డీలర్లకు సర్వర్‌ సమస్య

ABN , First Publish Date - 2020-10-29T09:49:59+05:30 IST

డీలర్లకు సర్వర్‌ సమస్య

డీలర్లకు సర్వర్‌ సమస్య

 సర్వర్‌ మొరాయింపుతో సరుకుల పంపిణీకి అష్టకష్టాలు 

 ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు ఒకే సర్వర్‌  

 హైదరాబాద్‌లో ప్రతికూల పరిస్థితులతో ఆటంకం  


అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 28 : ఎఫ్‌పీ షాపు డీలర్లకు ‘సర్వర్‌ సెగ’ బలంగా తగులుతోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈసారి సర్వర్‌ మొరాయి స్తుండటంతో సరుకుల పంపిణీకి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి రోజూ గంటల తరబడి సర్వర్‌ పనిచేయకపోవడంతో డీలర్లపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వర్‌ సమస్య పరిష్కరించాలని సివిల్‌సప్లై అధికారులకు డీలర్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఈ పరిస్థితుల్లో కార్డుదారులకు ఉచిత సరుకుల పంపిణీకి డీలర్లు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఏపీ,తెలంగాణ రాష్ర్టాలకు కలిపి ఒకే సర్వర్‌ ఉంది. ఏపీకి ప్రత్యేకంగా సర్వర్‌ ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతోపాటు డీలర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ప్రతికూల పరిస్థితులు ఉండటంతో సర్వర్‌ ఇబ్బందులు తలెత్తాయి. దీని ప్రభావం ఏపీపైనా పడింది.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సర్వర్‌ ఏర్పాటు చేసే వరకూ సర్వర్‌ కష్టాలు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.  


ఆరంభం నుంచి అవే ఇబ్బందులు 

జిల్లా వ్యాప్తంగా 3012 ఎఫ్‌పీ షాపుల  పరిధిల్లో 12.55 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. ఈనెల 20వ తేదీన 14వ విడత ఉచిత సరుకుల పంపిణీ ఆరంభించారు. ఈ సారి పం పిణీ ఆరంభం నుంచే సర్వర్‌ కష్టాలు మొదలయ్యాయి. ఒక కార్డుదారుడు రెండు సార్లు వేలిముద్రలు వేసేలా ఆప్షన్‌ ఇవ్వడంతో ఈసారి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం ఎఫ్‌పీ షాపు డీలర్లపై ఎక్కువగా ఉంటోంది. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఉదయం 7 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు నెమ్మదిగా సర్వర్‌ పనిచేస్తోంది. మిగిలిన సమయాల్లో పూర్తిగా బంద్‌ అవుతోంది. అందుకనుగుణంగా కొందరు డీలర్లు కార్డుదారులను పిలిపించుకొని సరుకులు పంపిణీ చేస్తున్నారు. సర్వర్‌ బాగా పనిచేస్తే గంటలకు 40 నుంచి 50 మంది కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయొచ్చు. ప్రస్తుతం సర్వర్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో గంటకు 8 నుంచి 10 మందికి మాత్రమే సరుకులు పంపిణీ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. షెడ్యూల్‌ మేరకు మంగళవారం నాటికే పంపిణీ గడువు ముగిసింది. సర్వర్‌ సమస్యతో ఇప్పటి దాకా 9.68 లక్షలు (77.15 శాతం) మందికి ఉచిత సరుకులు పంపిణీ చేశారు. సర్వర్‌ సమస్యతో పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించారు.

  

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం :  రఘురామిరెడ్డి, డీఎస్‌ఓ 

ఉచిత సరుకుల పంపిణీలో సర్వర్‌ సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే. రాష్ట్ర స్థాయిలో సర్వర్‌ సమస్య ఉంది. దీంతో కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో సర్వర్‌ సమస్యలను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. రాష్ట్ర స్థాయిలో సర్వర్‌ సమస్య పరిష్కరిస్తే జిల్లాలో కూడా ఇబ్బందులు లేకుండా పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. 

Updated Date - 2020-10-29T09:49:59+05:30 IST