా సర్వజనాస్పత్రి, కిమ్స్‌ సవీరా, గార్లదిన్నె పీహెచ్‌సీ, మలకవేముల పీహెచ్‌సీ, ఆర్డీటీ బత్తలపల్లి ఆస్పత్రి, కురుగుంట పీహెచ్‌సీ, యాడికి పీహెచ్‌సీ, పెద్దవడుగూరు పీహెచ్‌సీ, గుత్తి సీహెచ్‌సీ, ఎద్దులపల్లి పీహెచ్‌సీ, ఉరవకొండ సీహెచ్‌సీ, వజ్రకరూరు పీహెచ్‌సీ, శెట్టూరు పీహెచ్‌సీ, శాంతినగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, పట్నం పీహెచ్‌సీ, పుట్టపర్తి సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్ప త్రి, కొత్తచెరువు పీహెచ్‌సీ, గుట్టూరు పీహెచ్‌సీ, రొద్దం పీహెచ్‌సీ, హిందూపురం జిల్లా ఆస్పత్రి, లేపాక్షి పీహెచ్‌సీ, రొళ్ల పీహెచ్‌సీ, కల్లుమర్రి పీహెచ్‌సీ ఆస్పత్రులలో తొలి రోజు టీకా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 


ఎప్పుడొచ్చినా వ్యాక్సిన్‌ అందిస్తాం 

కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో ఇంకా పూర్తి సమా చారం లేదు. కానీ వ్యాక్సిన్‌ ఎప్పుడు వచ్చినా నిబంధనల మేరకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వైద్యు లు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. అన్ని ఆస్పత్రులలోను డ్రైరన్‌ నిర్వహించారు. ఎల్లుండి నుంచి డివిజన్ల వారీగా మరోసారి శిక్షణ ఇస్తాం. కలెక్టర్‌, జేసీలు, డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణలో అన్ని చర్యలు తీసు కుంటున్నాం. 

-  డాక్టర్‌ గంగాధర్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి


Updated Date - 2021-01-11T06:39:22+05:30 IST