తీపి తగ్గిన మామిడి

ABN , First Publish Date - 2021-05-09T06:24:46+05:30 IST

మామిడి రైతుపై కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రభావం పడింది.

తీపి తగ్గిన మామిడి
మామిడి చెట్టుకు అరకొరగా కాచిన కాయలు

కరోనా సెకెండ్‌ వేవ్‌తో మామిడి ధర పతనం

రూ.లక్షల నుంచి వేలకు 

పడిపోయిన  ఫలరాజు విలువ.. అకాల 

వర్షంతో తగ్గిన దిగుబడి.. నష్టాల్లో రైతులు

అనంతపురం మే 8, (వ్యవసాయం/ధర్మవరం, రాయదుర్గం రూరల్‌) :  మామిడి రైతుపై కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రభావం పడింది. ఈ సారి దిగుబడి పర్వాలేదని అనిపించినా ధరలు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 50వేల హెక్టార్లలో వివిధ రకాల మామిడి తోటలున్నాయి. ఈ ఏడాది 25 వేల హెక్టార్లలో పంట వచ్చింది. జిల్లాలో జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో మామిడి పూత బాగా వచ్చింది. గతేడాది కంటే పూత పూసినా ఫిబ్రవరి మాసంలో అకాల వర్షానికి రాలిపోయింది. దీంతో దిగుబడిపై ప్ర భావం పడింది. పూత బాగా పూయడంతో దిగుబడి బాగా వస్తుందని ఆశించిన రైతులను అకాల వర్షాలు దెబ్బతీశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రధానంగా బేనీషా, మల్లిక, పెద్దరసాలు, తోతాపురి, మలుగుబా, నీలం, పునాసా వంటి రకాలు పండిస్తున్నారు. సాధారణంగా సరాసరి హెక్టారుకు 6 టన్నుల దాకా దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల అంచనా. కొన్ని ప్రాంతాల్లో ఈసారి హెక్టారుకు 4 టన్నులు, మరికొన్ని ప్రాంతాల్లో అంతకంటే తక్కువగా దిగుబడి వచ్చిందని రైతులు వాపోతున్నారు.


కరోనా సెకెండ్‌ వేవ్‌తో ధరలు తగ్గుముఖం

ఈ ఏడాది ప్రకృతి కన్నెర్ర చేయడం, కరోనా సెకెండ్‌ వేవ్‌తోపాటు సింగల్‌సూట్‌తో మామిడి రైతులు అతలాకుతలం అవుతున్నారు. అకాల వర్షాలతో పూత, పిందె రాలిపోయింది. కనీసం వచ్చిన దిగుబడితోనైనా పెట్టుబడులు దక్కించుకుందామని ఆశపడిన రైతన్నలను కరోనా సెకెండ్‌వేవ్‌ మరింత దెబ్బతీసింది. కరోనా సకెండ్‌ వేవ్‌ విజృభించినప్పటి నుంచి మామిడి ధరలు అమాంతం తగ్గుముఖం పట్టాయి. దీంతో పెట్టుబడి కూడా అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొందరు వ్యాపారులు, దళారులు కుమ్మక్కై, ధర తగ్గించడంతోపాటు  సూట్‌ రూపంలో మరింత దగా చేస్తున్నారు. హెక్టారుకు రూ.80వేల నుంచి రూ.లక్షదాకా పెట్టుబడి వస్తోంది. ఇన్ని వ్యయప్రయాసాలకోర్చి మామిడిని సాగుచేసినా రైతన్నకు చేదు అనుభవమే ఎదురవుతోంది.


బేనీషా టన్ను రూ.1.20 లక్షల నుంచి రూ.25వేలకు పతనం  

జిల్లాలో పక్షం రోజల నుంచి మామిడి కోతలు మొదలయ్యాయి.  ఇప్పటి దాకా సగం శాతం విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. గతేడాది డిసెంబరులో బేనీషా రకం టన్ను రూ.1.20 లక్షలు పలికింది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరు రకం రూ.80వేలు, ఫిబ్రవరిలో బేనీషా రూ.1.10 లక్షలు, బెంగళూరు రూ.60 వేలు, మార్చిలో బేనీషా రూ.80వేలు, బెంగళూరు రకం రూ.25వేలకు చేరింది. గతనెలారంభంలో బేనీషా రకం రూ.25 వేల నుంచి రూ.30వేలు, బెంగళూరు రకం రూ.15వేలు పలుకు తోంది. గత నెల మూడో వారం నుంచి ధరలు మ రింత తగ్గాయి. ప్రస్తుతం బేనీషా రూ.15వేల నుంచి రూ.25వేలలోపు బెంగళూ  రు రకాలు రూ.8వేల నుంచి రూ.10వేలకు పడిపోయాయి. 


