ఇంటింటికీ పరేషాన్‌..!

ABN , First Publish Date - 2021-04-18T06:15:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటి వద్దకే రేషన్‌ అమలులో చతికిల పడింది.

ఇంటింటికీ పరేషాన్‌..!
అనంతపురం నగరంలో ఒకే చోట మినీ ట్రక్కును ఉంచి, సరుకులు పంపిణీ చేస్తున్న దృశ్యం

ఇంటింటికీ పరేషాన్‌..!

చతికిలపడిన ‘ఇంటి వద్దకే రేషన్‌’ 

ప్రధాన కూడళ్ల వద్దే మినీ ట్రక్కుల నిలిపివేత 

మండుటెండలో వీధుల్లో నిలబడి 

నిరీక్షిస్తున్న ప్రజలు 

వాహనం ఎప్పుడొస్తుందోనన్న 

ముందస్తు  సమాచారం నిల్‌ 

మరికొన్ని ప్రాంతాలకు 

మినీ ట్రక్కులే  వెళ్లని దుస్థితి 

పట్టించుకోని అధికారులు

కార్డుదారులకు తప్పని ఇక్కట్లు

అనంతపురం ఏప్రిల్‌ 17, (వ్యవసాయం/నెట్‌వర్క్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటి వద్దకే రేషన్‌ అమలులో చతికిలపడింది. నిబంధనల మేరకు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి, కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటిదాకా ఎక్కడా అలా అమలు కాలేదు. వీధిలో ఏదో ఒకచోట మినీ ట్రక్కును నిలిపి, అక్కడికే కార్డుదారులను రప్పించి, రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. వీధుల్లో మండుటెండలో వేచిఉండలేక మహిళలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. వాహనం వచ్చినపుడు రేషన్‌ తీసుకోకపోతే మళ్లీ ఎక్కడ వేస్తారో తెలియక ప్రజలు పనులన్నీ మానుకుని, వేచి ఉంటున్నారు. అసలు మినీ ట్రక్కు ఏ ప్రాంతానికి ఎప్పుడొస్తుందో కూడా సమాచారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ప్రజలు పలు రకాల పనుల నిమిత్తం వెళ్లిన సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లినపుడో మినీ ట్రక్కులను ఉన్నట్లుండి తెచ్చి పెడుతుండటంతో ఏం చేయాలో తోచని అయోమయంలో స్థానిక ప్రజలు నిట్టూరుస్తున్నారు.


ప్రధాన కూడళ్ల వద్దే మినీ ట్రక్కుల నిలిపివేత 

జిల్లావ్యాప్తంగా 3012 ఎఫ్‌పీ షాపుల పరిధిల్లో 11 లక్ష ల రేషన్‌కార్డులున్నాయి. ఈ నెలకు 20,579 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 649 మెట్రిక్‌టన్నుల చెక్కర, 1203 మెట్రిక్‌ టన్నుల కంది బేడలు కేటాయించారు. జిల్లాకు 754 మినీ ట్రక్కులు కేటాయించారు. వాటిని ప్రతి ఇంటి వద్దకు పంపించి, కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జిల్లాలో మినీ ట్రక్కుల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో ఏ ఒక్క పట్టణంలోని వార్డు, గ్రామంలోనూ ఇంటి వద్దకు వాహనం వెళ్లి, సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. పౌరసరఫరాల అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నామనీ, అంతా సవ్యంగా సాగుతోందని చెబుతూ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం.


అయోమయం

జిల్లాలో ఎఫ్‌పీ షాపుల వారీగా మినీ టక్కులను కేటా యించారు. షెడ్యూల్‌ మేరకు మినీ ట్రక్కులు ఏయే తేదీల్లో ఏయే ప్రాంతాలకు వెళుతున్నాయో స్థానిక ప్రజలకు ముం దస్తుగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఈ నిబంధన ఎవరూ పాటించడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో వాహనం ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు వెళుతుందో.. ఎవరికీ తెలియని అయోమయం నెలకొంది. వచ్చినపుడు వాహనం వద్దకెళ్లి, క్యూలో నిల్చొని సరుకులు వేయించుకోవాల్సిన దుస్థితిని కార్డుదారులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు మినీ ట్రక్కును ఒకచోట ఉంచి  వెంటనే సరుకులు తీసుకువెళ్లాలనీ, ఈరోజే ఆఖరు రోజంటూ సిబ్బంది హడావుడి చేస్తున్నారన్న విమర్శలున్నాయి. శుక్రవారం అనంతపురం నగరంలోని వేణుగోపాల్‌ నగర్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కార్డుదారులకు ఫోన్‌ చేసి, ఈ రోజులోగా సరుకులు తీసుకువెళ్లాలని, లేదంటే మళ్లీ వేయమని హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో  కొందరు కార్డుదారులు వాహనం ఉంచిన చోటకు వెళ్లి, సరుకులు వేయించుకున్నారు. మరికొందరు అందుబాటులో లేకపోవడంతో సరుకులకు దూరమయ్యారు.


ఇప్పటికీ ఎఫ్‌పీ షాపుల వద్దనే... 

