అస్తవ్యస్తం..!

ABN , First Publish Date - 2020-10-28T09:29:50+05:30 IST

విద్యాశాఖ చేపట్టిన టీచర్ల హేతుబద్ధీకరణ అస్యవ్యస్తంగా మారింది. వందలాది పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు గల్లంతయ్యాయి.

అస్తవ్యస్తం..!

 కొలిక్కిరాని టీచర్ల హేతుబద్ధీకరణ

  హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నేతల నిరసనలు

  పెరిగిన విద్యార్థులను తీసుకోలేదంటూ విమర్శలు

  కమిషనర్‌ జాబితా మేరకు చేశామంటున్న అధికారులు


అనంతపురం విద్య, అక్టోబరు 27: విద్యాశాఖ చేపట్టిన టీచర్ల హేతుబద్ధీకరణ అస్యవ్యస్తంగా మారింది. వందలాది పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు గల్లంతయ్యాయి. పాఠశాలల్లో ఇటీవల పెరిగిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకోకపోవటం మూలంగా అనేక పోస్టులు కోల్పోవాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం పెరిగిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకుని, కమిషనర్‌ నుంచి వచ్చిన వివరాల మేరకు చేశామంటున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే చైౖల్డ్‌ ఇన్ఫో పనిచేయకపోవటం, కొందరు ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల నిర్లక్ష్యం, విద్యాశాఖ వింత ఉత్తర్వులు వెరసి రేషనలైజేషన్‌-2020 గందరగోళానికి దారితీసింది. 


పెరిగిన విద్యార్థుల వివరాలేవీ...

రేషనలైజేషన్‌కు విద్యార్థుల సంఖ్య కీలకం. అదే ఉపాధ్యాయుల సీటును నిర్ణయిస్తుంది. దీంతో రేషనలైజేషన్‌-2020కి సిద్ధమైన విద్యాశాఖాధికారులు మొదట ఫిబ్రవరి 29 నాటికి విద్యార్థుల సంఖ్యను తీసుకుంటామని ప్రకటించారు. నాడు-నేడు, జగనన్న కిట్ల పంపిణీ తదితర అంశాల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. అక్టోబరు 14వ తేదీ నాటికి పెరిగిన సంఖ్యను తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు. ఈ విషయాన్ని అధికారులు.. ఇటు ఎంఈఓలు, అటు ప్రధానోపాధ్యాయులకు విశదీకరించకపోవటంతో సమస్య తలెత్తింది. చాలా మంది పెరిగిన విద్యార్థుల వివరాలు సాంకేతిక కారణాలతో ఆన్‌లైన్‌లోని చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు కాలేదు.


6వ తరగతి ప్రవేశాల విషయంలో ఇంగ్లీష్‌ మీడియం (ఈఎం) ఆప్షన్‌ ఇవ్వలేదు. ఫలితంగా చాలా ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈఎంకు సంబంధించి పోస్టులు గల్లంతయ్యాయి. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో గతంలో సున్నా ప్రవేశాలు (జీరో ఎన్‌రోల్‌మెంట్‌) ఉండగా.. ప్రస్తుతం పెరిగాయి. కొత్త నిబంధనల మేరకు 1-60 మధ్య ఎంత మంది పిల్లలున్నా.. రెండు పోస్టులిస్తారు. సున్నా ప్రవేశాల నుంచి విద్యార్థులు పెరిగినా.. 75 శాతం అంటూ కొత్త నిబంధన పెట్టి, పోస్టులు తీసేస్తున్నారు. ప్రైవేట్‌ స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరినా.. డ్రాప్‌ బాక్స్‌ నుంచి తొలగించకపోవటంతో వారి వివరాలు నేటికీ ప్రైవేట్‌ స్కూళ్లలోనే ఉన్నట్లు చూపుతాయి. ఇది కూడా చైల్డ్‌ ఇన్ఫో అప్‌డేట్‌ కాకపోవడానికి కారణం.


అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

ఈమె పేరు లక్ష్మి. సీకే పల్లి మండలం మేడాపురం వెస్ట్‌ వెల్స్‌ ప్రైమరీ స్కూల్‌లో ఎస్‌జీ టీచర్‌.  గతంలో సున్నా ప్రవే శాలు. ఇటీవల ఎనిమిది మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. రెండు రోజులుగా సైన్స్‌ సెంటర్‌ చుట్టూ తిరుగుతున్నా.. జీరో ఎన్‌రోల్‌ మెంట్‌ ఆధారంగా హేతుబద్ధీరణ చేస్తే.. ఆమె పోస్టుతోపాటు స్కూల్‌ కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంది. చాలా స్కూళ్లలో ఇదే దుస్థితి. ఈమెతో పాటు అనేక మంది ప్రధానోపాధ్యాయులు, సంఘాల నాయకులు సైన్స్‌ సెంటర్‌, డీఈఓ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నారు. 


31 వరకు అవకాశం: డీఈఓ

చైల్డ్‌ ఇన్పో అప్‌డేషన్‌ సమస్య ఉండటంతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. చైల్డ్‌ ఇన్ఫోలో వివరాల నమోదుకు విద్యాశాఖ కమిషనర్‌ ఈనెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ప్రధానోపాధ్యాయులు ఆ మేరకు వివరాలు నమోదుచేయాలి. తర్వాత కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చే డేటా ఆధారంగా రేషనలైజేషన్‌లో సమస్య లేకుండా రూపొందిస్తాం.

Updated Date - 2020-10-28T09:29:50+05:30 IST