నాలుగు దశల్లో నిర్వహణ

ABN , First Publish Date - 2021-01-22T06:32:28+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయిందా..? పార్టీలు స్థానిక సమరానికి సిద్ధమయ్యాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

నాలుగు దశల్లో నిర్వహణ

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

రేపు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం

సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

ఎన్నికలపై వీడని ఉత్కంఠ

జిల్లాలో పంచాయతీల సంఖ్య 1044

మొత్తం ఓటర్లు 23,42,683

లోగుట్టుగా ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నం

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న విపక్షాలు

అనంతపురం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయిందా..? పార్టీలు స్థానిక సమరానికి సిద్ధమయ్యాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హై కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటమే ఇందుకు ప్రధాన కారణం. అదే క్రమంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కనిపించడంలేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్న క్రమంలో ఎన్నికలను రద్దు చేయాలన్నది ప్రభుత్వ వాదన. ఈ పరిణామాల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. మరో 24 గంటల్లో ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ స్థానిక సమరం ఉత్కంఠ రేపుతోంది. అధికార వైసీపీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించటం గమనార్హం. ఈ వరుస పరిణామాలను పరిశీలిస్తే అధికార పార్టీ స్థానిక ఎన్నికలకు ఇప్పట్లో సిద్ధంగా లేదనే సంకేతాలను పంపుతోందనడంలో సందేహం లేదు.


నేటితో ఉత్కంఠకు తెరపడేనా...?

పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ వీడటం లేదు. రెండువారాల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ మేరకు ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన వెంటనే.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఆ మరుసటి రోజే ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా లేమని ప్రభుత్వం.. హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావటంతోపాటు... ఎన్నికలను రద్దు చేశారు. సింగిల్‌ జడ్జి తీర్పు నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్‌ పిటీషన్‌పై ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ... గురువారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కోడ్‌ అమల్లోకి వచ్చినట్లయింది. ఈనెల 23 నుంచి ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తూ.. పిటీషన్‌ వేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటీషన్‌పై శుక్రవారం విచారణకు తీసుకోవటంతోపాటు ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన తీర్పును వెలువరించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం మేధావి వర్గం నుంచి వినవస్తోంది. 


నాలుగు దశల్లో ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈనెల 23న తొలి, 27న రెండు, 31న మూడు, ఫిబ్రవరి 4న నాలుగో దశలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఈనెల 23న ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఆ నాలుగు దశలకు సంబంధించి ఫిబ్రవరి 5న తొలి, 7న రెండు, 9న మూడు, 17న నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. తొలిదశ ఎన్నికలకు జనవరి 23న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.


జిల్లాలో1044 పంచాయతీలకు..

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరిస్తే జిల్లాలో 1044 పంచాయతీలతోపాటు 10744 వార్డులకు ఎన్నికలుంటాయి. 23,42,683 మంది గ్రామీణ ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 11,81,118, మహిళలు 11,62,406 మంది ఉన్నా రు. ఇతరులు 89 మంది ఓటర్లున్నారు. 11031 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లున్నాయి. ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతున్న నేపథ్యంలో ఏ దశలో ఏ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పంచాయతీ, వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారో సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


లోగుట్టుగా ఏర్పాట్లలో యంత్రాంగం

రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నాటి నుంచే జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో సంబంధిత అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. లోగుట్టుగా పనులు చక్కబెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ల జాబితాను రెవెన్యూ డివిజన్ల వారీగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి పక్కా సమాచారంతో నివేదికలను తయారు చేసినట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. న్యాయస్థానాల తీర్పును తూచ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంటుందన్న అభిప్రాయం పలువురు అధికారులే వ్యక్తపరుస్తున్నారు. అంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సరంజామాను సిద్ధం చేస్తున్నారన్నది నిర్వివాదాంశం.


సుప్రీం కోర్టుకెళ్లటమంటే.. నైతికంగా వైసీపీ ఓడినట్లే

స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగానైనా ఆపాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. హైకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చినా.. సుప్రీంకోర్టుకు వెళ్లటమంటే.. నైతికంగా వైసీపీ ఓడినట్లే. పట్టాల పంపిణీకి రాని కరోనా నిబంధనలు ఎన్నికలకు మాత్రమే అడ్డొస్తాయా? పట్టాల పంపిణీ సభల పేరుతో వేలాది మందిని బలవంతంగా తీసుకెళ్లి, ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. అప్పుడు కరోనా రాదా..? సామాజిక దూరం పాటించకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు వైసీపీకి లేవని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తోడ్పాటునందించాలి. 

- కాలవ శ్రీనివాసులు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు


ప్రభుత్వం భయపడుతోంది

పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతోందనే ఎన్నికల కమిషన్‌ను నిందిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తుంటే ప్రభుత్వం అడ్డుకునేలా కుట్ర చేస్తోంది. హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా సుప్రీం కోర్టుకు వెళ్లడమంటే వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనే సత్తాను కోల్పోయారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలు వైసీపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పటం ఖాయం.                  

- బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు



ఎన్నికలు నిర్వహించాల్సిందే

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిందే. అందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయకపోవడమంటే ఎన్నికలను ఎదుర్కొనేందుకు భ యపడుతోందనే అర్థం. హైకోర్టు తీర్పునిచ్చినా సుప్రీంకోర్టుకెళ్లటాన్ని చూ స్తుంటే ప్రజాధనాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తోంది. అధికారం ముసుగులో వైసీపీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతికి ఆ పార్టీ భయపడుతోంది. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారనే భయం ప్రభుత్వానికి పట్టుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఇదివరకు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను పూర్తిస్థాయిలో రద్దు చేసి, తిరిగి కొత్తగా విడుదల చేయాలి.

- జగదీష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి


మొండి వైఖరి మంచిది కాదు

పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించటం మంచిది కాదు. బేషజాలకు పోకుండా ఎన్నికలు నిర్వహించాల్సిందే. హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా.. ప్రభుత్వం మొండిగా సుప్రీం కోర్టుకెళ్లటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ మేరకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచన చేయాలి. 

- రాంభూపాల్‌, సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి



బేషరతుగా ఎన్నికలు నిర్వహించాలి

ప్రజాస్వామ్యబద్దమైన పంచాయతీ ఎన్నికలను బేషరతుగా నిర్వహించా లి. ఎన్నికలపై హైకోర్టు తీర్పును బీజేపీ ఆహ్వా నిస్తోంది. ఎన్నికల కమి షన్‌ ఆదేశాలను తప్ప కుండా పాటించాలి. ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ముందుకురావాలి. వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెల కొన్నందునే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు వెనకడుగు వేస్తున్నారు.

- సందిరెడ్డి శ్రీనివాసులు, బీజేపీ అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు


అధికారులు,  ఉద్యోగులు వద్దంటున్నారు ..

పంచాయతీ ఎన్నికల వి ధుల్లో పాల్గొనే ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికల నిర్వహణ వద్దని ముక్త కంఠంతో చెబుతున్నారు. అధికారులు, ఉద్యో గులు ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికల విధులకు హాజరు కాలేమంటున్నారు. రాష్ట్రంలోని ఉద్యో గులు, వైద్యుల అభిప్రాయాలకు అనుగుణంగా ఎన్నికల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు రావడం బాధాకరం.   

 - శంకరనారాయణ, మంత్రి 

Updated Date - 2021-01-22T06:32:28+05:30 IST