వైసీపీలో రచ్చ!

ABN , First Publish Date - 2020-09-23T08:56:20+05:30 IST

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌, నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యుల పెత్తనంపై అధికార వైసీపీలో తీవ్ర రచ్చ సాగుతోంది.

వైసీపీలో రచ్చ!

ప్రభుత్వ వేదికలపై ప్రజాప్రతినిధుల బంధువులు

నియోజకవర్గ, మండలస్థాయి 

నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు..

బంధువుల పెత్తనంపై అసంతృప్తి..

ధ్వంసమవుతున్న శిలాఫలకాలు..

అధికార పార్టీ నేతల ఇష్టారాజ్యంపై 

వెల్లువెత్తుతున్న విమర్శలు..


అనంతపురం కార్పొరేషన్‌, సెప్టెంబరు 22: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌, నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యుల పెత్తనంపై అధికార వైసీపీలో తీవ్ర రచ్చ సాగుతోంది. అభివృద్ధి కార్యక్రమాల శిలాఫ లకాల్లో ప్రజాప్రతినిధులు కాని నేతల పేర్లు వేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.  కొన్నిచోట్ల తమ నాయకుడి పేరు లేదని శిలాఫలకాలనే ధ్వంసం చేస్తున్నారు. ఇవి పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి.


ఈ క్రమంలోనే ప్రొటోకాల్‌ పాటించటంలో విఫలమయ్యారంటూ ఇద్దరు అధికారులకు జిల్లా కలెక్టర్‌ మెమోలు జారీ చేశారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ మంత్రి ఆదేశం మేరకే మెమోలు జారీ చేశారన్న ప్రచారం సాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నియోజకవర్గ, మండల స్థాయి నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి.


ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి, మాజీ ప్రజాప్రతినిధుల బంధువులే వేదికలపై కనిపిస్తుండటం వారి అధికార దర్పాన్ని స్పష్టం చేస్తోంది. కొందరు అధికారులు సైతం అధికార పార్టీ నేతలకు జీ హుజూర్‌ అంటూ విమర్శలు మూట గట్టుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన వైఎ్‌సఆర్‌ ఆసరా వారోత్సవాల్లో అనేక చోట్ల వైసీపీ నాయకులు సభా వేదిక ఎక్కి, మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


శిలాఫలకం ధ్వంసం

జూలై 17వ తేదీన నార్పల మండలంలో నరసాపురం నుంచి రంగాపురం వరకు పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో రూ.1.17 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వైసీపీ నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర పాఠశాల విద్యానియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి అతిథిగా హాజరయ్యారు.


ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య రాలేదు. ఆ మరుసటి రోజే ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అందులో వైసీసీకి చెందిన ఓ నాయకుడి పేరు లేకపోవటంతో ఆయన అనుచరులే ధ్వంసం చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికే అక్కడ నియోజకవర్గ నేతలు, మండల నాయకుడి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ విషయంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని స్థానిక నాయకులు కలిశారు.


‘మీపేరు శిలాఫలకంలో ఉంచినా.. మిమ్మల్ని శంకుస్థాపనకు ఆహ్వానించలేదని, ఓ నేత కావాలనే ఇలా చేస్తున్నార’ని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంలో ఓ కీలక నేత జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి, సంబంధిత నేతల వ్యవహారం, ప్రొటోకాల్‌పై దృష్టి సారించమని ఆదేశించినట్లు తెలుస్తోంది. గత నెలలో నార్పల సీపీఐ కాలనీలో పైపులైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు.


అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, కాంట్రాక్టర్‌ పేరును ఉంచారు. ఇది ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఉందంటూ సంబంధింత పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ఇద్దరు అధికారులకు కలెక్టర్‌ మెమోలు జారీ చేశారు.


నేతల ఇష్టారాజ్యం

జిల్లాలో అధికార వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్‌ను ఎక్కడా పాటించట్లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ప్రజాప్రతినిధులను పక్కన పెడుతు న్నారు. మంత్రి నియోజకవర్గంలో ఆయన సమీప బం ధువులే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేతోపాటు ఆమె భర్తకు సైతం వేదికలపై సన్మానాలు చేస్తుండటంతో ప్రజలు నివ్వె రపోతున్నారు.


ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ను కనీసం పట్టించుకోవట్లేదని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. అక్కడ మాజీ ప్రజాప్రతినిధి, ఆయన బంధువులదే హవా అనే విమర్శలు బహిరంగంగా వి నిపిస్తున్నాయి. అక్కడున్న మరో నేతకు, ఆ మాజీ ప్రజాప్రతినిధికి మధ్య తాజాగా వైఎ్‌సఆర్‌ భరోసా కా ర్యక్రమంలో తలెత్తిన వివాదమే ఇందుకు నిదర్శనం.


జిల్లా కేంద్రానికి సమీపంలోని మరో నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధి సోదరుడే అంతా తానై వ్యవహిస్తుంటాడనీ, ఆ యన భార్య కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుం డటం ఆ పార్టీ శ్రేణులకు విస్మయం కలిగిస్తోంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీల అనుచరులుగా ఉన్న నాయకులే వేదికలు ఎక్కుతున్నారు. ఇలా అధికార పార్టీ నాయకులు ప్రొటోకాల్‌ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-09-23T08:56:20+05:30 IST