అస్తవ్యస్తంగా కరోనా టీకా పంపిణీ

ABN , First Publish Date - 2021-07-25T06:08:00+05:30 IST

జిల్లాలో కరోనా టీకా పంపిణీ ఓవైపు నత్తనడకన సాగుతుండగా.. మరోవైపు పంపిణీ అస్తవ్యస్తంగా మారింది

అస్తవ్యస్తంగా కరోనా టీకా పంపిణీ
టీకా వేయాలని అడుగుతున్న జనానికి నిబంధనలు వివరిస్తున్న వైద్య సిబ్బంది

రోజుకో నిర్ణయం... పూటకో ఆదేశం

అస్తవ్యస్తంగా కరోనా టీకా పంపిణీ  

తొలుత కోవాగ్జిన్‌... మళ్లీ కొవిషీల్డ్‌ అట..!

నిబంధనలతో ఇబ్బంది పడుతున్న జనం

అనంతపురం వైద్యం, జూలై24: జిల్లాలో కరోనా టీకా పంపిణీ ఓవైపు నత్తనడకన సాగుతుండగా.. మరోవైపు పంపిణీ  అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించారు. ఇప్పటివరకు తొలిడోసు 10 లక్షల మందికి మాత్రమే వే శారు. రెండోడోసు 4 లక్షల మందికి వేశారని రికార్డులు చెబుతున్నాయి. నిబంధనలతో టీకా ప్రక్రియ గందరగోళంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా వేస్తున్నారు. ఇప్పుడు ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులు, గర్భిణులు, ఉపాధ్యాయులకు వ యసుతో నిమిత్తం లేకుండా టీకా వేస్తున్నారు. కరోనా టీకా వేయించుకోవాలని ఆశిస్తున్న వారు ఇంకా లక్షల్లోనే ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 45 ఏళ్లు దాటిన వారే జిల్లాలో ఇంకా 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరికీ టీకా వేయాలంటేనే ఇంకా కొన్ని నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం పూర్తిస్థాయిలో టీకా సరఫరా కాకపోవడంతోపాటు అధికారుల్లో సమన్వయ లోపమన్న భావనలు వినిపిస్తున్నాయి. రోజు కో నిర్ణయం.. పూటకో ఆదేశం జారీ చేస్తున్నారు. శుక్రవారం కోవాగ్జిన్‌ టీకా 45 ఏళ్లు దాటిన వారికి వేస్తామనీ, ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌ వర్కర్లకు రెండోడోసు వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం కోవాగ్జిన్‌ వద్దనీ, కొవిషీల్డ్‌ చాలాచోట్ల మిగిలి ఉండడంతో దానినే వేయాలని జేసీ చెప్పారు. ఆ మేరకు టీకా వేయాలని నగర పాలక కమిషనర్‌ ప్రకటించారు. దీనిని బట్టే టీకా పంపిణీలో సమన్వయలోపం తెలిసిపోతోంది. దీంతో కేం ద్రాల వద్దకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అవసరం, ఆసక్తి ఉన్నవారికి టీకా వేయడం లేదు. నిబంధనలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకవేళ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలనుకుంటే సిబ్బందిని అడుక్కోవాలి. ఇవేమి నిబంధనలు అని ప్రశ్నిస్తే మాత్రం టీకా వేయలేమని తెగేసి చెప్పి, వెనక్కి పంపిస్తున్నారు. టీకా పంపిణీ ఎక్కడ జరుగుతోంది? ఎవరికి వేస్తున్నారో కూ డా యంత్రాంగం చెప్పలేని పరిస్థితి ఉంది. నెలరోజులు గా ఇలాగే జిల్లాలో కొనసాగుతూ వస్తోంది. గతంలో జిల్లాకు ఏయే టీకా వచ్చింది, ఎంత వచ్చింది, ఎవరికి వేస్తున్నాం, ఎక్కడెక్కడ కేంద్రాలున్నాయి? తదితర వివరాలు ముందురోజే  తెలిపేవారు. ఇటీవల వ్యాక్సిన్‌ విషయంలో ఏం జరుగుతుందో కూడా అధికార యంత్రాం గం బయటపెట్టడం లేదు. ఎవరికివారు కేంద్రాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తున్నారని తెలుసుకుంటున్నారు. అక్కడ కూడా మళ్లీ నిబంధనలు విధిస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి, ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్న తల్లులు, టీచర్లకు మాత్రమే వేస్తున్నామని చెబుతున్నారు. పైగా తొలి డోసా... రెండో డోసా.. అనేది కూడా అక్కడికి వెళ్లే వరకు అర్థం కావడం లేదు. కొవిషీల్డా... కోవాగ్జినా అనేది కూడా తెలియడం లేదు. కోవాగ్జిన్‌ తొలిడోసు వేసుకున్న వారు 28 రోజులకు మళ్లీ రెండో డోసు వేసుకోవాలి. సమయానికి చాలామంది రెండో డోసు వేసుకోలేక పోతున్నారు. దీనికి సకాలంలో టీకా రాకపోవడం, వచ్చినా అధికారులు సక్రమంగా పంపిణీ చేయకపోవటమే కారణం. ఇక కొవిషీల్డ్‌ 84 రోజుల తర్వాత రెండోడోసు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో 18 ఏళ్లుపైబడిన వారందరికీ టీకా వేస్తున్నారని చెబుతున్నారు. జిల్లాలో మాత్రం ఇంకా నిబంధనల పేరుతో టీకా వేయడం లేదనీ, 45 ఏళ్లలోపు ఉన్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వ్యాక్సిన్‌ విషయంలో పక్కా సమాచారం అందించి, అందరికీ టీకావేసేలా చూడాలని అనంత ప్రజలు కోరుతున్నారు. 


ప్రభుత్వ నిబంధనలే పాటిస్తున్నాం

టీకా పంపిణీలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాం. ఇప్పటి వరకు 45 ఏళ్లు దాటిన వారికే టీకా వేస్తున్నాం. చిన్నారుల తల్లులు, గర్భిణులు, టీచర్లకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ వేస్తున్నాం. టీకా సరఫరాలో సమస్య లేదు. రోజు వారీగా పంపిణీ కొనసాగిస్తున్నాం. ఎక్కడైనా సమస్య ఉందని తెలిపితే తగిన చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ గంగాధరరెడ్డి, డీఐఓ





Updated Date - 2021-07-25T06:08:00+05:30 IST