వైసీపీలో చిచ్చు రాజేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం

ABN , First Publish Date - 2021-04-17T06:00:06+05:30 IST

అధికార వైసీపీలో జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం చిచ్చురాజేస్తోంది.

వైసీపీలో చిచ్చు రాజేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం

కుర్చీ కుస్తీ..!

వైసీపీలో చిచ్చు రాజేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం

ప్రజాప్రతినిధుల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

రంగంలోకి కులసంఘాల నేతలు..

తమ సామాజికవర్గానికే ఇవ్వాలని అల్టిమేటం

హైకమాండ్‌దే తుది నిర్ణయం అంటున్న నేతలు

అనంతపురం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీలో జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం చిచ్చురాజేస్తోంది. కుర్చీని చేజిక్కించుకునేందుకు బలమైన సామాజికవర్గాలు నువ్వా.. నేనా.. అంటూ పోటీ పడుతున్నాయి. జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో ఆయా సామాజికవర్గాల ప్రజాప్రతినిధులు, కులసంఘాల నేతలు తమ వారిని పీఠమెక్కించేందుకు పావు లు కదుపుతున్నారు. ఎవరికి వారు చాపకింద నీరులా ప్రయత్నాలు ముమ్మరం చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి శంకర్‌నారాయణతోపాటు ఆ పార్టీ ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఎవరికివారు ఆ పార్టీ ప్రజాప్రతినిధుల ముందు తమ వాదనలను బలంగా వినిపిస్తూ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. క్షణం తీరిక దొరికినా.. ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వారిని ప్రసన్నం చేసుకోవడంలోనే తరిస్తున్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేనిదే జడ్పీపీఠం దక్కదనే బలమైన నమ్మకమున్నప్పటికీ.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న అభద్రతాభావం ఆశావాహుల్లో లేకపోలేదు. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ పదవులు ఫలానా వారికే దక్కనున్నాయని బలంగా ప్రచారం సాగినా.. పంపకాల వద్దకొచ్చేసరికి ఆశావాహులకు ఎదురైన భంగపాటే ఇందుకు ప్రధాన కారణం. 

గతేడాది మార్చిలో జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడం, పోలింగ్‌ కంటే ముందే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ను వాయిదా వేసింది. ఏడాది తరువాత అంటే.. గత నెలలో జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావడం.. అదే నెలలో 8న పోలింగ్‌ నిర్వహించారు. కోర్టు ఆదేశాల మేరకు 10న జరగాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలు ఎప్పుడు వస్తే.. అప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అంతవరకూ అభ్యర్థుల భవితవ్యం స్ర్టాంగ్‌ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం కోసం ఆది నుంచి ముగ్గురు ఆశావాహుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వారిలో ఆత్మకూరు నుంచి పోటీచేసిన బోయ గిరిజమ్మ, కూడేరు నుంచి పోటీలో ఉన్న అశ్వినీహరీష్‌, తనకల్లు నుంచి జక్కల జ్యోతి ఉన్నారు. తాజాగా గుత్తి మండలం నుంచి పోటీ చేసిన నార్వేని రాధిక జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని ఆశిస్తున్నారు. జిల్లాలో ఈ నలుగురి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికివారు పీఠాన్ని దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.


అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అంటున్ననేతలు

జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం కోసం ఆయా సామాజికవర్గాల ద్వారా ప్రజాప్రతినిధులకు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఎవరికీ చెప్పలేని పరిస్థితుల్లో నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. అందరికీ ఓకే అన్న చందంగానే వ్య వహరిస్తున్నట్లు ఆయా నేతల సన్నిహితుల ద్వారా అందిన సమాచారం. ఏ కులసంఘం నాయకులు వచ్చినా.. ఏ అవకాశమున్నా.. మీకే చెబుతామంటూ ఆశలు రేపి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీలో ముఖ్య పదవుల్లో కురబ, బోయ సామాజికవర్గం నేతలు ఉండటంతో మిగిలి న ప్రజాప్రతినిధులు ఎవరి పక్షంగా ఉండాలో తేల్చుకోలేని స్థితిలో డోలాయమానంలో పడ్డారు. ఎవరు వెళ్లి మద్దతు అడిగినా.. ‘మీకే మా మద్దతు’ అంటూ అప్పటికప్పుడు తప్పించుకుంటున్నారనడంలో సందేహం లేదు. మేయర్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ ఎంపికలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుందో.. జడ్పీ చైర్‌పర్సన్‌ విషయంలోనూ అదే ఒరవడి కొనసాగే అవకాశాలున్నట్లు ఆ పార్టీ ప్రజాప్రతినిధులే చెప్పుకుంటున్నారు. ఆశావాహులు మాత్రం పట్టువిడవకుండా నేతల మద్దతే జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠంపై కూర్చోబెడుతుందన్న ఆశలో ఉండటం గమనార్హం. అధిష్టానం ఏ సామాజికవర్గానికి ఆ పీఠాన్ని కట్టబెడుతుందో చూడాలి మరి.


రంగంలోకి కుల సంఘాల నేతలు

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో ఆ పదవిని దక్కించుకోవడానికి ఆయా సామాజిక కులసంఘాల నేతలు రంగంలోకి దిగారు. తమ కులానికే ప్రాధాన్యమివ్వాలని ఏకంగా ఆయా కులసంఘాల జిల్లా అధ్యక్షులతోపాటు ముఖ్య నాయకులు మీడియా సమావేశాలు పెట్టి మరీ.. డిమాండ్‌ చేస్తున్నారు. తమ సామాజికవర్గానికి న్యాయం చేయకపోతే పార్టీకి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయనే సంకేతాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది అల్టిమేటమనే హెచ్చరికల్లా వారి మాటల అంతరార్థం కనిపిస్తోంది. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న నేపథ్యంలో తమ సామాజికవర్గానికే జడ్పీపీఠం కట్టబెట్టాలని కురబ సామాజికవర్గం నేతలు పట్టుబడుతున్నారు. ఆ మేరకు ప్రజాప్రతినిధుల ఎదుట తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే ఆ సామాజికవర్గం నుంచి ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతోపాటు కురబ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవితో జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో.. తమ సామాజికవర్గానికే జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని బోయ సామాజికవర్గం నాయకులు.. ప్రజాప్రతినిధుల ఎదుట ఏకరువు పెడుతున్నారు. జిల్లాలో కురబలకు అత్యంత పెద్దపీట వేశారనీ, బోయలకు ఎంపీతోపాటు నాలుగు మున్సిపల్‌ చైర్మెన్‌ పదవులను కట్టబెట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకూ జిల్లాలో ఎలాంటి ప్రాధాన్యత కల్పించని యాదవులకు జడ్పీచైర్‌పర్సన్‌ పదవితోనైనా స్థానం కల్పించాలని ఆ సామాజికవర్గం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈడిగ సామాజికవర్గానికి ఇప్పటి వరకూ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకల్లు నుంచి పోటీచేసిన జక్కల జ్యోతికి జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని ఆ సామాజికవర్గం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ వాదనలను ప్రజాప్రతినిధుల ఎదుట బలంగా వినిపిస్తున్నారు. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన నేపథ్యంలో ఎవరైతే జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తున్నారో.. వారి గెలుపు నల్లేరుమీద నడకేననడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయా కులసంఘాల నేతలు ఎవరికి వారు జిల్లాలో రాజకీయంగా పట్టు సాధించుకునే దిశగానే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో రాష్ట్రస్థాయి నాయకులతోనూ మంతనాలు సాగిస్తున్నారు. వారి ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం.

Updated Date - 2021-04-17T06:00:06+05:30 IST