మున్సిపోల్స్‌కు కదలిన వలంటీర్లు!

ABN , First Publish Date - 2021-03-01T06:17:18+05:30 IST

మున్సిపోల్స్‌కు వలంటీర్ల దండు కదిలింది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ పనులు గుట్టుగా సాగించిన ఆ దండు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను క్షేత్రస్థాయిలో భూజానికెత్తుకుంది.

మున్సిపోల్స్‌కు కదలిన వలంటీర్లు!

ఇంటింటికీ వెళ్లి వైసీపీ అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థన

గెలిపిస్తే సరి.... లేదంటే పథకాలు రద్దవుతాయన్న హెచ్చరికలు

మహిళా సంఘాలతోనూ సమావేశాలు

ఎన్నికల సంఘం నిబంధనలు పట్టించుకోని వైనం

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల తీరిది

అనంతపురం,ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి) : మున్సిపోల్స్‌కు వలంటీర్ల దండు కదిలింది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ పనులు గుట్టుగా సాగించిన ఆ దండు  మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను  క్షేత్రస్థాయిలో భూజానికెత్తుకుంది. ప్రతి గడపనూ తడుతూ.... వైసీపీ అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులు గెలిస్తే సరి... లేకుంటే పథకాలు రద్దవుతాయన్న భయాన్ని ఓటర్లలో కలిగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తొలి నుంచి వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని పాలకేతర పార్టీలన్నీ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల సమయంలోనే వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినా... జిల్లాలో ఆ నిబంధనలు అమలు కాలేదు. తాజా గా.... మున్సిపల్‌ ఎన్నికల విషయంలోనూ అదే పునరావృతమవుతోంది. స్వయంగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎ న్నికల్లో వలంటీర్ల  ప్రమేయం ప్రత్యక్షంగా గానీ... పరోక్షంగా గానీ కనిపించకూడదని అధికారులకు సూచించారు. వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ సెల్‌ఫోన్లలో డేటా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిన విషయం అందరికీ ఎరుకే. అయినా... జిల్లాలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అధికార పార్టీ నేతలకు ఏమాత్రం పట్టట్లేదనే విధంగా పలు సంఘటనలు  క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి. 


గడపగడపనూ తడుతూ...

అధికార పార్టీ నేతల ఆదేశాలతో వలంటీర్లు ఆ పార్టీ అభ్యర్థులకు ప్రచారకులుగా మారిపోయారని క్షేత్రస్థాయిలో పరిస్థితులే చెబుతున్నాయి. ఒక్కో వలంటీర్‌ వారికి కేటాయించిన ఇళ్ల గడపను తడుతున్నారు. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఏకంగా పార్టీ కార్యకర్తల స్థాయిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటు అభ్యర్థించే పని తమది కాదని ఎదురు చెప్పే పరిస్థితి లేకపోవటంతో అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయాల్సి వస్తోందన్న ఆవేదన ఆ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో పలు డివిజన్లలో వలంటీర్లు ప్రతి గడపనూ తడుతూ ఓట్లు అభ్యర్థిస్తుండటం చూస్తే.... విస్మయం చెందడం ఓటర్ల వంతవుతోంది. కార్పొరేషన్‌లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడంలో భాగంగా ఆ పార్టీ నేతలు ప్రత్యర్థులు బలంగా ఉన్న కీలక డివిజన్లలో వలంటీర్లను వినియోగించుకుంటున్నట్లు సమాచారం. ఉదాహరణకు 48వ డివిజన్‌లో వలంటీర్లే వైసీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం విమర్శలకు తావి స్తోంది. ఆ డివిజన్‌ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యతను ఆ పార్టీ ముఖ్య నాయకులు వలంటీర్ల భుజాన వేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. 


మహిళా సంఘాలనూ వదలని వైనం

ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ వైసీపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలన్న చందంగా అధికార పార్టీ నేతల తీరు కనిపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వలంటీర్లను ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారాస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నేతల దృష్టి మహిళా సంఘాలపైనా పడింది. మహిళా సంఘాలను ఈ ఎన్నికల్లో వినియోగించుకుని లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నారు. ఇక్కడా వలంటీర్లనే ముందు పెడుతున్నారు. వారి ద్వారా మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభ్యులతో పాటు వారి కుటుంబాలు వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తుండటం చూస్తే... అధికార పార్టీ నేతల అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మహిళా సంఘాలను ప్రలోభపెడుతుండటంతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా... అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో ఓ డివిజన్‌లో మహిళా సంఘాల సభ్యులతో ఓ ఇంట్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ముగిసిన తరువాత వలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులు ఒక్కొక్కరుగా ఆ ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు తమ పార్టీ ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారందరినీ ఎన్నికలకు ఉపయోగించుకుంటున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


నిద్రపోతున్న నిఘా...

జిల్లాలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలు అమలు చేయడంలో అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకో న్యా యం.. ప్రతిపక్ష పార్టీలకో న్యాయమన్న చందంగా పోలీసు, రెవెన్యూ అధికారుల తీరుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ అధికార పార్టీ నాయకులు, ఆ పార్టీ అభ్యర్థులు, వారి అనుచరులకు సంబంధించి ఎవరిళ్లల్లోనూ సోదాలు జరిపిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అదే ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లల్లో మాత్రం సోదాలకు పోలీసులు ఉత్సాహం చూపుతున్నారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. తాడిపత్రిలో ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డికి సంబంధించిన ఓ ఇంట్లో పోలీసులు రాత్రి 10 గంటలు దాటిన తరువాత సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ క్రికెట్‌ కిట్లు లభ్యం కావడంతో ఓటర్లను ప్రభావితం చేయడంలో భాగంగానే ఆ కిట్లు తెచ్చిపెట్టుకున్నారని కేసులు నమోదు చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వలంటీర్లు ప్రత్యక్షంగాగానీ... పరోక్ష కంగా గానీ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీలులేదని, ఆ మేరకు వారిపై నిఘా ఉంచాలని ఎన్నికల కమిషనర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో వలంటీర్లు యథేచ్ఛగా అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నా... మహిళా సం ఫూలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రలోభపెడుతున్నా పట్టించుకునే నా థుడే లేడంటే నిఘా గుర్రుపెట్టి నిద్రపోతోందన్న విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2021-03-01T06:17:18+05:30 IST