దాడికి కారణాలపై పోలీసుల ఆరా

ABN , First Publish Date - 2020-12-01T06:28:01+05:30 IST

రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై నిర్మాణ కార్మికుడు బడుగు నాగేశ్వరరావు దాడికి పాల్పడటం వెనుక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

దాడికి కారణాలపై  పోలీసుల ఆరా

మంత్రిపై దాడికి పాల్పడిన నిందితుడు కోర్టుకు 

నిందితుడి సోదరితో మంత్రి అనుచరుడి పరిచయంపైనా ఆరా


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నానిపై నిర్మాణ కార్మికుడు బడుగు నాగేశ్వరరావు దాడికి పాల్పడటం వెనుక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంత్రిపై దాడి ఘటనపై పోలీసులపై ఒత్తిడి పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఇసుక కొరత కారణంగా పనులు లేకపోవడంతో నాగేశ్వరరావు మంత్రిపై దాడికి పాల్పడ్డాడా? లేక మరేదైనా బలమైన కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిపై దాడి చేయించింది టీడీపీ నాయకులేనని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండగా, టీడీపీ నాయకులు అధికార పార్టీ నాయకులే సానుభూతి కోసం దాడి చేయించుకుని ఉంటారని ఎదురుదాడికి దిగుతున్నారు. కాగా ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌లో పలు దఫాలుగా విచారణ చేశారు. నిందితుడి సోదరి బడుగు ఉమాదేవికి, మంత్రి ముఖ్య అనుచరుల్లో ఒకరికి ఉన్న పరిచయం పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. దీంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు, అతని సోదరి ఫోన్‌ సంభాషణలకు సంబంధించిన కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేసులో కీలక వివరాలు రాబట్టేందుకు ఎస్పీ రవీంద్రబాబు కూడా నిందితుడితో మాట్లాడినట్లు సమాచారం. 


కోర్టుకు నిందితుడు 

మంత్రి పేర్నినానిపై దాడికి పాల్పడిన నిందితుడు బడుగు నాగేశ్వరరావుపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నెంబరు 126/2020యూ/ఎస్‌307 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే ఈ కేసులో విచారణ ఇంకా పూర్తికాలేదని, పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు మెమో ఫైల్‌ చేశారు. కోర్టు అనుమతితో నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. 


టీడీపీకి ఆపాదించడం తగదు  

మంత్రి పేర్ని నానిపై దాడి చేసింది తన తమ్ముడేనని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు  బడుగు ఉమాదేవి అన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తన సోదరుడి దుశ్చర్యకు తమ కుటుంబం అంతా షాక్‌కు గురయిందన్నారు. తన సోదరుడికి, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన సోదరుడు తాపీమేస్త్రి అని, ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. చేసిన తప్పుకు అతడికి శిక్ష పడాల్సిందేనన్నారు. ఎవరో చెబితే ఇతరులపై దాడికి పాల్పడే మనస్థత్వం తన సోదరుడికి లేదన్నారు. ఈ దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడో తనకు తెలియదన్నారు. ఇసుక కొరత కారణంగా తోటి తాపీ పనివారి మాటలు అతనిని ప్రభావితం చేసి ఉండవచ్చని ఆమె అన్నారు. పనులు లేకున్నా ఇలాంటి దాడికి పాల్పడటం సంస్కారం, సభ్యత కాదన్నారు. ‘నా సోదరుడు చేసిన పనిని అడ్డంపెట్టుకుని రాజకీయంగా నన్ను అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సబబు?’ అని ఆమె ప్రశ్నించారు. 

తన తమ్ముడికి  ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తలకు దెబ్బతగిలిందని, అప్పటి నుంచి మందులు వాడుతున్నాడని, మందులు వాడినపుడు ఒత్తిడికి గురవుతున్నాడని ఆమె తెలిపారు. ఒకరికి హాని చేసే మనస్తత్వం తన తమ్ముడికి లేదని, కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే అతనే ముందుండి పరిష్కరిస్తాడన్నారు. 

భవన నిర్మాణ కార్మికుడిగా యూనియన్‌ ఆందోళనల్లో తరచూ పాల్గొనేవాడన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్త ఇసుక పాలసీ కారణంగా ఇబ్బందుల్లో పడిన కార్మికుల్లో తన తమ్ముడు కూడా ఒకడన్నారు. పనులు లేకపోవడంతో బాధపడేవాడని తెలిపారు. టీడీపీ పోలింగ్‌ బూత్‌ ఏజెంటుగా వెళ్ల్లేవాడని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.  అతను చదివింది ఏడో తరగతి మాత్రమేనని తెలిపారు.  టీడీపీ జెండా పట్టుకుని తన తమ్ముడు నాగేశ్వరరావు  ఊరేగిందిలేదని, పోలింగ్‌ బూత్‌ ఏజెంటుగా కూడా వెళ్లలేదని ఆమె తెలిపారు. 


పోలీసులపై చర్యలుంటాయా?

మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటారు. ఏదైనా ప్రాంతానికి వెళ్లినా ఒంటరిగానూ, కార్యకర్తలతో కలిసివెళతారు. ఇంటివద్ద కూడా పోలీస్‌ బందోబస్తు అంతగా ఉండదు. ప్రశాంత వాతావరణం ఉన్న బందరులో మంత్రిపైనే దాడి జరగడంతో పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2020-12-01T06:28:01+05:30 IST