మాజీ చైర్మన్‌, కార్యదర్శి ఆస్తులు అటాచ్‌

ABN , First Publish Date - 2021-07-28T06:02:48+05:30 IST

తాళ్లరాంపూర్‌ సహకార సంఘంలో జరిగిన అవినీతిలో ఎట్టకేలకు మాజీ చైర్మన్‌ సోమ చిన్నగంగారెడ్డి, కార్యదర్శి స్వామి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అధికారులు తేల్చారు.

మాజీ చైర్మన్‌, కార్యదర్శి ఆస్తులు అటాచ్‌

తాళ్లరాంపూర్‌ సొసైటీలో అవినీతికి పాల్పడింది మాజీ చైర్మన్‌, కార్యదర్శే..!

రూ.3.32 కోట్లుగా తేల్చిన విచారణ అధికారి

వారిద్దరి ఆస్తుల కండిషనల్‌ అటాచ్‌మెంట్‌

క్రిమినల్‌ కేసు నమోదు చేసి.. నిధుల రికవరీకి మహాజన సభలో తీర్మానం

సంఘం ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని అధికారుల హామీ 

పోలీసు బందోబస్తు మధ్య మహాజన సభ

ఏర్గట్ల, జులై 27: తాళ్లరాంపూర్‌ సహకార సంఘంలో జరిగిన అవినీతిలో ఎట్టకేలకు మాజీ చైర్మన్‌ సోమ చిన్నగంగారెడ్డి, కార్యదర్శి స్వామి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అధికారులు తేల్చారు. దీంతో వారిద్దరి ఆస్తులను ఇతర వ్యక్తులకు బదిలీ చేయడం గానీ.. బహుమతిగా ఇవ్వడం గానీ.. అమ్మడం గానీ చేయకుండా నిలిపివేయాలని (కండిషనల్‌ అటాచ్‌మెంట్‌) కోరుతూ అధికారులు స్థానిక గ్రామ పంచాయతీ, తహసీల్దార్‌, భీమ్‌గల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. తాళ్లరాంపూర్‌ సహకార సంఘంలో బహిర్గతమైన అవినీతిపై డిపాజిటర్లు కలెక్టర్‌ నారాయణరెడ్డితో పాటు జిల్లా సహకార శాఖ అధికారులకు విన్నవించుకోగా.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీసీవో సింహాచలం తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని సెక్షన్‌ 51 ప్రకారం 2012 నుంచి 2020 వరకు మాజీ చైర్మన్‌ సోమ చిన్న గంగారెడ్డి, కార్యదర్శి స్వామి హయాంలో సొసైటీలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగం, డిపాజిటర్లకు సంబంధించిన డిపాజిట్ల వంటి అంశాలపై ఆర్మూర్‌ అసిస్టెంట్‌ సత్యనారాయణ రావుతో విచారణ చేయించిన విషయం విదితమే. సుమారు నాలుగు నెలల పాటు విచారణ చేసిన అధికారి.. మాజీ చైర్మన్‌ సోమ చిన్నగంగారెడ్డితో పాటు కార్యదర్శి స్వామి ఇద్దరు కలిసి 3కోట్ల 32 లక్షల 24వేల 280 రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు తేల్చారు. అట్టి విచారణ రిపోర్టును డీసీవో సింహాచలంకు అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా అవినీతికి పాల్పడిన సంఘం కార్యదర్శి స్వామిపై సస్పెన్షవ్‌ వేటు వేశారు. అలాగే వారిద్దరి ఆస్తులను అటాచ్‌ చేశారు. 

సొసైటీలో మహాజన సభ

తాళ్లరాంపూర్‌ సహకార సంఘంలో మంగళవారం సంఘం చైర్మన్‌ పెద్దకాపుల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను సంఘ సభ్యులకు వివరించారు. సంఘంలో అవినీతికి పాల్పడ్డ మాజీ చైర్మన్‌తో పాటు కార్యదర్శి నుంచి నిధులు రికవరీ చేయడానికి, అలాగే డిపాజిటర్లకు డబ్బులు ఇవ్వడానికి, బ్యాంక్‌లలో రుణాలు, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కంపెనీల వారికి చెల్లించడానికి సంఘం అన్నిరకాల ఆస్తులను అమ్మడానికి జిల్లా సహకార అధికారికి అన్ని హక్కులు కల్పిస్తూ తీర్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంఘంలో జరిగిన అవినీతిపై జిల్లా అధికారులు విచారణ పూర్తి చేశారని, అవినీతికి పాల్పడ్డ వారికి సంబంధించిన ఆస్తులపై కండిషనల్‌ అటాచ్‌మెంట్‌ కింద పలు శాఖలకు ఉత్తర్వులు అందజేయడం జరిగిందన్నారు. అలాగే సంఘానికి సంబంధించిన ఆస్తులు అమ్మకానికి జిల్లా సహకార అధికారికి హక్కులు కల్పిస్తూ సంఘ సభ్యులు తీర్మానం చేయడం జరిగిందన్నారు. కచ్చితంగా డిపాజిటర్లకు న్యాయం చేస్తామన్నారు. అవినీతిపై విచారణకు సహకరించిన జిల్లా అధికారులకు, చొరవ తీసుకున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సభకు ముఖ్యఅతిఽథిగా హాజరైన క్లస్టర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మాజీ చైర్మతో పాటు కార్యదర్శిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి నిధులు రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలోలో వైస్‌ చైర్మన్‌ కొట్టాల శ్రీనివాస్‌, సోమ దేవరెడ్డి, ఆడెపు గంగాప్రసాద్‌, ఏవో అబ్దుల్‌ మాలిక్‌, సంఘం డైరెక్టర్‌లు, సంఘ సభ్యులు, డిపాజిటర్లు పాల్గొన్నారు.  

‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో స్పందన

సొసైటీలో జరిగిన అవినీతిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించింది. సొసైటీలో రూ.కోట్లల్లో అవినీతి జరిగిందని తేల్చి చెప్పింది. ఈ కథనాలపై జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ విచారణను వేగవంతం చేశారు. దీంతో ప్రస్తుతం విచారణ ముగిసి బాధ్యులను గుర్తించి నిధుల రికవరీకి చర్యలు తీసుకోవడంతో సొసైటీ డిపాజిట్‌దారులు ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పోలీసు బందోబస్తు మధ్య మహాజన సభ

సొసైటీలో జరిగిన అవినీతి అంశం పలు పార్టీలకు రాజకీయంగా మారడంతో మంగళవారం మహాజనసభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బలగాలు రాగా.. భీమ్‌గల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏర్గట్ల ఎస్సై విజయ్‌ నారాయణ్‌ సభ ముగిసేంత వరకు ఉండి ఎలాంటి గొడవలు జరగకుండా చూశారు. 

Updated Date - 2021-07-28T06:02:48+05:30 IST