Advertisement

ప్రయాణమంటే భయం.. భయం..!

Jan 17 2021 @ 00:59AM
అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో రోడ్డు దుస్థితి

అధ్వానంగా రహదారులు

కంకర తేలి, గుంతలమయమైన వైనం

జిల్లావ్యాప్తంగా 50కిపైగా బ్లాక్‌స్పాట్స్‌ ప్యాచ్‌వర్క్‌లే గతి

వేసిన ఆరునెలలకే దెబ్బతింటున్న వైనం

పట్టించుకోని అధికారులు

నాలుగేళ్లుగా నిధుల కొరత

రోడ్డెక్కితే నరకమేనంటూ ప్రజల ఆవేదన

అనంతపురం కార్పొరేషన్‌, జనవరి 16:  ఎక్కడికైనా ప్రయాణమంటే ఇదివరకు ఎగిరి, గంతేసేవారు. విహారయాత్రలకు తీసుకెళ్లాలని ఇంటిల్లిపాదీ పట్టుబట్టేవారు. ఎండాకాలం వస్తుందనగానే.. దూరపు ప్రయాణాలకు ప్లాన్‌ చేసుకునేవారు. ఇప్పుడు బయటకు వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. రోడ్డెక్కాలంటే జంకుతున్నారు. దూరపు ప్రయాణాలంటే అమ్మో.. ఊహించుకుంటేనే వణికిపోతున్నారు. ఎందుకంటే భయంకరమైన రోడ్లే కారణం. గుంతల రోడ్లలో నాలుగు కిలోమీటర్లు తిరిగొచ్చే సరికి అలసిపోతున్నారు. ఓ పది కిలోమీటర్లు వెళ్లిరావాలంటే విసిగిపోతున్నారు. ఇదీ.. జిల్లాలోని రోడ్ల పరిస్థితి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మా త్రమే కాదు.. జిల్లా కేం ద్రంలో కూడా గుం తలరోడ్లే ది క్కు. సప్తగిరి సర్కిల్‌లో కూడా రోడ్డు గుంతలమయమే. వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ప్రజలు నిత్య నరకం అనుభవిస్తున్నారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొత్తగా వేసిన రోడ్లు మినహా మిగిలినవన్నీ కంకర తేలి, గుంతలమయంగా కనిపిస్తున్నాయి. గ్రామాల మధ్య ఉన్న రహదారుల కంటే రాష్ట్ర రహదారులే దారుణంగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగానే రూ.కోట్లు వెచ్చించి, నిర్మించిన రోడ్లు సైతం రెండేళ్లలోపే దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్న రోడ్లన్నింటికీ నిధులు మంజూరు చేయలేని దుర్భర పరిస్థితి. నాలుగేళ్లుగా నిధుల కొరతతో ప్యాచ్‌వర్క్‌లు మాత్రమే చేస్తున్నారు. ఇక కొత్త రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి. మంత్రి శంకరనారాయణ ప్రారంభించిన ఉల్లికల్లు రోడ్డులో ఇంకా కిలోమీటరు కూడా తారు పడలేదు. నాలుగేళ్ల కిందట టెండర్లు పిలిచిన బుక్కరాయసముద్రం-అనంతపురం (తాడిపత్రి ఫోర్‌లేన్‌ రోడ్డు)లో వంద మీటర్లకుపైగా పెండింగ్‌లో ఉంది.


 
కంకర తేలి, గుంతలమయమైన కక్కలపల్లి రోడ్డు

ప్రమాదాల నిలయాలుగా..

ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని రో డ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. రోడ్లన్నీ గుంతలమయమై ప్ర యాణికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ముం దున్న గుంతను తప్పించేందుకు వాహనం మరోవైపు వెళితే వెనుక నుంచి ఓవర్‌టేక్‌ చేసేందుకు వచ్చిన వాహనం ఢీకొంటోంది. ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలే జరుగుతున్నాయి. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్‌ నుంచి బత్తలపల్లి వరకు ఉన్న దామాసిపల్లి రోడ్డు గుంతలతో అధ్వానంగా ఉంది. ఇక్కడ ప్యాచ్‌వర్క్‌లు చేసిన ఆరునెల ల్లోపే దెబ్బతింటోంది. పది కిలోమీటర్లలోపే పదుల సంఖ్యలో గుంతలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్‌ రోడ్డు పొడవునా గుంతలు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. 8 నెలల కిందటే ఇక్కడ ప్యాచ్‌వర్క్‌లు చేశారు. గుత్తి-పత్తికొండ, మైపాడు-నెల్లూరు, ఉరవకొండ- కణేకల్లు రహదారులు మరీ దారుణంగా తయారయ్యాయి. గుంతకల్లు-తుంగభద్రరోడ్డు, జమ్మలమడుగు-కదిరి, పెనుకొండ-ముదిగుబ్బ- దొరిగల్లు, హిందూపురం-సోమందేపల్లి రహదారులు బాగా దెబ్బతిన్నాయి. పెనుకొండ-మడకశిర, కొడూరు-ధర్మవరం, బుక్కపట్నం-నల్లమాడ, పెనుకొండ-ముదిగుబ్బ, బట్రేపల్లి-తలుపుల-పెద్దమ్మవారిపల్లి, హిందూపురం-మడకశిర-టుంకూరు, కళ్యాణదుర్గం-మడకశిర రోడ్లు సైతం అధ్వానంగా తయారయ్యా యి. వీటికితోడు మండల కేంద్రాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకున్న అనుసంధాన రోడ్ల గురించి చెప్పనక్కర్లేదు. జిల్లా కేంద్రానికి ప్ర తి మండల కేంద్రం నుంచి డబుల్‌ లేన్‌ రోడ్డు వేయాలనేది ప్రతిపాదనగానే ఉండిపోయింది.


కక్కలపల్లి రోడ్డులో దుమ్ములో వాహనదారుల అవస్థలు

బ్లాక్‌ స్పాట్స్‌ను పట్టించుకోరే...!

రెండు వారాల కిందట బత్తలపల్లి మండలంలో ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో బైక్‌పై నుంచి పడి గాయపడిన ఓ వ్యక్తికి మరో ముగ్గురు సాయపడుతుండగా అదేదారిలో వేగంగా వచ్చిన లారీ వారిపై దూసుకెళ్లింది. బత్తలపల్లి మండలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటివాటిని బ్లాక్‌స్పాట్స్‌గా గు ర్తించాలి. జిల్లా వ్యాప్తంగా అలాంటివి 50కిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా పెరుగుతున్నాయే కానీ తగ్గే దాఖలాలు కనిపించడం లేదు. అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు  జరగకుండా  చర్యలు చేపట్టాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. వాటికి నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేసి, ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక రోడ్ల నాణ్యత విషయానికొస్తే కొన్ని సంస్థలు వేసిన రోడ్లను అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్వాలిటీ కంట్రోల్‌ పర్యవేక్షణ సమయంలో నాణ్యత లేకపోయినా ఎంతో కొంత రిమార్కు వేసి, చేతులు దులిపేసుకుంటున్నారు. అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఆ తరువాత కొంతకాలానికే రోడ్లు దెబ్బతినడం, ప్యాచ్‌వర్క్‌లు సైతం అదే కాంట్రాక్టర్లకు అప్పగించడం పరిపాటిగా మారింది. దీంతో వారు కూడా కంకర పొడి వేసి మమ అనిపించేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోతే ఆర్‌అండ్‌బీ రోడ్ల రూపులో మార్పు రాదనేది సుస్పష్టం.


దెబ్బతిన్న రోడ్లకు టెండర్లు పిలుస్తున్నాం: నాగరాజు, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ

జిల్లాలో గుంతలున్న వాటితోపాటు వర్షానికి దెబ్బతిన్న రోడ్లను గుర్తించాం. అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలో రోడ్ల మరమ్మతుకు గాను టెండర్లు పిలుస్తున్నాం. జిల్లా మొత్తం రూ.10కోట్ల వరకు ఖర్చు చేయనున్నాం. ప్రమాదాలను తగ్గించటంపై దృష్టి సారిస్తాం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.