రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-10-28T09:36:04+05:30 IST

రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

మంత్రి శంకరనారాయణ..

రెండో విడత రైతు భరోసా సొమ్ము పంపిణీకి శ్రీకారం


అనంతపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మంగళవారం తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు భరోసా-పీఎం కిసాన్‌ రెండో విడత పంపిణీ, ఈ ఏడాది ఖరీఫ్‌ పంటనష్టపరిహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి మం త్రితో పాటు కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి, ఎమ్మెల్యేలు ఉషాశ్రీచరణ్‌, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, తిప్పేస్వామి, శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు.


మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాపై భారం పడినా, రైతులకు సాయం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా రెండో విడత కింద రూ.5,71,861 మంది రైతులకు రూ.114.88 కోట్ల లబ్ధి చేకూరుతోందన్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేల చొప్పున జమ చేశామన్నారు. జిల్లాలో అధిక వర్షాలతో ఈ ఏడాది జూన్‌, జూలై, సెప్టెంబరు మాసాల్లో పంట నష్టపోయిన 9140 మంది రైతులకు రూ.11.42 కోట్ల పరిహారాన్ని అందజేశామన్నారు. జూన్‌, జూలై నెలల్లో 3483 మంది రైతులకు చెందిన 2030.09 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లగా.. రూ.3.02 కోట్లు, సెప్టెంబరులో 5657 మంది 5645 హెక్టార్లలో పంట నష్టపోగా.. వారికి రూ.8.40 కోట్ల పరిహారం అందజేశామన్నారు. ఈ నెలలో 4716 మంది రైతులకు సంబంధించి 5308 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందనీ, అందుకు సంబంధించి రూ.7.89 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనంతరం రెండో విడత రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకాల లబ్ధి, ఈ ఏడాది వర్షాలతో నష్టపోయిన రైతుల పంటనష్టపరిహారానికి సంబంధించిన మెగా చెక్కులను మంత్రి, కలెక్టర్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రైతులకు అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ, రైతు భరోసా జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, ఏడీలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T09:36:04+05:30 IST