వే బిల్లులు లేకుండా అమ్మకం

ABN , First Publish Date - 2021-06-17T06:44:29+05:30 IST

ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా మొదలయ్యాయి. ఇసుక రీచ్‌ అధికారికంగా కేటాయించిన చోట చేపడుతున్నారా.. అనే విషయంపై స్పష్టత లేదు.

వే బిల్లులు లేకుండా అమ్మకం
టిప్పర్‌కు ఎక్స్‌కవేటర్‌తో లోడ్‌ చేస్తున్న నిర్వాహకులు

ఇష్టారాజ్యంగా.. ఇసుక తవ్వకాలు..!

వే బిల్లులు లేకుండా అమ్మకం 

ట్రాక్టర్‌కు రూ.500 అదనంగా వసూలు

ఆన్‌లైన్‌లో కనిపించని రీచ్‌

రీచ్‌ వద్ద గుర్తించని హద్దులు 

తూకంలోనూ నిబంధనల ఉల్లంఘన

రెవెన్యూ అధికారులకే స్పష్టత లేని వైనం

అధికారికమో.. అనధికారికమో.. తెలియని దుస్థితి

రాయదుర్గం/బొమ్మనహాళ్‌, జూన్‌ 16: ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా మొదలయ్యాయి. ఇసుక రీచ్‌ అధికారికంగా కేటాయించిన చోట చేపడుతున్నారా.. అనే విషయంపై స్పష్టత లేదు. ఆన్‌లైన్‌లో ఇసుక రీచ్‌ ఉన్నట్లు కొనుగోలుదారులకు కనిపించకపోవడంతో అధికారికంగా తవ్వకాలు చేస్తున్నారా..? అనధికారికమా..? అనే సందిగ్ధత నెలకొంది. చివరకు రెవెన్యూ అధికారులు కూడా ఉత్తర్వులు తమకు అందలేదని చేతులెత్తేస్తున్నారు. అయినా.. వాహనాల ను భారీగా తరలించి, జాతరలా విక్రయాలు సాగిస్తున్నారు. అంతా చో ద్యంలా ఉంది. దీనిపై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. రెండు రోజులుగా భారీ సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లు ఇసుకను తరలించేందుకు క్యూ కడుతున్నప్పటికీ ఇసుక విక్రయాల్లో మాత్రం నిబంధనల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్‌ను పొందిన ఏజెన్సీ నిర్వాహకులు ముందస్తుగా తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. బొమ్మనహాళ్‌ మండలం కళ్లుదేవనహళ్లిలో రెండు రోజుల ముందు నుంచే ఇసుక తవ్వకాలు ప్రారంభించి, అమ్మకాలు చేస్తున్నారు. అంతా రాతమూలకంగానే వ్యవహారాన్ని నడిపేస్తున్నారు. ఆన్‌లైన్‌ పద్ధతిని పాటించకపోవడంతో ముందుగానే తవ్వేస్తున్నారా... అనే కోణాల్లో ఆయా గ్రామాల్లో చర్చ సాగుతోంది. పైగా ఇ సుక విక్రయాల్లో అక్రమ వ సూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు అనుసరించకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలతో రీచ్‌లో తవ్వకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.


ఆన్‌లైన్‌లో కనిపించని రీచ్‌ 

ప్రభుత్వం ఇసుక రీచ్‌లను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పైగా బొమ్మనహాళ్‌ మండలంలో కళ్లుదేవనహళ్లి వద్ద రీచ్‌ను ఏర్పాటు చేసి, ఇసుకను విక్రయిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది. కాకపోతే రీచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ముందస్తుగా అధికార యంత్రాంగానికి తెలియాలి. పైగా ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగాలి. మూడు రోజులుగా సాగుతున్న తవ్వకాల ప్రక్రియ విమర్శలకు తావిస్తోంది. ఇసుక కొనుగోలుకు ఆన్‌లైన్‌లో ఎం ట్రీ చేసేందుకు ప్ర యత్నం చేస్తే కళ్లుదేవనహళ్లి కనిపించడం లేదనే విమర్శలు కొనుగోలుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో నేరుగా రీచ్‌ వద్దకే వాహనాలతో వస్తున్నారు. ఆన్‌లైన్‌ బిల్లింగ్‌ విధానంలో విక్రయాలు చేయాల్సి వుంది. మాన్యువల్‌ పద్ధతిలో రాసిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. అధికారికంగా రీచ్‌ ప్రారంభం చేశారా, ముందే తవ్వకాలు చేసుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


