వ్యవసాయ చట్టాలు.. తేనెపూసిన కత్తులు..

ABN , First Publish Date - 2021-01-17T06:27:05+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట తేనెపూసిన కత్తులని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.

వ్యవసాయ చట్టాలు.. తేనెపూసిన కత్తులు..
సదస్సులో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేసేందుకే నల్లచట్టాలు

సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

పాల్గొన్న టీడీపీ నేతలు కాలవ, బీకే, సీపీఎం రాష్ట్ర నాయకుడు ఓబులు

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 16: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట తేనెపూసిన కత్తులని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా శనివారం జిల్లా కేంద్రంలోని పాతూరు బ్రహంగారి హా ల్‌లో సీపీఐ, సీపీఎం సంయుక్తాధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీ చుట్లూ 500 రైతుసంఘాలు ఆందోళన చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం దారుణమని మండిపడ్డారు. దేశంలో రైతులు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతున్నప్పటికీ అది కార్పొరేట్‌ శక్తులకు మేలు చేయటానికే తప్పా.. అన్నదాతకు కాదన్నారు. కేంద్రం చట్టాలపై ఈనెల 26న అనంతపురంలో నిర్వహించే ఆందోళనలో అన్ని రాజకీయపార్టీలు పాల్గొని, రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. టీడీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారఽధి మా ట్లాడుతూ కొత్త చట్టాలతో పంట ధరను నిర్ణయించే అధికారం కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్తుందన్నారు. సీపీఎం రాష్ట్ర నేత ఓబులు మాట్లాడుతూ రైతుల భూములు లాక్కొని, వారిని కార్పొరేట్‌ సంస్థల్లో కార్మికులుగా మార్చేందుకు కేం ద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలపై పార్టీ నాయకులతో చర్చించి, ఉద్యమంలో పాల్గొనేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ నల్లచట్టాలను తీసుకురావడం దుర్మార్గపు చర్య అన్నారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జగదీష్‌, రాంభూపాల్‌, సీపీఐ ఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి పెద్దన్న, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్‌, నారాయణస్వామి, రైతుసంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు మల్లికార్జున, కాటమయ్య, నేతలు శ్రీరాములు, నాగేంద్రకుమార్‌, రాజారెడ్డి, వేమయ్యయాదవ్‌, పద్మావతి, ఓ నల్లప్ప, సావిత్రి, ఎస్‌యూసీఐ రాఘవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:27:05+05:30 IST