సూట్‌ పేరుతో మరింత దగా  

మామిడి ధర పతనం కావడంతో కుదేలవుతున్న రైతన్నను సూట్‌ పేరుతో దళారులు మరింత దగా చేస్తున్నారు. జిల్లా నుంచి బెంగళూరు, మదనపల్లి, తదితర ప్రాంతాలకు మామిడి పంటను తరలించి అమ్మకాలు జరుపుతున్నారు. సూట్‌ పేరుతో టన్నుకు వందకేజీల చొప్పున ఫ్రీగా దోచేయడంతో మామిడి రైతు తీవ్రనష్టాల్లో కూరుకుపోతున్నాడు.


పక్షం రోజులుగా ధరలు తగ్గాయి

కరోనా సెకెండ్‌ వేవ్‌ నేపథ్యంలో పక్షం రోజులుగా మామిడి ధరలు తగ్గాయి. ఈసారి పూత బాగా వచ్చినప్పటికీ అకాల వర్షానికి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా సమయంలోనూ రవాణాకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా ధరలు తగ్గడంతో రైతులు ఇబ్బం దులు పడుతున్నారు.

 - చంద్రశేఖర్‌, ఏడీ, ఉద్యాన శాఖ



మిగిలేది అంతంతే..: రైతు ఈశ్వరయ్య, బుక్కపట్నం

అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి మామిడిపంటను సాగు చేసినా మిగిలేది అంతంత మాత్రంగానే ఉంది. ఈసారి పూత, పిందె సమయంలో అకాల వర్షాలతో దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయాం. హెక్టారుకు రూ.80వేల నుంచి రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టినా ఫలితం లేకుండా పోతోంది. పండించిన పంటను బెంగళూరు మార్కెట్‌కు తీసుకువెళితే మొదటిరకం బెనీషా టన్ను రూ.25వేలకే అమ్ముడుపోతోంది. బాడుగ, కూలీల ఖర్చు పోను మిగిలేది రూ.14వేల లోపే. ఆ డబ్బు పెట్టుబడులకు కూడా సరిపోవడం లేదు. స్థానికంగా అమ్ముకుందామని చూస్తే ఎన్నెన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. సూట్‌ అంటూ వ్యాపారులు, దళారులు మరింత దగా చేస్తున్నారు.



కరోనాతో ధరలు తగ్గాయి

జిల్లాలో కరోనా ఉధృతి మళ్లీ పెరగడం తో మామిడికాయల ధర తగ్గిం ది. ప్రభుత్వమే ఉద్యాన పంటలను కోనుగోలు చేస్తే కనీసం పెట్టుబడులైనా దక్కుతాయి. రైతుల ఖ ర్చులు పోను కేజీ మామిడికాయలు రూ.13 నుంచి రూ.15లకు అమ్మితే వ్యాపారులు మాత్రం రూ.80 నుంచి రూ. 100 వరకు అమ్ముకుని, లాభపడుతున్నారు. కష్టపడి పంట పం డించిన రైతులు మాత్రం నష్టపోతున్నారు.

- రైతు నారాయణస్వామి, బుక్కపట్నం



పూర్తిగా నష్టపోతున్నాం

రెండు సంవత్సరాల నుంచి మామిడి రైతులమంతా తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ యేడాది పూత బాగా రావడంతో దిగుబడి ఎక్కువగా వస్తుందని  ఆనందపడ్డాం. ఆకాల వర్షాలకు కాయలు, పూత సగానికి సగం రాలిపోవడంతో ఖర్చు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. చెట్లలో కాయలు ఎక్కువగా లేకపోవడంతో కొనడానికి వ్యాపారులు ముం దుకు రావడం లేదు. ఉన్న కాయలను అమ్ముకుందామంటే కరోనా కారణంగా అమ్మకానికి తీసు కువెళ్లలేని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి, మా మిడి రైతులను ఆదుకుంటే బాగుంటుంది.

- రైతు ఎర్రిస్వామి, రాయంపల్లి, రాయదుర్గం మండలం

Updated Date - 2021-05-09T06:24:46+05:30 IST