విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2020-10-28T09:34:18+05:30 IST

మండలంలోని ఎల్‌బీనగర్‌ గ్రామం వద్ద మంగళవారం విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందారు.

విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం

బొమ్మనహాళ్‌, అక్టోబరు 27: మండలంలోని ఎల్‌బీనగర్‌ గ్రామం వద్ద మంగళవారం విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా పాలముక్కల మండలం మేడూరు గ్రామానికి చెందిన యలమంచి అంజని ప్రసన్నప్రసాద్‌ (54) ఎల్‌బీనగర్‌ గ్రామంలో నివాసముండేవాడు. సొంత పొలంతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని, పంటలు పెట్టేవాడు. మంగళవారం కౌలుకు తీసుకున్న పొలానికి ఉద్దేహాళ్‌కు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ వలీబాషా (44)తో కలిసి వెళ్లాడు. పొలం పనులు చేస్తుండగా.. ప్రసన్నప్రసాద్‌కు అతి తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ వైర్లు తగిలాయి. విలవిల్లాడుతున్న అతడిని వలీబాషా కర్ర సాయంతో రక్షించబోయాడు. అతడికి కూడా వైర్లు తగలటంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ రమణారెడ్డి, ఏఎ్‌సఐ కృష్ణ పరిశీలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రసన్న ప్రసాద్‌కు భార్య కవిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వలీబాషాకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వైర్లు కిందకు వేలాడుతున్నాయని విద్యుత్‌ అధికారులకు విన్నివించినా.. పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్క్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వైర్లు కిందకు వచ్చాయనీ, ఈ కారణంతోనే ప్రమాదం తలెత్తిందని బొమ్మనహాళ్‌ విద్యుత్‌ శాఖ ఏఈ లక్ష్మీరెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-10-28T09:34:18+05:30 IST