ఒక్కటిచ్చి.. అన్నీ ఎత్తేసి..

ABN , First Publish Date - 2020-10-29T09:45:22+05:30 IST

నేతన్న నేస్తం పథకం చేనేతలకు ఎన్నో నష్టాలను తెచ్చిపెట్టింది. పథకాన్ని ఆర్భాటంగా తీసుకొచ్చిన ప్రభుత్వం..

ఒక్కటిచ్చి.. అన్నీ ఎత్తేసి..

నేతన్న నేస్తంతో సంక్షేమ పథకాలకు మంగళం

 పట్టు రాయితీ, ముద్ర రుణాలకు నో..

 నేటికీ రూ.24 వేలు అందని వైనం..

కార్పొరేషన్లతో ప్రయోజనం శూన్యం..


అనంతపురం అర్బన్‌, అక్టోబరు28: నేతన్న నేస్తం పథకం చేనేతలకు ఎన్నో నష్టాలను తెచ్చిపెట్టింది. పథకాన్ని ఆర్భాటంగా తీసుకొచ్చిన ప్రభుత్వం.. దాని మాటున సంక్షేమానికి మంగళం పలికింది. పట్టు రాయితీ, ముద్ర రుణాలకు నేతన్నలను దూరం చేస్తోంది. నేతన్న నేస్తం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.24 వేలు నేతన్నలకు మంజూరు చేస్తోంది. ఈ సాకుతో నేతన్నలకు అందాల్సిన మిగిలిన సంక్షేమ పథకాలను ఎత్తేసింది. నేతన్న నేస్తం నుంచి.. ఆ వర్గాలకు ప్రోత్సాహకంగా అందించే పట్టు రాయితీ.. వ్యాపార వృద్ధికి అందించే ముద్ర రుణాలను సైతం అటకెక్కించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చేనేత జౌళి శాఖాధికారులు, స్థానిక అధికార పార్టీ నేతల కుమ్మక్కుతో నేటికీ లబ్ధిదారులకు నేతన్న నేస్తం సొమ్ము అందలేదు. దీంతో నేతన్న నేస్తం అందక.. ఇతర సంక్షేమ పథకాలు దక్కక నేతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కుల కార్పొరేషన్‌తో కూడా తమకు ఒరిగిందేమీ లేదని ఆ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.


జిల్లావ్యాప్తంగా 60 వేల మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు ఇదివరకు కిలో పట్టుకు రూ.250 చొప్పున రాయితీ చెల్లించేవారు. దీంతో నేతన్నలకు కాస్త ఉపశమనం కలిగేది. వైసీపీ అధికారం చేపట్టాక నేతన్న నేస్తం పేరిట రూ.24 వేలు ఆర్థికసాయం అందజేస్తున్నట్లు ప్రకటించింది. దాని మాటున ఇదివరకూ అమలవుతున్న సంక్షేమ పథకాలకు మంగళం పలికింది. నేతన్నలు పట్టు రాయితీకి దరఖాస్తు చేసుకుందామని వెళ్తే.. ఇప్పుడు ఆ పథకాలు ఏవీ లేవని అధికారులు చెబుతున్నారు. నేతన్నల వ్యాపారవృద్ధికి బ్యాంకుల ద్వారా ముద్ర రుణం రూ.50 వేలు అందించేవారు. ఆ పథకం కూడా అమలులో లేదని అధికారులు సెలవిస్తుండటంతో నేతన్నలు నిరాశ చెందుతున్నారు.


రూ.24 వేలు అందని వారెందరో..?

ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.24 వేలు నేతన్న నేస్తం విషయంలోనూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో అర్హుల కంటే.. అధికార పార్టీ నేతలకే పెద్టపీట వేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం స్థానిక కొందరు రాజకీయ నేతలతో ఆ శాఖాధికారుల కుమ్మక్కవటమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 60 వేల మంది చేనేత కార్మికులు మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ఆ మేరకు సొంత మగ్గాలు లేనివారు అనర్హులని తేల్చింది. 27 వేల మందిని అర్హులుగా గుర్తించి, లబ్ధి చేకూర్చినట్లు అధికారుల రికార్డులు చూపుతున్నారు. అనర్హులుగా తేల్చిన 33 వేల మందిలో సుమారు 20 వేల మంది అర్హులున్నట్లు సమాచారం. లబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న 27 వేల మంది నేతన్నల్లో కూడా స్థానిక రాజకీయ నేతల అనుయాయులనే చేర్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు చెప్పిన మేరకు అర్హులను పథకానికి దూరం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 25 వేల మంది చేనేతలున్నారు. ధర్మవరం పట్టణంలో 5 వేల మందికి లబ్ధి చేకూరలేదంటే పథకం అమలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెన్నేకొత్తపల్లి మండలంలో సుమారు 1000 మంది ఉండగా.. 500 మందికిపైగా లబ్ధి చేకూరకపోవటంపై ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన గ్రామాల్లోనూ పదుల సంఖ్యలోనే బాధితులున్నారు.


శెట్టూరు మండలంలో 32 మందికి నేతన్న నేస్తం ఇప్పటికీ అందలేదు. పలుమార్లు స్థానిక అధికారులకు విన్నవించినా.. వారి నుంచి స్పందన రాకపోవటం గమనార్హం. ప్రశ్నించిన వారికి సాకులు చూపుతూ అనర్హులని తేల్చినట్లు సమాచారం.


తాడిపత్రి మండలంలో 2 వేల మందికిపైగా నేతన్న నేస్తానికి దూరమయ్యారు. అన్ని అర్హతలున్నా.. అనర్హులని స్థానిక అధికారులు చూపుతూ.. పథకాన్ని వర్తింపజేయలేదని స్థానిక నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాడికి మండలంలో 1000 మందికిపైగానే నేతన్న నేస్తం లబ్ధి చేకూరలేదు.


నార్పల మండలంలోనూ నేతన్ననేస్తం కోసం ఆ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. నార్పల మండలం చామలూరులో దాదాపు 70 మంది చేనేతలుండగా.. వారిలో 10 మందికి కూడా నేతన్న నేస్తం లబ్ధి చేకూరలేదని బాధిత వర్గాలు పేర్కొంటున్నాయి.


రూ.24 వేలిస్తే.. రుణాలివ్వరా..?..నీలూరు శేఖర్‌, పెద్దపప్పూరు

ఏటాలాగానే ఈసారి కూడా ముద్ర రుణానికి దరఖాస్తు చేసుకునేందుకు నెట్‌సెంటర్‌కెళ్లా. ఇప్పుడు ఆ రుణాలు ఇవ్వట్లేదని నిర్వాహకులు చెప్పారు. దీనిపై ఊరిలో అధికారులను అడగ్గా.. రూ.24 వేలు ఇస్తున్నారు కదా.. అందుకే రుణాలు మంజూరు చేయట్లేదని తేల్చి చెప్పారు. రూ.24 వేలిస్తే.. రుణాలివ్వరా..? ఇదేందో అర్థం కావట్లేదు.


అనర్హులమని చెబుతున్నారు....లక్ష్మి, శాంతినగర్‌, ధర్మవరం

నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకున్నా. పథకం సొమ్ము జమ కాలేదు. దీనిపై గ్రామంలోని అధికారులను ఆరాతీస్తే.. దరఖాస్తులో తప్పులుండటంతో అనర్హురాలివని చెప్పారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయానికెళ్లా. గ్రామ అధికారుల నుంచి దరఖాస్తు రావాలని అక్కడి వారు చెబుతున్నారు. నా సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు.

Updated Date - 2020-10-29T09:45:22+05:30 IST