అధికంగా వసూళ్లు 

ఇసుక కొనుగోలు చేసేందుకు వెళ్లిన వారి నుంచి టన్నుకు రూ. 475 ప్రకారం తీసుకుని  సొంత వాహనంలో ఇసుకను లోడింగ్‌ చేసుకుంటున్నారు. ట్రాక్టర్‌కు నాలుగు టన్నుల ఇసుకను వేసి, రూ.2,150 వసూలు చేస్తున్నారు. అదనంగా  ట్రాక్టర్‌కు రూ.500 వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే రీచ్‌ వద్దకు వెళ్లేందుకు రహదారితోపాటు ఇతరత్రా ఖర్చులు చేశామని స్పష్టం చేస్తున్నట్లు తెలుపుతున్నారు. దీంతో ఇసుక కోసం రూ.500 చెల్లించి వారు చెప్పిన ప్రకారం కొనుగోలు చేసి తీసుకుంటున్నట్లు బాధితులు స్పష్టం చేస్తున్నారు. 


తూకానికి కొలబద్ద లేకపోయె..

సాధారణంగా ఇసుకను కొనుగోలు చేయడానికి టన్నుల ప్రకారం అనుసరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారికంగా రీచ్‌ ప్రారంభమైంది అనుకుంటే టన్నుకు ఎంత ఇసుక వస్తుందనే విషయంపై ప్రధానంగా వేబ్రిడ్జి ద్వారా మాత్రమే స్పష్టత వస్తుంది. అక్కడ ఇసుకను ఎక్స్‌కవేటర్‌ బకెట్‌ నిండా ఇసుక పడితే టన్ను కింద లెక్కవేసి, లోడింగ్‌ చేస్తున్నారు. వేబ్రిడ్జిలో వారి లెక్క ప్రకారం వేస్తే తక్కువ వస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం వినియోగదారులకు సరియైున కొలతల్లో అందించాల్సిన ఇసుకను అంచనాల ప్రకారం ఇస్తుండడంపై పెదవి విరుస్తున్నారు.


రీచ్‌ల హద్దులు ఏవో..?

కళ్లుదేవనహళ్లి వద్ద ఇసుక విక్రయానికి సంబంధించి ఏర్పాటు చేశామని చెబుతున్న రీచ్‌లో విక్రయించాల్సిన హద్దులు మాత్రం తెలియడం లేదు. సాధారణంగా జియో ట్యాగింగ్‌ పద్ధతి ద్వారా మ్యాపింగ్‌ చేసి, హద్దులు వేయడం లేదంటే రెవెన్యూ అధికారులు హద్దులు చూపిస్తే వాటి ప్రకారం తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పైగా ఒక్కసారిగా భారీ స్థాయిలో తవ్వకాలు చేయాల్సినంత అవసరాలు అర్థం కావడం లేదు. రెవెన్యూ అధికారులకే స్పష్టత లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


ఇసుక రీచ్‌పై ఉత్తర్వులు రాలేదు

కళ్లుదేవనహళ్లి వద్ద ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసినట్లు మాకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాలేదు. మౌ ఖిక సమాచారం మాత్రం ఉంది. రీచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుసు. దానికి సంబంధించిన ఉత్తర్వులను ఏజెన్సీ నిర్వాహకులు కూడా మాకు చూపించలేదు. రీచ్‌ ఎప్పుడు ప్రారంభమైందనే విషయంపై ఆరా తీసి, చర్యలు తీసుకుంటాం. 

- అనిల్‌కుమార్‌,తహసీల్దార్‌



Updated Date - 2021-06-17T06:44:29+05:30 IST