కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన పంట ఉత్పత్తులకు నేటికీ డబ్బు చెల్లించని ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-24T06:29:21+05:30 IST

అష్టకష్టాలు పడి పంటలు పండించిన కరువు రైతును దగా చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేసిన పంటలకు డబ్బు చెల్లించకుండా రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన పంట ఉత్పత్తులకు నేటికీ డబ్బు చెల్లించని ప్రభుత్వం

ఎప్పుడిస్తారు?

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన పంట ఉత్పత్తులకు నేటికీ డబ్బు చెల్లించని ప్రభుత్వం

స్వచ్ఛంద సంస్థల మాయాజాలం

నాఫెడ్‌ తిరస్కరించడంతో 

బయట మార్కెట్‌లో పంట ఉత్పత్తుల విక్రయం

విషయాన్ని దాచి, డబ్బు చెల్లించకుండా జాప్యం

పోలీసులకు వెన్నపూసపల్లి రైతుల ఫిర్యాదు

నాలుగు రోజుల్లో ఇస్తామని.. పట్టించుకోని దుస్థితి

చోద్యం చూస్తున్న మార్క్‌ఫెడ్‌ అధికారులు

అనంతపురం వ్యవసాయం, జూలై 23: అష్టకష్టాలు పడి పంటలు పండించిన కరువు రైతును  దగా చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేసిన పంటలకు డబ్బు చెల్లించకుండా రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా బయట మార్కెట్‌లో పంటలు అమ్మేసి, మిన్నకుండిపోయాయి. రైతులకు నిజం చెప్పకుండా, డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు బండారం బయటపడటంతో అన్నదాతలు అవేదన చెందుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించినా.. మోసం చేయడం ఏంటని వాపోతున్నారు. గతేడాది ఖరీఫ్‌, రబీలో రైతులు ప ండించిన పలు రకాల పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నారు. జిల్ల్లావ్యాప్తంగా పప్పుశనగ, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటలకు సం బంధించి ఇప్పటిదాకా రూ.2.13 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. పంట కొనుగోలు చేసిన పక్షంరోజుల్లోనే డబ్బు జమ చేస్తామని చెప్పిన అధికారులు సకాలంలో రైతుల ఖాతాలకు జమ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం జిల్లాలో పప్పుశనగ, మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు చేశారు. వేరుశనగలను అంతకంటే కొన్నిమాసాల ము ందే కొన్నారు. తమకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారని మార్క్‌ఫెడ్‌ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నా ఫలితం లేకుండాపోతోంది. రైతులు ఎప్పుడు వెళ్లినా వారంరోజుల్లో డబ్బులు పడతాయని చెబు తూ కాలయాపన చేస్తున్నారు. మద్దతు ధర వస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రాల్లో పం టను అమ్మిన పాపానికి తమకు డబ్బు ఇవ్వకుండా తిప్పుకోవడం అన్యాయమని బాధిత రైతులు నిట్టూరుస్తున్నారు.


రూ.2.13 కోట్లు పెండింగ్‌లోనే..   

గతేడాది ఖరీఫ్‌, రబీలో పండిన పలు రకాల పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేశారు. జిల్ల్లావ్యాప్తంగా 9381 మంది రైతులతో రూ. 74.72 కోట్ల విలువైన 37800 మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తులు తీసుకున్నారు. అందుకు సంబంధించి చెల్లింపుల విషయంలో రూ.2.13 కోట్లు నేటికీ పెండింగ్‌లో ఉంచడం గమనా ర్హం. ఇందులో పప్పుశనగ రైతులకు రూ. 66 లక్షలు, మొక్కజొన్న రైతులకు రూ.1.04 కోట్లు, వేరుశనగకు రూ.8 లక్షలు, జొన్నకు రూ.35 లక్షలు ఇప్పటికీ చెల్లించాల్సి ఉంది. మార్క్‌ఫెడ్‌ జిల్లాస్థాయి అధికారులను పలుమార్లు సంప్రదించినా డబ్బు జమ చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతిసారీ కార్యాలయానికి వెళ్లి కలవలేని రైతులు ఫోన్‌ ద్వా రా మార్క్‌ఫెడ్‌ అధికారిని సంప్రదిస్తే కార్యాలయానికి వచ్చి కలవాలంటూ ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలిసింది. ఇదివరకే కార్యాలయానికి వచ్చామనీ, ఎన్నిసార్లు తిరగాలంటూ రైతులు నిట్టూరుస్తున్నారు.




