డీజిల్‌ ధర పెరగటంతో పెరిగిన ట్రాక్టర్‌ బాడుగ

ABN , First Publish Date - 2021-06-14T06:34:37+05:30 IST

జిల్లాలో రైతులను సేద్యపు కష్టాలు వెంటాడుతున్నాయి.

డీజిల్‌ ధర పెరగటంతో పెరిగిన ట్రాక్టర్‌ బాడుగ
పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతున్న దృశ్యం

సేద్యంపై ఇంధన భారం..!

అదే పంథాలో కూలీలను తరలించే వాహనాల అద్దెలు

కాడెద్దులు కనుమరుగవడంతో... దుక్కికి ట్రాక్టర్లే దిక్కు

ఏడాదికేడాదికీ పెరుగుతున్న ఖర్చులు

పెట్టుబడి సాయంతోనే సరిపెడుతున్న ప్రభుత్వం

పండించిన పంటకు గిట్టుబాటు ధర కరువు

భారంగా మారుతున్న వ్యవసాయం

అనంతపురం, జూన్‌13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులను సేద్యపు కష్టాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభంలోనే వర్షాలు బాగా పడటంతో అన్నదాతలు సేద్యపు పనుల్లో నిమగ్నమయ్యారు. రోజూరోజుకీ పెరుగుతున్న డీజిల్‌ ధరలతో ట్రాక్టర్‌ యజమానులు బా డుగలు పెంచుతుండటంతో రైతులపై అదనపు ఆర్థికభారం పడుతోంది. అసలే కాడెద్దులు కనుమరుగు కావడంతో పొలాలను దుక్కి చేసుకునేందుకు ట్రాక్టర్లే దిక్కయ్యాయి. పొలాలను దున్నేందుకు గతేడాది గంటకు రూ.700 నుంచి రూ.800 ట్రాక్టర్‌ యజమానులు బాడుగలు తీసుకునేవారు. ప్రస్తుతం డీజిల్‌ ధరలు పెరుగుదలను సాకును చూపుతూ రూ.1100 నుంచి రూ.1200 దాకా వసూలు చేస్తున్నారు. రెండెకరాలు పొలం దుక్కి చేసేందుకు గంట సమయం పడుతోంది. అంటే ఓ రైతు రెండెకరాల పొలాన్ని దుక్కి చేయించుకునేందుకు రూ.1200 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా పదెకరాల దుక్కి కోసం రూ.6 వేలు సమర్పించుకోవాల్సిందే. దుక్కుల కోసమే రూ.వేలకు వేలు ఖర్చవుతుండటంతో పంట సాగుకు ఇంక ఎంత అవుతుందోనని రైతులు ఆందోళన చెందు తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం భారమవుతోందన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.


80 శాతం మంది రైతులకు ట్రాక్టర్లే దిక్కు

జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 6.71 లక్షల హెక్టార్లు. ఇందులో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 4.76 లక్షల హెక్టార్లు కాగా.. మిగిలిన హెక్టార్లలో వివిధ రకాల పంట లు సాగు చేయాలన్నది అంచనా. జిల్లాలో దా దాపు 7 లక్షల రైతు కుటుంబాలున్నాయి. ఇందులో 20 శాతం మంది రైతులు మాత్రమే కాడెద్దులతో దుక్కి చేస్తున్నారు. మి గిలిన 80 శాతం మంది ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. దుక్కి కోసమే కాదు విత్తుకు సైతం ట్రాక్టర్లనే వినియోగిస్తున్నారు. విత్తు కోసం గంటకు రూ.1200 చెల్లించాల్సి వస్తోంది. కూలి రేట్లు అమాంతం పెరిగాయి. గతేడాది రూ.300 రోజుకూలి ఉండగా... వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఈ ఏడాది ఏకంగా రూ.500కి పెంచేశారు. దీంతో ఇక్కడ కూడా రైతుకు అదనపు భారం రూ.200 పడుతోంది. కూలీలను పొలాలకు తీసుకెళ్లేందుకు టెంపో, ఆటోలను సమకూర్చుకోవాల్సి ఉంది.  గతేడాది ఆటోకు రూ.600, టెంపోకు రూ.800 రోజు బాడుగ చెల్లించేవారు. ఈ ఏడాది ఆ బాడుగ కంటే అదనంగా రూ.200 ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. దీనికి కూడా డీజిల్‌ ధర పెంపే సాకుగా చూపుతున్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు గతేడాది కంటే 30 శాతానికిపైగా పెరగడంతో ఎకరా పూర్తిస్థాయిలో పంట సాగు చేసేందుకు రూ.25 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా ధరలు పెంచుకుంటూ పోతున్నా... నియంత్రించే నాథుడే కరువయ్యారు. దీంతో రైతన్నకు సేద్యపు కష్టాలు తప్పడం లేదు.


పెట్టుబడి సాయంతోనే సరిపెట్టుకుంటున్న ప్రభుత్వం

పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులతో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. వ్యవసాయమే జీవనాధారం కావడంతో దశాబ్దాలుగా కరువు రైతు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వ్యవసాయ ఖ ర్చులు ఏడాదికేడాదికీ పెరిగిపోతున్నా ఆరుగాలం కష్టించి పండించిన పంట అతివృష్టి, అనావృష్టితో చేతికందకుండాపోతున్నా కరువు రైతును కనికరించే నాథుడే లేడు. అరకొరగా పండించిన పంటకు గిట్టబాటు ధరలు కల్పించి, రైతన్నను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏడాదికి పెట్టుబడి సాయం (రైతు భరోసా) కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7500, కేంద్ర ప్రభుత్వం రూ.6000 ఇచ్చి, చేతులు దులుపుకుంటున్నాయి. రైతులకు మాత్రం ఆ సొమ్ము దుక్కి చేసుకునేందుకు కూడా సరిపోవడం లేదు.  ఇలాంటి దయనీయ స్థితిలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులకు వారు కోరుకున్నట్లుగా ఉపాధిహామీ పథకాన్ని వ్యవ సాయానికి అనుసంధానం చేయాల్సి ఉంది. తద్వారా కూలి ఖర్చులైనా తగ్గే అవకాశాలున్నాయి. ఆ దిశగా జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదన చేయాల్సి ఉంది.






