ఆఖరు నిమిషం వరకూ విత్‌డ్రా ప్రయత్నాలు

ABN , First Publish Date - 2021-03-03T07:19:31+05:30 IST

మున్సిపోల్స్‌లో సొంత పార్టీ రెబల్స్‌, ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అధికార వైసీపీకి పెను సవాల్‌గా మారింది.

ఆఖరు నిమిషం వరకూ విత్‌డ్రా ప్రయత్నాలు

ఆ డివిజన్లు, వార్డులపైనే గురి

రూ.30 లక్షల దాకా 

ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు ఎర

పోటాపోటీగా జాబితాల విడుదల

వైసీపీలో రగిలిన అసంతృప్తులు

అనంత, హిందూపురంలో 

ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఆందోళనలు

అధికార పార్టీ ఆగడాలతో 

అజ్ఞాతంలోకి టీడీపీ అభ్యర్థులు

తొలిరోజు 267 నామినేషన్ల ఉపసంహరణ

అనంతపురం, మార్చి2(ఆంధ్రజ్యోతి): మున్సిపోల్స్‌లో సొంత పార్టీ రెబల్స్‌, ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అధికార వైసీపీకి పెను సవాల్‌గా మారింది. వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయటంతో బీఫాం కచ్చితమనుకున్న సీనియర్లకు నిరాశ ఎదురైంది. దీనిని వారు జీర్ణించుకోలేకపోతున్నాయి. తమను కాదని, కొత్తవారికి పార్టీ జెండా పట్టని వారికి అవకాశమివ్వటం ఏంటని మండిపడుతున్నారు. స్వతంత్రులుగానైనా పోటీలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. వారితో నామినేషన్లు విత్‌డ్రా చేయించటం వైసీపీ నేతలకు పెనుసమస్యగా మారింది. ప్రలోభాలు, బెదిరింపులతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు తప్పుకునేలా చేసి, ఏకగ్రీవాలు చేసుకునేందుకూ కుతంత్రాలు పన్నుతున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ససేమిరా అంటుండటంతో అధికార పార్టీ నేతలకు పాలుపోవట్లేదు. సొంత పార్టీ రెబల్స్‌, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు చివరి నిమిషం వరకూ వైసీపీ నేతలు వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. మున్సిపోల్స్‌లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలు నువ్వా... నేనా.. అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. అదేస్థాయిలో అధికార పార్టీకి దీటుగా... టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అధికార దర్పాన్ని ప్రదర్శించినా.. పోలీసుల సహకారంతో హెచ్చరికలు జారీ చేయించినా.. టీడీపీ అభ్యర్థులు వెనక్కు తగ్గకపోవడంతో వైసీపీ నేతల వ్యూహం బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో.. ఆ పార్టీ ముఖ్య నేతలు ఉపసంహరణలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. రెండ్రోజులుగా అదే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా ప్రలోభాల ఎర చూపటం, వినకపోతే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో రాయదుర్గం ఘటన ద్వారా చూపించారు. కండువా మార్చనని టీడీపీ అభ్యర్థి ససేమిరా అనటంతో అధికారులను అడ్డుపెట్టుకొని ఆయన షామిల్‌ డిపోపై దాడులు చేయించారంటే టీడీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు వైసీపీ నేతలు ఎంతకైనా తెగబడుతున్నారనేందుకు ఇదే ఉదాహరణ. ప్రలోభాలకు గురిచేసినా.. ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టినా.. టీడీపీ అభ్యర్థులు వెనక్కు తగ్గడం లేదు. మొదటిరోజు మంగళవారం టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. బుధవారం ఆఖరు రోజు కావడంతో చివరి క్షణం వరకూ టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసే ప్రయత్నంలోనే అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. టీడీపీ ముఖ్య నేతలు.. వైసీపీ నేతలకు ఆ అవకాశమివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, అనంతపురం తదితర మున్సిపాల్టీల్లో తమ పార్టీ అభ్యర్థులు ఎవరికీ అందుబాటులో లేకుండా ఆయా స్థానిక నేతలు అజ్ఞాత ప్రాంతాలకు తరలించారు. ఇలా వైసీపీ ఎత్తులకు టీడీపీ నేతలు పై ఎత్తులు వేస్తున్నారు. సాధారణంగా అభ్యర్థులు గెలిచిన తరువాత రహస్య ప్రాంతాలకు తరలించేవారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. అనంతపురం కార్పొరేషన్‌తోపాటు 8 మున్సిపాల్టీలు, రెండు నగర పంచాయతీలపై వైసీపీ జెండా ఎగరాలని ఆ పార్టీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా జిల్లా పర్యటనకొచ్చిన సందర్భంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు ఆ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేసైనా సరే మున్సిపాల్టీలను దక్కించుకోవటంలో భాగంగా ప్రత్యర్థులపై జులుం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


ఆ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులపైనే గురి

అనంతపురం కార్పొరేషన్‌తో పాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో అధికార పార్టీ నుంచి మేయర్‌, చైర్మన్‌ రేసుల్లో ఉన్న నాయకులు.. ఆయా డివిజన్లు, వార్డుల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ముందుగా ఆ అభ్యర్థులను నయానో.. భయానో.. పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థిని తప్పించేందుకు రూ.30 లక్షలదాకా ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వినకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న హెచ్చరికలను చేస్తున్నట్లు సమాచారం. అనంతపురం కార్పొరేషన్‌లో అధికార పార్టీ నుంచి నలుగురు మేయర్‌ రేసులో ఉన్నారు. వారు ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించేందుకు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోం ది. అన్ని మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తొలిరోజు వ్యూహం బెడిసికొట్టడంతో ఏ విధంగానైనా బుధవారం విత్‌డ్రా చేయించాలనే యోచనలో ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసి నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. మంగళవారం వైసీపీ, టీడీపీ  ముఖ్య నాయకులు అనంతపురం కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ అభ్యర్థుల జాబితాను పోటాపోటీగా విడుదల చేశారు. దీంతో అభ్యర్థులు ఎవరనేది తేలిపోవటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఆయా ప్రధాన పార్టీల నాయకులు విడుదల చేసిన జాబితాల్లో కొందరి పేర్లు లేకపోవటంతో అసంతృప్తులు రేగాయి. అధికార పార్టీలో ఈ పరిస్థితి అధికంగా కనిపించింది. అనంతపురంలో 17వ డివిజన్‌లో తనకు కాకుండా మరొకరి పేరు ప్రకటించడంతో ఆ డివిజన్‌ నుంచి పోటీ చేయాలని ఆశించిన సంబంధీకులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తి వెల్లగక్కినట్లు తెలుస్తోంది. హిందూపురంలోనూ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌కు అసమ్మతి సెగ తగిలింది. ఇలా ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద అసంతృప్తుల ఆందోళనలు కొనసాగాయి.

Updated Date - 2021-03-03T07:19:31+05:30 IST