బాబోయ్‌.. ఎండలు

ABN , First Publish Date - 2021-03-03T07:23:14+05:30 IST

వేసవి ప్రారంభం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. మార్చి ఆరంభంలో సాఽధారణంగా 33డిగ్రీల నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావాల్సింది.

బాబోయ్‌.. ఎండలు

వేసవి ప్రారంభంలోనే భానుడి ప్రతాపం

అత్యధికంగా గుంతకల్లులో 39.6 డిగ్రీలు నమోదు

 సాఽధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు

అధికం 

బుక్కరాయసముద్రం,  మార్చి2:  వేసవి ప్రారంభం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. మార్చి ఆరంభంలో సాఽధారణంగా  33డిగ్రీల నుంచి 36 డిగ్రీల  సెల్సియస్‌ నమోదు కావాల్సింది. మంగళవారం గుంతకల్లు రూరల్‌ పరిధిలో అత్యధికంగా 39.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవటంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు. రాత్రి సమయాల్లో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగానే వేసవి ఆరంభంలో ఎండలు అధికమయ్యాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు. ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందనీ, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్‌, మే నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందన్నారు. ఈసారి ఆరంభంలోనే 40 డిగ్రీల చేరువలో ఉండగా రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలుపైగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన వివరాలను పరిశీలిస్తే.. అత్యధికంగా గుంతకల్లు మండలంలోని పాతకొత్తచెరువులో 39.6, పామిడిలో 38.7, యల్లనూరు 38.7, తాడిపత్రి 38.5, పుట్లూరు 38.4, రాయదుర్గం 38.4, తనకల్లు 38.2, ధర్మవరం 38.2, గుత్తి 38.2, గుమ్మఘట్ట 38.1, యాడికి 37.8, పెద్దవడగూరు 37.8, ముదిగుబ్బ, బత్తలపల్లి 37.3, రాప్తాడు 37.3, నార్పల 37.2, చిలమత్తూరు 37.2, ఆత్మకూరు, సీకేపల్లి, శింగనమల, బెలుగుప్ప 37.1, కొత్తచెరువు 37, ఆగళి 36.9, తలుపుల 36.8, కనగానపల్లి 36.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. వీటితో పాటు మరో 25 మండలాల్లో 35 డిగ్రీలుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-03-03T07:23:14+05:30 IST