నాటు బాంబుల కలకలం

ABN , First Publish Date - 2021-01-16T06:35:08+05:30 IST

జిల్లాలో మరోసారి నాటుబాంబుల తయారీకి రంగం సిద్ధమైందా? ప్రత్యర్థులను అంతమొందించేందుకు నాటు బాంబులను కీలకంగా వాడేందుకు శ్రీకారం చుడుతున్నారా? ఆ క్రమంలోనే నాటుబాంబులు తయారీకి ఉపక్రమించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

నాటు బాంబుల కలకలం

ఎవరిని హత్య చేసేందుకో ఆ బాంబులు?

పోలీసుల అదుపులో తయారీదారులు

కనగానపల్లిలో భయాందోళన

అనంతపురం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరోసారి నాటుబాంబుల తయారీకి రంగం సిద్ధమైందా? ప్రత్యర్థులను అంతమొందించేందుకు నాటు బాంబులను కీలకంగా వాడేందుకు శ్రీకారం చుడుతున్నారా? ఆ క్రమంలోనే నాటుబాంబులు తయారీకి ఉపక్రమించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలోని ఫ్యాక్షన్‌ ప్రభావిత మండలాల్లో ఒకటైన కనగానపల్లి మండలంలో కొందరు నాటు బాంబుల తయారీదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రహస్యంగా వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నాటుబాంబులు తయారీదారులు ఎవరు...? వారి వెనుక ఎవరున్నారు...? ఎవరిని హత్య చేసేందుకు తయారు చేస్తున్నారనే కోణంలో పోలీసులు వారిని విచారిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడం, ప్రత్యర్థి వర్గాన్ని భయోత్పాతానికి గురిచేయడంలో భాగంగా గతంలో నాటుబాంబులు ఉపయోగించేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాటుబాంబులు తయారుచేసి ప్రత్యర్థుల ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేసేవారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్కృతి జిల్లాలో కనుమరుగవుతున్న నేపథ్యంలో మరోసారి నాటుబాంబుల తయారీదారులు పట్టుబడటం రాజకీయ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. నాలుగు రోజుల కిందట కనగానపల్లి మండలానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడితో పాటు నాటుబాంబుల తయారీ ముఠాకు చెందిన కనగానపల్లి, కంబదూరు మండలాలకు చెందిన మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. వారి నుంచి నాటుబాంబులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే పోలీసులు నాటు బాంబు ముఠాను పట్టుకునే సమయంలో ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న అధికార పార్టీకి చెందిన మండలస్థాయి నేత పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో గాలిస్తున్నట్లు తెలిసింది. అతను పోలీసులకు పట్టుబడితేగానీ... ఈ నాటుబాంబులు ఎవరిని హత్య చేసేందుకు తయారు చేస్తున్నా రు...? దీని వెనుక వ్యక్తిగత కక్షలా? లేక రాజకీయాలా..? అన్న ది బయటపడే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రత్యర్థి వర్గాలను ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడంలో భాగంగానే పాత తరహా విధానాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లుగా కూడా జోరుగా చర్చ సాగుతోంది. ఇదే సందర్భంలో కనగానపల్లి మండలానికి చెందిన ఓ ప్రముఖ నేతను టార్గెట్‌ చేసినట్లు ఆ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఘటన బయటపడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మండలస్థాయి నేతలు ఆందోళన చెందుతున్నారు. మొన్నటిదాకా ఫ్యాక్షన్‌ తరహా కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆ మండల ప్రజలు ఈ బాంబుల కలకలంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ క్షణానా ఏ గ్రామంలో ఈ నాటుబాంబులు దద్దరిల్లుతాయోనన్న భయాందోళనల్లో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. దీనికి బలం చేకూర్చే విధంగా ఆ మండలానికి చెందిన ప్రత్యర్థి వర్గం నేతలు కొందరు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోగా.... మరికొందరు జిల్లా కేంద్రానికే పరిమితమయ్యారన్న ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉండగా... గతంలోనూ ఈ మం డలంలో నాటుబాంబులు పేలి గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. 2016లో శివపురం గ్రామంలో నాటుబాంబులు పేలి ఇద్దరు గాయపడ్డారు. అదే మండలంలోని మద్దలచెరువులోనూ ఇదే తరహా ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-01-16T06:35:08+05:30 IST