‘తూర్పు’తో బాలుకు తీయని బంధం..

ABN , First Publish Date - 2020-09-26T15:41:55+05:30 IST

గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ‘తూర్పు’తో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఐదు దశాబ్దాల నుంచి జిల్లాతో ఆయన అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడ ఎన్నో పాటలు పాడారు. ప్రత్యక్షంగా అవి విన్న శ్రోతలు ఆయన గానామృతానికి మైమరచిపోయారు.

‘తూర్పు’తో బాలుకు తీయని బంధం..

గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ‘తూర్పు’తో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఐదు దశాబ్దాల నుంచి జిల్లాతో ఆయన అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడ ఎన్నో పాటలు పాడారు. ప్రత్యక్షంగా అవి విన్న శ్రోతలు ఆయన గానామృతానికి మైమరచిపోయారు. వర్ధమాన గాయకులు, పిల్లలు ఆయన్ని చూసి స్ఫూర్తిపొందారు. ఇక జిల్లాలో ఎందరో మిత్రులు ఆయన స్నేహమాధుర్యానికి దాసులైపోయారు. ఒక్కపాటలే కాదు, ఇక్కడ నాటక రంగంలోనూ తన ప్రతిభను చాటి చప్పట్లను అందుకున్నారు. జిల్లాకు ఎన్నోసార్లు వచ్చారు. అనేక సంగీత కార్యక్రమాల్లో తన గానమాధుర్యంతో ఓలలాడించారు. ఎన్నో సత్కారాలు అందుకున్నారు. జిల్లా అభిమానుల ప్రేమానురాగాలకు ఆనందభరితులయ్యారు. గోదావరి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పదేపదే గుర్తుచేసుకునేవారు. బాలు .. ఇక లేరంటే ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరెందరో కన్నీటి పర్యంతం అవుతున్నారు. జిల్లాలో ఇన్ని వందల మందితో ఆయన పరిచయాలు కొనసాగాయా అని ఆశ్చర్యపడేలా ఊరూరా ఆయన మిత్రులే. ఆయనతో మనవాళ్ల జ్ఞాపకాలు కొన్ని..


వెంకన్న దివ్య చరిత్రను గానం చేసిన బాలు

ఆత్రేయపురం : వాడపల్లి వేంకటేశ్వరస్వామి దివ్య   చరిత్రను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానామృతం చేశారు. వాడపల్లి వాసా వేంకటేశా.. గోవిందా..       వాడపల్లి వేంకటేశ చరితం, కోనసీమ గోవింద కథామృతం.. వంటి గానాలను తన గొంతులో పలికిం చారు. 2020 ఏప్రిల్‌ 11న స్వామివారి చరిత్రను పాట రూపంలో జొన్నవిత్తుల పొందుపరచగా, బాలు మధురంగా ఆలపించారు. బాలు మృతి పట్ల వెంకన్న ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు సంతాపం తెలిపారు.


కార్యరూపం దాల్చని సత్యదేవుడి భక్తిగీతాలు

అన్నవరం : బాలసుబ్రహ్మణ్యంకు సత్యదేవుడు అంటే ఎంతో ఇష్టం. జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు వెళుతున్నారంటే సత్యదేవుని దర్శించుకోకుండా వెళ్లేవారుకాదు 2009లో స్వామివారి దర్శనానికి విచ్చేసిన సమయంలో సత్యదేవుడిపై భక్తిగీతాలు ఆలపించాలని అధికారులు కోరినప్పుడు ఆయన అంగీకరించి వాటి వివరాలు పంపాలని కోరారు. కాలయాపన జరగడంతో అది కార్యరూపం దాల్చలేదు. బాలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.


విజ్ఞరసకులనేలు

ప్రజ్ఞపాటల బాలు

విన బతుకునకు చాలు

ఓ కూనలమ్మా!

తీగ సాగెడి గొంతు

తీపి పంచిన తంతు

జుర్రుకొన మనవంతు

ఓ కూనలమ్మా!!

- బాలుపై సన్నిధానం నరసింహశర్మ కూనలమ్మ పదాలు


అక్కినేనికి బాలు  పాడిన తొలిపాట షూటింగ్‌ సామర్లకోటచక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో జరిగింది. ‘నా హృదయపు కోవెలా...’ అనే ఈ పాటను 1970లో అక్కినేని        చెరకు మోపులను తొక్కుతున్న సందర్భంలో చిత్రీకరించారు.


