ఓదార్పు ఏదీ?

ABN , First Publish Date - 2021-01-11T06:40:44+05:30 IST

ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశనగ రైతులకు నిట్టూర్పే మిగిలింది. కనీస మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు ప్రయోజనం లేకపోయింది.

ఓదార్పు ఏదీ?

కొనుగోలు చేసిన గ్రేడ్‌ -1  వేరుశనగ వెనక్కు 

గ్రేడ్‌-2 కాయలకు డబ్బులు  చెల్లించని వైనం 

ప్రభుత్వం తీరుపై విమర్శలు 

అనంతపురం వ్యవసాయం, జనవరి 10: ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశనగ రైతులకు నిట్టూర్పే మిగిలింది.  కనీస మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు ప్రయోజనం లేకపోయింది. కేంద్రాల్లో కొనుగోలు చేసిన గ్రేడ్‌-1 సరుకును నిర్దాక్షిణ్యంగా రైతులకు వెనక్కి ఇచ్చారు. అలాగే గ్రేడ్‌-2 సరుకు విక్రయించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి దాకా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ డబ్బుల కోసం సంబంధిత అధికారులను సంప్రదించినా ఎప్పటిలోగా డబ్బులు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పలేకపోవడంతో ఏం చేయాలో తోచని అయోమయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 


 గ్రేడ్‌ -1 సరుకు వెనక్కి 

జిల్లావ్యాప్తంగా 356 రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబరు రెండోవారంలో వేరుశనగ కొనుగోళ్లు మొదలుపెట్టి, ఆ నెలాఖరుతో బంద్‌ చేశారు. ఈసారి 24 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో గ్రేడ్‌-1 వేరుశనగ 290 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఆ సరుకును తీసుకునేందుకు నాఫెడ్‌ నిరాకరించింది.  ప్ర భుత్వానికి ఆ సరుకు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపి నా ఫలితం లేకపోయింది. గ్రేడ్‌ -1 సరుకులో 100 క్వింటాళ్లను వేర్‌హౌస్‌ గోదాముల్లో నిల్వ చేశారు. మిగిలిన సరుకంతా రైతు భరోసా కేంద్రాల పరిధిల్లోని గోదాముల్లోనే ఉంచుకున్నారు. గత ఐదు రోజుల నుంచి ఆ సరుకును సంబంధిత రైతులకు వెనక్కి ఇస్తున్నారు. వేర్‌హౌస్‌ గోదాముల్లో నిల్వ చేసిన గ్రేడ్‌-1 సరుకును ప్రభుత్వం కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇంకా అందుకు అనుమతిస్తూ ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. వాటి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అనుమతించకపోతే ఆ సరుకును వెనక్కి ఇవ్వడం తప్పా వేరే మార్గం కానరాని  దుస్థితి నెలకొంది. 


గ్రేడ్‌-2 కాయలకు డబ్బులు ఏవీ ? 

66 శాతానికిపైగా నాణ్యత కలిగిన గ్రేడ్‌ -1 రకం  క్విం టాల్‌ ధర రూ.5275గా నిర్ణయించారు. తొలుత గ్రేడ్‌-1 రకం మాత్రమే కొనుగోలు చేశారు. పోయిన ఖరీఫ్‌లో వరుస వర్షాలతో వేరుశనగ పంట దిగుబడి తోపాటు నాణ్యత తగ్గింది. దీంతో నిబంధనలను ప్రభుత్వం సడలించింది. గ్రేడ్‌-2 రకం విత్తనకాయల కొనుగోలుకు అనుమతించింది. 60-65 శాతం వరకు నాణ్యత ఉంటే గ్రేడ్‌-2గా పరిగణించి క్వింటాల్‌ రూ.4,500లుగా నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 258 క్వింటాళ్ల గ్రేడ్‌-2 వేరుశనగను కొనుగోలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి వేరుశనగ కొనుగోలు విఫలమైంది. అరకొరగా కొనుగోలు చేసిన కాయలకు కూడా ఇప్పటి దాకా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 


ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం 

వేర్‌హౌస్‌ గోదాముల్లో నిల్వ చేసిన గ్రేడ్‌-1 వేరుశనగ కాయలను కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ చేసిన కాయలను తిరిగి రైతులకు వెనక్కి ఇచ్చేశాం. గ్రేడ్‌-2 కాయలను నేరుగా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాం. వాటికి సంబంధించిన డబ్బును త్వరలో రైతుల ఖాతాల్లో జమ చే సేలా చర్యలు తీసుకుంటాం. 

 - పరమేష్‌, మార్క్‌ఫెడ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ డీఎం 

Updated Date - 2021-01-11T06:40:44+05:30 IST