చిరస్థాయిగా సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-01-22T06:27:41+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ పేర్కొన్నారు.

చిరస్థాయిగా సంక్షేమ పథకాలు
అనంతపురంలో జెండా ఊపి రేషన్‌ మినీ ట్రక్కులను ప్రారంభిస్తున్న మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌.. వేదికపై జాయింట్‌ కలెక్టర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు

ప్రతి ఇంటికీ నాణ్యమైన సన్నబియ్యం

ఇంటివద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంతో నిరుద్యోగులకు ఉపాధి

మినీ ట్రక్కుల ప్రారంభ సభలో మంత్రి శంకరనారాయణ

అనంతపురం రూరల్‌, జనవరి 21 : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ పేర్కొన్నారు. గురువారం నగర శివారులోని తపోవనం సర్కిల్లో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీకి సంబంధించిన వాహనాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శంకరనారాయణ, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎంపీ గోర్లంట మాధవ్‌, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, ఉషాశ్రీచరణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ఊపి ట్రక్కులను ప్రారంభించారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ అనేది కొత్త అధ్యాయానికి నాంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా రూ.830 కోట్ల వ్యయంతో గుమ్మం వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం 9,260 మినీ ట్రక్కులను ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా జిల్లాలో 754 వాహనాలను ప్రారంభించామన్నారు. రేషన్‌ షాపుల వద్ద క్యూలైన్‌, అక్రమ తూకాలు, మోసాలకు చెక్‌ చెప్తూ నాణ్యమైన సరుకులు పంపిణీ చేసేందుకు ఈ వాహనాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఒక ట్రక్కు విలువ  రూ.6 లక్షలని, ఇందులో 10 శాతం లబ్ధిదారుల వాటా కాగా, బ్యాంకు రుణం 30 శాతం, 60 శాతం సబ్సిడీ మంజూరు చేశామన్నారు. వాహనాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పంపిణీ చేశామన్నారు. దీని ద్వారా ప్రతి నెల వారికి రూ.10 వేలు పారితోషికం, రూ.3 వేలు హమాలీ చార్జీ, ఇంధనం కోసం రూ.3 వేలు ఇస్తామన్నారు. ఎంపీ మాధవ్‌ మాట్లాడుతూ ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 10 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అయిందన్నారు. కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. ఒక్కో మినీ ట్రక్కు ప్రతిరోజు 90 మంది రేషన్‌ కార్డుదారులకు బియ్యం సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 754 ట్రక్కులకు డ్రైవర్‌ కం ఓనర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన సంచులను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు నిశాంత్‌కుమార్‌, సిరి, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌ పామిడి వీరాంజనేయులు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఫయాజ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, డిప్యూటీ కలెక్టర్‌ హరిప్రసాద్‌, ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, డీఎస్‌ఓ రఘురాంరెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వీఆర్వోలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 







Updated Date - 2021-01-22T06:27:41+05:30 IST