ఆగని వాహన ముఠా ఆగడాలు..!

ABN , First Publish Date - 2021-01-12T06:46:36+05:30 IST

నకిలీ వాహన ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కర్ణాటకలోని ఖరీదైన వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో ఏపీకి మార్పు చేయించి, ఆ తర్వాత అమాయక ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

ఆగని వాహన ముఠా ఆగడాలు..!

కర్ణాటక వాహనాలను నకిలీ 

డాక్యుమెంట్లతో ఏపీకి మార్పు 

మరో 30 దాకా తేలిన వైనం

ఆర్టీఏ అధికారులకు తెలియకుండానే 

తీసుకెళ్లిన కర్ణాటక పోలీసులు

తమకు న్యాయం చేయాలంటూ

బాధితుల వేడుకోలు

అనంతపురం వ్యవసాయం, జనవరి 11: నకిలీ వాహన ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కర్ణాటకలోని ఖరీదైన వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో ఏపీకి మార్పు చేయించి, ఆ తర్వాత అమాయక ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరులో అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న ఐదుగురి వాహనాలను అనంత ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు. ఇందులో అనంతకు చెందిన నలుగురు ముఠా సభ్యులు కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి. ఇందులో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అదే ముఠా సభ్యుల ఆడగాలు మరోసారి బయటపడ్డాయి. పక్షం రోజులుగా జిల్లాలోని 30కిపైగా ఖరీదైన వాహనాలను కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలో ఇన్సూరెన్స్‌ పెండింగ్‌, ఇతర రకాల వాహనాలను అక్రమంగా ఏపీకి మార్పు చేశారంటూ ప్రస్తుత యజమానుల నుంచి వాహనాలను కర్ణాటక పోలీసులు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. దీంతో బాధిత యజమానులు సోమవారం అనంత ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నపుడు తమ పేరుపై ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేశారంటూ అధికారులను ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు.


నకిలీ డాక్యుమెంట్లతో..

కర్ణాటకకు చెందిన పలు రకాల ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో ఏపీకి మార్పు చేసినట్లు సమాచారం. ఇందులో ఎక్కువ శాతం ఫైనాన్స్‌ కంపెనీలకు కంతులు కట్టనివే ఉన్నాయి. ఏపీకి మార్చిన తర్వాత జిల్లాతోపాటు కడప, తిరుపతి, కర్నూలు ప్రాంతాలకు చెందిన వారికి విక్రయించినట్లు సమాచారం.


ఆర్టీఏ అధికారులకు తెలియకుండానే..

జిల్లాలో ఇప్పటి దాకా 30 దాకా వాహనాలను అనంత ఆర్టీఏ అధికారులకు తెలియకుండానే కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకుని, తీసుకెళ్లినట్లు సమాచారం. బెంగుళూరు ముఠాతో కలిసి కర్ణాటక వాహనాలను ఏపీకి తీసుకొచ్చిన జిల్లాకు చెందిన నలుగురిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నలుగురు ముఠా సభ్యులు ఎవరెవరికి వాహనాలు విక్రయించారు తదితర వివరాలను కర్ణాటక పోలీసులు సేకరించి, స్థానిక పోలీసుల సహకారంతో గుర్తించినట్లు తెలిసింది. ఈ విషయం ఆర్టీఏ అధికారులకు తెలియకపోవటం గమనార్హం. అప్పులు చేసి, కొనుగోలు చేసిన తమ వాహనాలను కర్ణాటక పోలీసులు తీసుకెళ్తున్నారనీ, అక్రమంగా ఏపీకి మార్పు చేసినపుడు తమపేరుపై ఎందుకు రిజిస్ర్టేషన్‌ చేశారంటూ బాధిత వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ప్రస్తుతం తమకు వాహనాలు విక్రయించిన ముఠా సభ్యులు కర్ణాటక పోలీసుల ఆధీనంలో ఉండటంతో ఎవరిని అడగాలో తెలియని అయోమయంలో బాధిత వర్గాలున్నాయి. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


అప్పు చేసి, వాహనం కొన్నాం

అప్పు చేసి వాహనాన్ని కొన్నాం. అన్ని కరెక్ట్‌గా ఉన్నాయనీ, ఎలాంటి సమస్య లేదని చెప్పటంతోనే తీసుకున్నాం. అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో సంవత్సరం క్రితం మా పేరుపై ఆర్‌సీ కూడా వచ్చింది. ఇప్పుడేమో అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేయించారంటూ కర్ణాటక పోలీసులు వాహనాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు విచారించి, న్యాయం చేయాలి.

- భాస్కర్‌, అనంత సాగర్‌ కాలనీ,అనంతపురం


రిజిస్ర్టేషన్‌ ఎలా చేశారు..?:

అనంత ఆర్టీఏ కార్యాలయంలో నా పేరుపై వాహనాన్ని రిజిస్ర్టేషన్‌ చేశారు. కర్ణాటక నుంచి నిబంధనలకు విరుద్ధంగా తెచ్చిన వాహనాన్ని ఎలా రిజిస్ర్టేషన్‌ చేస్తారు..? ఆర్టీఏ అధికారులు క్రాస్‌ చెక్‌ చేసి, ఉండుంటే మోసగాళ్ల బండారం అప్పుడే బయటపడేది. ఆర్టీఏ ఆఫీసులోనే రిజిస్ర్టేషన్‌ చేసిన వాహనాన్ని సంవత్సరం తర్వాత అక్రమంగా కొన్నారంటూ తీసుకెళ్లారు. ఇంట్లో వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.

- ఉదయ్‌, ఇందిరానగర్‌, అనంతపురం 


కర్ణాటక పోలీసులు తీసుకెళ్లారు

నేను కొనుగోలు చేసిన వాహనాన్ని కర్ణాటక పోలీసులు తీసుకెళ్లారు. ఆర్టీఓ అధికారుల వద్దకు వెళితే ఎవరూ సమాధానం చెప్పట్లేదు. కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకొచ్చిన వాహనాలను విక్రయించారని చెబుతున్నారు. వాటిని ఆర్టీఓ అధికారులు ఎలా రిజిస్ర్టేషన్‌ చేశారో అర్థం కావట్లేదు. మోసం చేసిన దొంగలు దర్జాగా ఉన్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు.

- విజయ్‌, నారాయణపురం, అనంతపురం రూరల్‌ 


Updated Date - 2021-01-12T06:46:36+05:30 IST