భూములు అమ్ముకోవాల్సిందే

నాకు ఐదెకరాల పొలం ఉంది. రెండేళ్ల కిందట చీనీ మొక్కలు పెట్టా. అంతర పంటగా వేరుశనగ, టమోటా సాగు చేస్తున్నా. ఈ ఏడాది డీజిల్‌ ధరలు పెరగడంతో సేద్యపు ఖర్చులు రెట్టింపయ్యాయి. కాడెద్దులతో దుక్కి చేయించుకోవాలనుకున్నా.. ఎద్దులు కనిపించడం లేదు. ట్రాక్టర్లతోనే దుక్కి చేయించుకోవాల్సి వస్తోంది. గతేడాది గంటకు రూ.700 నుంచి రూ.800 తీసుకునేవారు. ఈ ఏడాది  రూ.1200 తీసుకుంటున్నారు. వ్యవసాయ పనులకు ఇతర గ్రామాల నుంచి కూలీలను తీసుకొచ్చి, తిరిగి ఇంటివద్ద వదిలేందుకు ఆటోకు రూ.600 బాడుగ చెల్లించేవాళ్లం. ఈ ఏడాది ఆటోవాళ్లు రూ.800కి పెంచేశారు. డీజిల్‌ ధరలు పెంచడంతో సేద్యం ఖర్చులు పెరిగాయి. ఇప్పటికే పంటలకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నాం. డీజిల్‌ ధరలు ఇలాగే పెంచుకుంటూపోతే అప్పులపాలవడంతోపాటు భూములు అమ్ముకోవాల్సిందే.

- మధు, రైతు, హంపాపురం


భూములు బీళ్లు పెట్టుకోవాల్సిందే

భూములు బీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఐదెకరాల పొలం ఉందని చెప్పుకోవడానికే పనికొస్తోంది. రైతుల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. సేద్యానికి ఐదెకరాలకు రూ.10 వేలు ఖర్చు వస్తోంది. ఇక విత్తు, కలుపు తీసేందుకు, పంటకోతకు మొత్తం కలిపి ఎకరాకు రూ.30 వేలు ఖర్చు వస్తోంది. తీరా పంట చేతికొ చ్చినాక గిట్టుబాటు ధర లేకపోవడంతో ఏదో ఒక ధరకు అమ్ముకుంటుండటంతో పెట్టుబడిలో అర్ధంకూడా రావడం లేదు. వేరుశనగ సాగుచేస్తే.. మరింత అప్పులపాలవుతున్నాం. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత తరుణంలో భూములు బీళ్లు పెట్టుకోక తప్పదు.

- నారాయణస్వామి, రైతు, బేతాపల్లి


వ్యవసాయమంటేనే భయమేస్తోంది

వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తోంది. ఏడాదికేడాదికీ సేద్యం, కూలీల ఖర్చులు పెరిగిపోతున్నాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు మాత్రం పెంచడం లేదు. డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో దుక్కి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. గతంలో రూ.800 బాడుగ తీసుకునే ట్రాక్టర్‌ యజమానులు ప్రస్తుతం రూ.1200 అడుగుతున్నారు. కూ లీల రేట్లు రూ.300 నుంచి రూ.500కి పెంచేశారు. ఇక విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి ఎరువులు, పురుగు మం దు వరకూ ఏడాదికేడాది ధరలు పెరుగుతున్నాయి. ఎకరా పంటసాగు చేయాలంటే రూ.25వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతోంది. దీంతో వ్యవసాయం భారంగా మారుతోంది.

- రైతు శ్రీనివాసులు, ఒంటారెడ్డిపల్లి


వ్యవసాయం చేయలేకున్నాం

చెప్పుకోవడానికే రైతులం. ఏడాదికేడాది వ్యవసాయం భారమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యవసాయం చేయలేకపోతున్నాం. రానున్న రోజుల్లో రైతుల పరిస్థితి ఇదే. ఆరు ఎకరాలు పొలం ఉన్నా... ఏడాదికేడాదికి అప్పులే మిగులుతున్నాయి. వర్షాలు పడటంతో పొలాలు దున్నేందుకు సిద్ధమయ్యాం. ఎద్దులు లేకపోవడంతో ట్రాక్టర్‌ను బాడుగకు పిలిస్తే... గంటకు రూ.1200 అడుగుతున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అయినా అప్పులు చేసి, వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వాలు మాత్రం డీజిల్‌ ధరలు పెంచుతూనే పోతున్నాయి. ఆ ప్రభావం రైతులపైనా పడుతోంది. భారమైనా వ్యవసాయం చేసి, పంటలు పండించినా.. ప్రభుత్వాలు మాత్రం గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వ్యవసాయమంటేనే ఎందుకులే అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.   

- సత్తార్‌ గోపాల్‌, రైతు, కందిగోపుల

Updated Date - 2021-06-14T06:34:37+05:30 IST