పప్పుశనగలను బహిరంగ మార్కెట్‌లో అమ్మేసిన స్వచ్ఛంద సంస్థలు

జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిచూసుకుని, మార్క్‌ఫెడ్‌ అధికారులు కొనుగోలు చేసిన 2,500 క్వింటాళ్లకుపైగా పప్పుశనగ పంటను నాఫెడ్‌ ప్రతినిధులు తిరస్కరించారు. నిబంధనల మేరకు ఆ పంటను తిరిగి రైతులకు ఇవ్వాల్సి ఉంది. కొన్ని మండలాల్లో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆ పంటను రైతులకు తెలియకుండా మూడు నెలల క్రితమే బహిరంగ మార్కెట్‌లో అమ్మేశారు. యల్లనూరు మండలం వెన్నపూసపల్లిలో ఇటీవల ఈ వ్యవహారం బయటపడింది. ఆ గ్రామంలో కొందరు రైతులకు డబ్బు జమ చేసి, మరికొందరికి వేయకపోవడంతో మార్క్‌ఫెడ్‌ జిల్లా కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో 442.5 క్వింటాళ్ల సరుకు గోదాముకు చేరలేదని చూపుతోందని మార్క్‌ఫెడ్‌ సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో కొనుగోలు చేసిన సంబంధిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని నిలదీయగా అసలు విషయం బయటకొచ్చింది. గోదాములో నా ఫెడ్‌ ప్రతినిధులు వెన్నపూసపల్లి రైతులకు చెం దిన 442.5 క్వింటాళ్ల పప్పుశనగలను తిరస్కరించినట్లు తెలిసింది. ఆ పంటను ఆయా రైతులకు వెనక్కివ్వకుండా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బహిరంగ మార్కెట్‌లో అమ్మేసినట్లు సమాచారం. సరుకు వెనక్కిచ్చారని రైతులకు తెలియజేయకుండా బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా మార్క్‌ఫెడ్‌ అధికారులు కప్పిపుచ్చినట్లు ఆరోపణలున్నాయి. సరుకు వెనక్కి పంపిన విషయాన్ని రైతులకు తెలియజేసినట్లు, గోదాముల్లోని సరుకును తీసుకువెళ్లాలని చెప్పినట్లు ఈనెల 5వ తేదీ మార్క్‌ఫెడ్‌ డీ ఎంకు లేఖ రాసినట్లు సృష్టించినట్లు విమర్శలున్నాయి. కొన్నినెలల క్రితమే బహిరంగ మార్కెట్‌లో సరుకు విక్రయించినా గోదాములోనే సరుకు ఉన్నట్లు ప్రకటించడంపై బాధిత రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీన వెన్నపూసపల్లి రైతులు స్థానిక పోలీసు స్టేషన్‌లో కొనుగోలు కేంద్రం నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల్లో రైతులకు డబ్బు ఇస్తామని ఒప్పుకున్నట్లు సమాచారం. అయినా ఇప్పటిదాకా డబ్బు చెల్లించకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించేందుకు రైతులు సిద్ధమైనట్లు తెలిసింది. ఉరవకొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లోనూ ఇదే తరహాలో వ్యవహారం నడిపినట్లు విమర్శలున్నాయి. ఆయా మండలాల్లో కొందరు రైతులకు సరుకు వెనక్కివ్వగా.. మరికొందరికి సరుకు వెళ్లకుండా బహిరంగ మా ర్కెట్‌లో విక్రయించి, ఆ డబ్బు అన్నదాతలకు చెల్లించకుండా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంఽధిత ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే సమస్య కొలిక్కివచ్చే అవకాశం ఉందని బాధిత రైతులు కోరుతున్నారు. మరి ఏ మేరకు జిల్లా యంత్రాంగం చొరవ చూపుతుందో వేచిచూడాల్సిందే.



మాకు చెప్పకుండా శనగలను అమ్మేశారు

మాకు చెప్పకుండా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పప్పుశనగలను బయట మార్కెట్‌లో అమ్మేశారు. కొనుగోలు కేంద్రంలో సరుకు బాగుందని కొనుగోలు చేసి, రసీదు ఇచ్చారు. నాలుగు నెలలైనా డబ్బు జమ చేయకపోవడంతో అనుమానం వచ్చి, రైతులందరం మార్క్‌ఫెడ్‌ కార్యాలయానికి వెళ్లాం. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది. తమతో కొనుగోలు చేసిన పంటను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బటయ మార్కెట్‌లో అమ్మేసి, మాకు డబ్బు చెల్లించకుండా మోసం చేశారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే నాలుగు రోజుల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పి, నేటికీ ఇవ్వలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో కొనుగోలు కేంద్రంలో పంట విక్రయిస్తే మోసం చేయడం అన్యాయం.   

- రైతు చంద్రమౌళి, వెన్నపూసపల్లి, యల్లనూరు మండలం


సగం డబ్బు ఇంకా జమ చేయలేదు

కొనుగోలు కేంద్రంలో 110 క్వింటాళ్ల మొక్కజొన్నలను విక్రయించా. ఒకే రోజు నా కుమారుడు, నా పేరుపై అమ్మిన పంటలో ఇప్పటిదాకా సగం డబ్బే జమ చేశారు. ఇంకా రూ.లక్షకుపైగా చెల్లించాల్సి ఉంది. మార్క్‌ఫెడ్‌ అధికారులను ఎప్పుడు అడిగినా వారంరోజుల్లో జమ చేస్తామని చెబుతున్నారే తప్పా.. వేయడం లేదు. మిగిలిన డబ్బు ఎప్పుడు జమ చేస్తారో అర్థం కావడం లేదు. మద్దతు ధర వస్తుందని కొనుగోలు కేంద్రంలో అమ్మితే డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు.

- రైతు నాగిరెడ్డి, వాసాపురం, యల్లనూరు మండలం 

Updated Date - 2021-07-24T06:29:21+05:30 IST