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఎఫ్‌పీ షాపుల వద్దనే నిత్యావసర సరుకులు వేస్తున్నారు. స్థానికంగా కేటా యించిన మినీ ట్రక్కులు రాకపోవడంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో డీలర్లు, మినీ ట్రక్కుల యజమానులు కుమ్మకై కార్డుదారులను ఎఫ్‌పీ షాపుల వద్దకే రప్పించి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. పెనుకొండ మండలంలోని కోనాపురం, వెంకటరెడ్డిపల్లి, అడదాకులపల్లి, మావటూరు, గుట్టూరు, నాగులూరు తదితర గ్రామాల్లో ఇప్పటికీ ఎఫ్‌పీ షాపుల వద్దనే సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు కేటాయించిన మినీ ట్రక్కులు ఇప్పటిదాకా వెళ్లకపోవడంతో స్థానిక ప్రజలు పాత పద్ధతిలోనే ఎఫ్‌పీ షాపుల వద్దకు వెళ్లి సరుకులు వేయించుకుంటున్నారు. విడపనకల్లు మండలంలోని కొట్టాలపల్లి, చీకలగురికి, హావళిగి, కొత్తకోట ప్రాంతాలకు కేటాయించిన రెండు మినీ ట్రక్కులు వెళ్లడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎఫ్‌పీ షాపుల వద్దకే వెళ్తున్నారు. గుత్తి పట్టణంలో 10 మందికిపైగా ఎఫ్‌పీ షాపు డీలర్లు మినీ ట్రక్కుల నిర్వాహకులతో కుమ్మకై, ఎఫ్‌పీ షాపుల వద్దనే సరుకులు పంపిణీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీంతో ఆయా షాపులకు కేటాయించిన మినీ ట్రక్కులను తమకు కేటాయించిన ప్రాంతాలకు తీసుకువెళ్లకుండా నిర్వాహకులు మిన్నకుండిపోయారు. జిల్లావ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది.


అధికారుల పర్యవేక్షణాలోపం 

మినీ ట్రక్కుల నిర్వహణపై స్థానిక పౌర సరఫరాల అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలని జేసీ నిశాంత్‌కుమార్‌ పలుమార్లు ఆదేశించారు. అయినప్పటికీ ఆయా అధికారులు ఎక్కడా పర్యవేక్షించిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో అంతా సవ్యంగా ఉందంటూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నట్లు తెలిసింది. పౌర సరఫరాల ఉన్నతాధికారులు కూడా ఇంటి వద్దకే సరుకుల పంపిణీ తీరుపై ఇప్పటిదాకా పర్యవేక్షించిన  దాఖలాలు లేవన్న విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపంతోపాటు మినీ ట్రక్కుల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కార్డుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


సవ్యంగా సాగేలా చర్యలు

ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి వద్దకే వాహనం వెళ్లి, సరుకులు పంపిణీ చేయాలి. జిల్లాలో ఇంటి వద్దకే సరుకుల పంపిణీ కార్యక్రమం సవ్యంగా సాగేలా చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించి, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అధికారులను ఆదేశించాం. ఎక్కడైనా సమస్యలుంటే నేరుగా మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం.

- రఘురామిరెడ్డి, డీఎస్‌ఓ



ఊర్లో ఒకే వీధిలో నిలిపేస్తున్నారు

మా గ్రామంలో ఒకే వీధిలో మినీ ట్రక్కును నిలిపి వేస్తున్నారు. అక్కడికి అందరూ వచ్చి, సరుకులు తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఇంటి వద్దకే వాహనం వచ్చి, సరుకులు పంపిణీ చేస్తుందని ప్రభుత్వం, అధికారులు ప్రకటించారు. మా వద్ద ఆ విధానం అమలు చేయడం లేదు. ప్రతిసారీ గ్రామంలో ఒకే చోట వాహనాన్ని నిలిపివేసి, అక్కడికే అందరిని రప్పిస్తున్నారు. ప్రజలంతా అడిగినా ఇలాగే సరుకులు వేస్తామంటున్నారు.

- రంగస్వామి, కార్డుదారుడు, కొత్తకోట, విడపనకల్లు మండలం


స్టోర్‌ వద్దే సరుకులు తెచ్చుకుంటున్నా

మా ఊరికి ఇప్పటిదాకా ఏ వాహనం రాలేదు. స్టోర్‌ వద్దకే అందరూ వచ్చి, సరుకులు తీసుకెళ్లాలని చెప్పారు. అందుకే నేనే స్టోర్‌ వద్దకు వెళ్లి, సరుకులు తెచ్చుకుంటున్నా. వాహనం ఎలా ఉంటాదో చూడలేదు. మా ఊరికి ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పడం లేదు. 

- నాగేంద్రమ్మ, కార్డుదారురాలు, చీకలగురికి, 

విడపనకల్లు మండలం







రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే

రెండు నెలల కిందట ఒకసారి మినీ ట్రక్కు మా ఊరి కొచ్చింది. ఆ తర్వాత వాహనం రావడం లేదు. మా పక్క ఊరు మంగాపురంలో ఎఫ్‌పీ షాపు ఉంది. రెండు కిలో మీటర్ల దూరం వెళ్లి, పాత పద్ధతిలోనే సరుకులు తెచ్చు కోవాల్సి వస్తోంది. మా ఊరికి మళ్లీ వాహనం ఎప్పు డొస్తుందో ఏమో.. తెలియడం లేదు. అప్పటిదాకా పనుల న్నీ వదులుకొని, రెండు కిలోమీటర్లు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిందే.

సుబ్రహ్మణ్యం, కార్డుదారుడు, కోనాపురం, పెనుకొండ మండలం

Updated Date - 2021-04-18T06:15:32+05:30 IST