సమస్యలకు స్పందన ఏదీ ?

ABN , First Publish Date - 2021-03-06T06:35:42+05:30 IST

పలు సమస్యలపై ఫిర్యాదు చేసిన విద్యుత్‌ అధికారులు, సి బ్బంది పట్టించుకోవటం లేదనే విమర్శలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి.

సమస్యలకు స్పందన ఏదీ ?
రాయల్‌ నగర్‌లోని ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్‌ తీగ

సమస్యల పరిష్కారంలో 

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం..  ఫిర్యాదు చేసినా పట్టించుకోని క్షేత్రస్థాయి సిబ్బంది..

 వినియోగదారులకు తప్పని ఎదురుచూపులు

- ఈ చిత్రం నగరానికి కూతవేటు దూరంలోని రాయల్‌నగర్‌లోనిది. ఇక్కడ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు స పోర్టుగా ఓ తీగను ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన స్థలంలో దాని యజమాని ఇంటిని నిర్మించాడు. ఆ తీగ ఆ ఇంటి ఆవరణలోనే ఉండిపోయింది. దాన్ని తీసివేయాలని ఆఇంటి యజమాని గత నెల 2వతేదీన సంస్థ ఉన్నతాధికారులతోపాటు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. తొలుత స్థానిక అధికారులు పట్టించుకోలేదు. అయితే  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. తీగ తీసేయాలంటే ట్రాన్స్‌ఫార్మర్‌ను మా ర్చాల్సి ఉంటుంది. మీసేవ కేంద్రంలో డబ్బు కడితే అంచనా వేసి తొలగిస్తామని చెప్పారు. అంతటితో ఆగకుండా సమస్యను మాకు చెప్పకుండా మా పైస్థాయి అధికారుల ఫిర్యా దు చేస్తారా.. అంటూ ఇంటి యజమానిపైనే చిందులు వే శారు. అయినా సమస్య పరిష్కరించారా అంటే లేదు. దీంతో ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆ ఇంటివారు ఆందోళన చెందుతున్నా రు. 

-రుద్రంపేట పంచాయతీ పరిధిలోని ఓ ఇంటికి విద్యుత్‌ బిల్లు చెల్లించలేదని, ఆ వినియోగదారుడికి సమాచారం ఇవ్వకుండా కనెక్షన్‌ తొలగించారు. ఆ వినియోగదారుడు ఎస్సీ వర్గానికి చెందిన వారు. వారు నెలనెలా బిల్లు చెల్లించాల్సి అవసరం లేదు. వారికి 200 యూనిట్ల వరకు ఉచి తం. ఆయూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించిన దానికి నెల నెలా రూ.100వరకు బిల్లు చెల్లిస్తారు. గత ఏడాది లాక్‌డౌన్‌లో విద్యుత్‌ వినియోగం ఎక్కువ చేశారని బిల్లులో రూ.2వేలకుపైగా వేశారు. దీంతో ఆ వినియోగదారుడు గత రెండు మూడు నెలలుగా బిల్లు ఎక్కువ రావటంపై సం బంధిత అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా పట్టించుకోలేదు. సమస్యను పరిష్కరించలేదు. ఒక్కసారిగా లైన్‌మన్‌ వచ్చి వారం రోజుల కిందట విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు విద్యుత్‌ లేకుండా గడపాల్సి వచ్చింది.

- రూరల్‌ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన కొంత మంది గ్రామ సమీపంలో ఇళ్ల నిర్మాణాలు చేశారు. ఇందులో 40మంది గృహ నిర్మాణాలు పూర్తి కావటంతో విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయినా మంజూరు కాలేదు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోపు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలి ఉంది. ఏడాది దాటుతున్న ఇంత వరకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయలేదు. 


అనంతపురంరూరల్‌, మార్చి 5: పలు సమస్యలపై ఫిర్యాదు చేసిన విద్యుత్‌ అధికారులు, సి బ్బంది పట్టించుకోవటం లేదనే విమర్శలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో నెలల తరబడి విద్యుత్‌ సంబంధిత సమస్యలతో సావాసం చేయాల్సిన పరిస్థితిని విని యోగదారులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి కేవలం జిల్లా కేంద్రం చుట్టు పక్కలే కాదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది సమస్యను అధికారులు దృష్టికి తీసుకువెళుతున్నారు. వా టిలో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ అలానే ఉండి పోతున్నాయి. ఒక్కొక్క సెక్షన్‌లో ఇలాంటి సమస్యలు నిత్యం వస్తూనే ఉన్నాయి. అయినా సమస్యల పరిష్కరానికి సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపడంలేదు. ప్ర మాదాలు ఏవైనా సంభవించినప్పుడు మాత్రమే అక్క డకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారు. లేదా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు చెబితేనే వాటికి పరిష్కరం దక్కుతోంది. ఇటీవల ధర్మవరంలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ధర్మవరంలోని ఓ ఇంటి వంట గదిలో కొన్నేళ్లుగా విద్యుత్‌ స్తంభం ఉండి పో యింది. అధికారులు పట్టించుకోలేదు. స్థానిక ప్రజా ప్రతినిధి ఆ ప్రాంతంలో పర్యటించిన సమయంలో సమస్యను గుర్తించి..పరిష్కరించమని సంబంధిత అధికారులను ఆదే శించారు. అప్పటికీ గాని విద్యుత్‌ అధికారులకు ఇంట్లోని విద్యుత్‌ స్తంభాన్ని తీయాలి అన్న విషయం తెలియరాకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.  


వందల మంది పనిచేస్తున్నా ప్రయోజనం శూన్యం..

జిల్లా విద్యుత్‌ శాఖ పరిధిలోని ఐదు డివిజన్లలో ఎస్‌ఈ మొదలుకొని..ఈఈలు 13మంది, డీఈఈలు 34మంది, ఏఈఈలు114మం ది పనిచేస్తున్నారు. వీరిలో ఏఈఈ పోస్టులు 20కిపైగా ఖాళీగా ఉన్నాయి. ఇక సబ్‌ ఇంజనీర్లు-84, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు-148మంది, లైన్‌మెన్‌ 487, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ 178, జానియర్‌ లైన్‌మెన్‌ 71, పోల్‌ టూ పోల్‌ సిబ్బంది 196 మంది పనిచేస్తున్నారు. వీరుకాక ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ల పేరుతో జిల్లాలో 648 మందిని నియమించారు. ఇంత మంది ఉన్నా వినియోగదారుల సమస్యలు మా త్రం పరిష్కారానికి నోచుకోవట్లేదు. సమస్యలపై స్పందించేవారే లేరు. జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో అధికారులు, వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయినా జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోని ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇక మారుమూల ప్రాంతాల్లో సమస్యలు తలెత్తితే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 


సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం 

వినియోగదారులు సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఏఈఈల కొరత కారణంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇతర అ ధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. వినియోగదారు లు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని క్షేత్రస్థాయి ఉద్యోగులకు చెబుతున్నాం. ఆమేరకు చర్యలు తీసుకుంటాం.

- వరకుమార్‌, ఎస్‌ఈ, ఏపీఎస్పీడీసీఎల్‌

Updated Date - 2021-03-06T06:35:42+05:30 IST