టెండర్‌ లేకుండా.. దండుకున్నారు..!

Jun 23 2021 @ 01:25AM
రైల్వే స్కూటర్‌ స్టాండు

రైల్వే స్కూటర్‌ స్టాండులో అక్రమాలు

అనధికార అనుమతులతో జేబుల్లోకి సొమ్ము

ఆరు నెలల్లో దాదాపు రూ. 20 లక్షలు స్వాహా

చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు

గుంతకల్లు, జూన్‌22: రైల్వే కమర్షియల్‌ శాఖ అధికారులు స్కూటర్‌ స్టాండు నుంచి తైలం తీశారు. ఆరు నెలల కిందట స్కూటర్‌ స్టాండు టెండర్‌ గడువు ముగిసింది. కొత్తగా టెండర్‌ పిలవకపోవడంతో అక్రమార్జనకు దారులు వెతుక్కున్నారు. టెండర్‌ గడువు ముగిసిన కాంట్రాక్టరు సుంకన్న తన మనుషులను స్కూటర్‌ స్టాండులో పనికి ఉంచి, వసూళ్లు చేయడం ప్రారంభించాడు. రోజుకు రూ.750 రైల్వే శాఖకు అప్పగిస్తూ వచ్చాడు. గత వారంలో రైల్వే విజిలెన్స్‌ దాడి జరగడంతో ఈ అక్రమం బయటపడింది. స్కూటర్‌ స్టాండు కాంట్రాక్టరు నుంచి కమర్షియల్‌ అధికారులు మామూళ్లు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడైంది. దీంతో కమర్షియల్‌ విభాగానికి చెందిన టికెట్‌ చెకింగ్‌ సూపర్‌వైజర్‌ వైపు అందరూ వేలెత్తి చూపుతున్నారు. రైల్వే విజిలెన్స్‌ అధికారులు ఈ బాగోతాన్ని బయటపెట్టి, ఐదు రోజులైనా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.


అక్రమ దందా సాగిందిలా..

గతేడాది నవంబరు 14వ తేదీన స్కూటర్‌ స్టాండు కాంట్రాక్టు ముగిసింది. రైళ్లు నడవకపోవడంతో రైల్వే అధికారులు ఈ స్కూటర్‌ స్టాండుకు టెండర్‌ నిర్వహించలేదు. దీంతో స్టేషన్‌ తనిఖీ అధికారి (ఎస్టీఐ) హోదాలో ఉన్న వై ప్రసాద్‌ అనుమతిచ్చారంటూ కాంట్రాక్టరు డీ సుంకన్న తన మనుషులను స్కూటర్‌ స్టాండులో ఉంచి, డబ్బు వసూలు చేశాడు. ఎస్టీఐ నియమించారంటూ కొందరు టికెట్‌ చెకింగ్‌ సిబ్బంది షిఫ్టుల వారీగా స్కూటర్‌ స్టాండులో డ్యూటీ నిర్వహించారు. అనధికార కాంట్రాక్టరు సుంకన్న రైల్వేకు రోజుకు రూ. 750 చొప్పున చెల్లించాడు. స్కూటర్‌ స్టాండులో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొందరు రైల్వే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 19వ తేదీన విజిలెన్స్‌ అధికారి షానవాజ్‌ ఆధ్వర్యంలో దాడులు చేశారు. స్కూటర్‌ స్టాండు వర్కరు వద్ద రూ.5,930 లభించడంతో స్వాధీన పరచుకున్నారు. షిఫ్టుకు దాదాపు 6 వేల లెక్కన రోజుకు ఎంత లేదన్నా రూ.10 వేలదాకా స్కూటర్‌ స్టాండులో ఆదాయం వస్తోందన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ లెక్కన నెలకు రూ.3 లక్షల చొప్పున ఆరున్నర నెలలకు రూ.18 నుంచి రూ.20 లక్షలదాకా ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.


ఎస్టీఐ చెప్పినందుకే..

స్కూటర్‌ స్టాండుపై దాడులు చేసిన విజిలెన్స్‌ అధికారులు నిజాలు చెప్పాలనీ, లేదంటే కఠిన చర్యలు తీసుకుని, జైలుకు పంపుతామని హెచ్చరించడంతో కాంట్రాక్టరు సుంకన్న పలు విషయాలను వెల్లడించాడు. ఎస్టీఐని బాధ్యుడిని చేస్తూ విజిలెన్స్‌ అధికారులకు అప్రూవల్‌ లెటర్‌ను ఇచ్చాడు. ఎస్టీఐ ప్రసాద్‌ తమకు అనధికారిక అనుమతులు ఇచ్చిన మేరకే తాము స్కూటర్‌ స్టాండును నిర్వహిస్తూ రోజుకు రూ. 750 చెల్లిస్తున్నామని లిఖితపూర్వకంగా విజిలెన్స్‌ అధికారులకు తెలియజేశాడు. కొన్నాళ్లు స్కూటర్‌ స్టాండు వద్ద డ్యూటీ నిర్వహించిన 11 మంది టికెట్‌ చెకింగ్‌ సిబ్బందిని విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించి, వారి నుంచి కూడా వివరణలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. వారు కూడా ఎస్టీఐ పేరునే బయటపెట్టినట్లు సమాచారం. ఈ విషయంగా ఎస్టీఐ, టీటీఈల మధ్య అభిప్రాయ భేదాలేర్పడినట్లు తెలుస్తోంది. టీటీఈలు ఎవరూ తన నుంచి డబ్బు తీసుకోలేదని సుంకన్న విజిలెన్స్‌ అధికారులకు తెలియజేశాడు.


చర్యల్లో జాప్యంపై విమర్శలు

స్కూటర్‌ స్టాండు నిర్వహణలో అక్రమాల విషయంగా విజిలెన్స్‌ దాడి జరిగి ఐదు రోజులైనా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. తనిఖీ అనంతరం జోనల్‌ కేంద్రానికి వెళ్లిపోయిన విజిలెన్స్‌, ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. ఈ విషయంగా సీనియర్‌ డీసీఎం ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ అక్రమంపై పూర్తిస్థాయిలో విచారించి, చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. తదుపరి చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కమర్షియల్‌ అధికారులు స్కూటర్‌ స్టాండు కాంట్రాక్టు నిర్వహణకు ఆగమేఘాలపై చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.