జలకలేనా..?

ABN , First Publish Date - 2021-06-14T06:39:17+05:30 IST

కరువు జిల్లాలో రైతుల పొలాల్లో జలకళలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.

జలకలేనా..?

ఉచిత బోర్ల పథకంలో రాజకీయం

అధికార పార్టీ అనుయాయులకే పెద్దపీట

అర్హులైన సామాన్య రైతులకు నిరాశే

తరచూ నిబంధనల మార్పుతో అడ్డంకులు  

హిందూపురం, మడకశిర 

నియోజకవర్గాలకు మోక్షమెప్పుడో..?

718 బోర్లు వేయడంతో సరిపెట్టిన వైనం

అనంతపురం వ్యవసాయం, జూన్‌ 13: కరువు జిల్లాలో రైతుల పొలాల్లో జలకళలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఉచిత బోర్ల పథకం అర్హులైన సామాన్య రైతులకు అందని ద్రాక్షలా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల అనుయాయులకు పెద్దపీట వేస్తుండటంతో సామాన్య రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యార న్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి దాకా వేసిన బోర్లలో స్థానిక అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు వేసినట్లు సమాచారం. సామాన్య రైతులు ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నా వాటిని పక్కనపెట్టి స్థానిక అధికార పార్టీ నాయకులు చెప్పిన వారి పొలాల్లోనే ముందుగా బోర్లు వేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. డ్వామా అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి, ఇష్ట్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అనుయాయుల దరఖాస్తులను మాత్రమే అప్‌లోడ్‌ చేసి, మిగతా వారివి పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో అర్హత కలిగిన రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో 36324 మంది రైతులు బోర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 22507 దరఖాస్తులను స్థానిక వీఆర్వోలు అప్రూవ్‌ చేయగా, 1629 మంది రైతుల పొలాల్లో జియాలజిస్టులతో సర్వే చేయించారు. వీటిలో డ్వామా ఏపీడీ స్థాయిలో 1456 దరఖాస్తులను అప్రూవ్‌ చేశారు. వాటిలో 1296 రైతులకు సంబంధించి పొలాల్లో బోర్లు వేసేందుకు అనుమతులు లభించాయి. ఇప్పటిదాకా రూ.5.39 కోట్లకుపైగా ఖర్చు చేసి, 718 మంది రైతుల పొలాల్లో బోర్లు వేయడంతో సరిపెట్టారు.


తరచూ నిబంధనల మార్పుతో అడ్డంకులు 

గతేడాది సెప్టెంబరు మాసంలో సీఎం జగన్‌ జలకళ పథకాన్ని ప్రారంభించారు. తొలిరోజుల్లో జిల్లాలో 10 బోర్లు వేసి, మిన్నకుండిపోయారు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ మార్పు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియనే ఆపేశారు. రెండు నెలలుగా మళ్లీ బోర్లు వేయడం ప్రారంభించారు. ఇప్పటిదాకా జిల్లావ్యాప్తంగా 718 బోర్లు వేశారు. పథకం అమలైనప్పటి నుంచి తరచూ నిబంధనలు మార్పు చేస్తూ వచ్చారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా నిబంధనలు మార్పు చేస్తూ వెళ్లడంతో పథకం అమలు ముందుకు సాగకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి. తొలుత భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా బోరులేని ప్రతి రైతు అర్హులుగా ప్రకటించారు. దీంతో ఇప్పటిదాకా బోరులేని రైతులు దరఖాస్తు చేసుకున్నారు. పథకం అమలైన మూడునెలల తర్వాత రెండున్నర ఎకరాల నుంచి ఆపైన ఎంత భూమి ఉన్నా పథకానికి అర్హులుగా చెప్పారు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు అనర్హులుగా ప్రకటించారు. దీంతో అప్పటిదాకా దరఖాస్తు చేసుకున్న రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు అన్యాయం వాటిల్లింది. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులు గ్రూపుగా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే గ్రూపుగా వారికి కూడా బోర్లు వేయిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా చిన్న, సన్నకారు రైతులను పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవల మళ్లీ నిబంధనల్లో మరో మార్పు చేశారు. రెండున్నర ఎకరాల నుంచి పదెకరాల్లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. పదెకరాలకుపైగా భూమి కలిగిన రైతులను అనర్హులుగా తేల్చడం గమనార్హం. ఇలా పలుమార్లు నిబంధనల్లో మార్పు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


రెండు నియోజకవర్గాలకు కాంట్రాక్టర్లను నియమించని వైనం

జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఉచిత బోర్లు వేసేందు కు ఒక్కో నియోజకవర్గానికి ఒక కాంట్రాక్టర్‌ను నియమిం చాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు హిందూపురం, మడ కశిర నియోజకవర్గాల్లో బోర్లు వేసేందుకు కాంట్రాక్టర్లను నియమించపోవడం విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లు లేకపోవడంతో ఆ రెండు నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణకే అవకాశం లేకుండా పోయింది. జలకళ పథకం ప్రారంభోత్సవం రోజే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు నియోజకవర్గాలకు కాంట్రాక్టర్లను నియమించకపోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకం ప్రారం భించి, పది మాసాలు కావస్తున్నా నేటికీ ఆ రెండు నియోజకవర్గాలకు కాంట్రాక్టర్లను నియమించకపోవడంపై ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు.


మరింత వేగవంతం చేస్తాం

జిల్లాలో అర్హులైన రైతుల పొలాల్లో జలకళ పథకం ద్వా రా ఉచిత బోర్లు వేయడాన్ని మరింత వేగవంతం చేస్తాం. నిబంధనల మార్పు నేపథ్యంలో ఇప్పటిదాకా కొంత జా ప్యం జరిగిన మాట వాస్తవమే. ఉచిత బోర్ల కోసం దర ఖాస్తు చేసుకున్న రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే చేయించి, అర్హులైన రైతుల దరఖాస్తులను అప్రూవ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఉచిత బోరు వేయిస్తాం. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే నేరుగా డ్వామా పీడీ కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కరిస్తాం.

Updated Date - 2021-06-14T06:39:17+05:30 IST