ఆర్కెస్ర్టాలతో సుమధుర గాన బంధం

తూర్పు గోదావరి జిల్లాతో ఆయనకు బాలుకి విడదీయలేని బంధం ఉంది. అందులోనూ వివిధ ఆర్కెస్ట్రాల తో ఆయనకు ఎంతో అనుబంధం పెనవేసుకుంది. కాకినాడ, రాజ మహేంద్రవరాలకు చెందిన అలనాటి ప్రముఖ ఆర్కెస్ట్రాల నిర్వాహ కులతో ఆయన పరిచయాలు సుదీర్ఘకాలం కొనసాగాయి. 1969 నుంచి 2000 వరకు జిల్లాలో జీవించి ఉన్న పూర్వ గాయకులు, సంగీత దర్శకులతో ఆయనకున్న సంబంధాన్ని మాటల్లో చెప్పలేం. కాకినాడకు చెందిన బాబ్జీ ఆర్కెస్ట్రా అధినేత, అప్పటి లేడీ వాయిస్‌ సింగర్‌ బాబ్జీ, ప్రాణలింగం, గంగాధర్‌, అలాగే రాజమహేంద్రవరా నికి చెందిన జిత్‌మోహన్‌మిత్ర, కాకినాడకు చెందిన ఆమని సత్య నారాయణ వంటి ప్రముఖ గాయకులతో బాలు స్నేహం సుమధుర మైంది. 1979లో రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ఆర్కెస్ట్రా లో తొలిసారిగా పాడారు. 1980లో అమలాపురం అగ్రహారంలో భీమ వరం ఆర్కెస్ట్రా నిర్వహించిన గానలహరిలో తన గొంతు వినిపించా రు. అదే ఏడాది మే నెలలో కాకినాడ సూర్యకళా మందిరంలో బాబ్జీ ఆర్కెస్ట్రాలో పాల్గొని సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ‘అవే కళ్లు’ సిని మాలో ఘంటసాల పాడిన ‘మా ఊళ్లో పడుచుంది దెయ్యమంటే భయమన్నది’ పాట పాడి యువతను హుషారెత్తించారు. 2006లో కాకినాడ రాజా ట్యాంకులో గంగాధర్‌ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని మెగాస్టార్‌ చిరంజీవి నటించిన త్రినేత్రుడు సినిమాలో ‘సరిగమ పదనిస రసనస ఇది కనివిని ఎరుగని గుసగుస’ పాట పాడి అందరితోనూ డాన్స్‌ చేయించారు. 2008 జూలైలో గంగాధరం మాస్టారి ఆహ్వానం మేరకు మరోసారి కాకినాడ వచ్చారు. 2014 డిసెంబరు 2న రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యమైదానంలో జిత్‌మోహన్‌మిత్ర సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. 


నటనకు ఓనమాలు.. కాకినాడలో నాటకాలు

మల్టీటాస్కిన్‌ అలియాస్‌ ఎస్పీ బాలు సర్‌.. ఇదీ ఆయన స్నేహితులు ముద్దుగా పిలుచుకునే పేరు. పుట్టింది నెల్లూరు జిల్లానే అయినా తూర్పుగోదావరి అంటే ప్రత్యేక అభిమానం చూపించేవారని ఆయన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్‌ దివాకర్‌ చెప్పారు. మా స్నేహితుడు రాసిన  ‘భయస్కోప్‌’ నాటకంలో బాలు ప్రత్యేక పాత్ర పోషించారు. అలాగే సూర్యకళామందిరంలో ప్రదర్శించిన ‘వైద్యో నారాయణో హరి’ నాటకం కోసం బాలు వచ్చారు. 1970 ప్రాంతం నుంచే కాకినాడలో ఐదు నాటకాల్లో ఆయన పలు పాత్రలు పోషించారు. సంగీతంలో స్థిరపడ్డాక కూడా నాటకాలపై ఆసక్తిని తగ్గించుకోలేదని దివాకర్‌ చెప్పారు. చివరిగా 2017లో కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌కు ఆయన రావడం, ఎంతోమంది కళాకారులనే కాకుండా ప్రేక్షకులను ఆయన పాటలతో మంత్రముగ్థులను చేశారు. బాలుకు కాకినాడ కోటయ్య కాజా అన్నా, కొత్తపల్లి కొబ్బరి మావిడి పండు అన్నా ఎంతో ఇష్టం. బోటు మీద పాపికొండల సందర్శనకు వెళ్లాలని ఎప్పుడూ అనేవారని, అది తీరని కోరికగానే మిగిలిందని చెమర్చిన కళ్లతో దివాకర్‌ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.              

Updated Date - 2020-09-26T15:41:55+05:30 IST