ఇరిగేషన్‌ ఏఈపై వైసీపీ ఎమ్మెల్యే దాడి

ABN , First Publish Date - 2022-06-02T09:28:39+05:30 IST

రాజమహేంద్రవరం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ)పై సాక్షాత్తూ ఎమ్మెల్యేనే చేయి చేసుకున్న ఉదంతమిది.. తమ సమక్షంలోనే మూడు సార్లు ఏఈని చెంపదెబ్బ

ఇరిగేషన్‌ ఏఈపై వైసీపీ ఎమ్మెల్యే దాడి

- 3 సార్లు చెంపపై కొట్టిన జక్కంపూడి రాజా

- పోలీసులకు ఏఈ సూర్యకిరణ్‌ ఫిర్యాదు

రాజమహేంద్రవరం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ)పై సాక్షాత్తూ ఎమ్మెల్యేనే చేయి చేసుకున్న ఉదంతమిది.. తమ సమక్షంలోనే మూడు సార్లు ఏఈని చెంపదెబ్బ కొట్టడంతో ఉన్నతాధికారులు సైతం బిత్తరపోయారు. జలవనరుల మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం వచ్చి, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌లో ఉన్నారు. అక్కడకు ఇరిగేషన్‌ ఇంజనీర్లను రమ్మన్నారు. ఒక రూమ్‌లో ఆయన ఉండగా.. వేరే గదిలో ఇంజనీరింగ్‌ అధికారులతో రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌ సమావేశమయ్యారు. ఆయన ఇరిగేషన్‌ ఏఈ సూర్యకిరణ్‌పై రెచ్చిపోయి మూడు సార్లు చెంప దెబ్బకొట్టారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలోకి వచ్చే పుష్కర కాలువకు సంబంఽధించి రెండేళ్ల కిందట తన అనుచరులు కాలువ నిర్వహణ పనులు చేశారని.. దీనిపై ప్రస్తుత ధరలతో అంచనాలు తయారు చేయాలని సుమారు ఆరు నెలలుగా ఎమ్మెల్యే.. ఏఈపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అప్పటి పనులకు ఇప్పుడు అంచనాలు వేయలేమని.. పైగా ఆ కాలువలు కూడా చిన్నవని, అంచనాల తయారీ కష్టమంటూ సూర్యకిరణ్‌ చెబుతూ వస్తున్నారు. ఈ పనులు వాస్తవానికి అనపర్తి నియోజకవర్గం పరిధిలోవని.. రంగంపేట మండలంలోని గ్రామాల నుంచి వెళ్లే పుష్కర కాలువ పనులకు సుమారు రూ.90 లక్షలకు అంచనాలు తయారు చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. ఇది తన చేతిలో లేదని, చేస్తే ఇబ్బందని ఏఈ వివరణ ఇస్తుండగానే.. ఎమ్మెల్యే రాజా మూడుసార్లు ఆయన చెంప చెళ్లుమనిపించారు. దీనిపై ఆగ్రహించిన ఇంజనీర్లు.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సూర్యకిరణ్‌తో పాటు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. పోలవరం ప్రధాన ఎడమ కాలువ సర్కిల్‌ ఎస్‌ఈ బీఎ్‌సఎస్‌ శ్రీనివాసయాదవ్‌, ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ డి.రాంబాబు, సబ్‌డివిజన్‌-1 డిప్యూటీ ఈఈ ఎం.శ్రీనివాసరావు సమక్షంలో పుష్కర పనులపై తాను వివరణ ఇస్తుండగా ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి తనను మూడు సార్లు చెంపపై కొట్టారని.. ప్రభుత్వ ఉద్యోగినైన తనపై దౌర్జన్యం చేశారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని సూర్యకిరణ్‌ సీఐ మధుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే కేసు పెట్టొద్దని ఉన్నతాధికారులు సూర్యకిరణ్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-06-02T09:28:39+05:30 IST