నీ చావుతో పదిమంది విలేకరులకు భయం కలగాలి

ABN , First Publish Date - 2021-02-24T05:14:14+05:30 IST

‘మేం చేసేదే అక్రమం. మట్టి తోలుకుంటాం. బెల్టుషాపులు నడుపు కుంటాం. గతంలోనూ ఇలాంటి దందాలు చేశాం. నువ్వు వార్తలు రాస్తావా? నీ చావుతో పదిమందికి విలేకరులకు భయం కలగాలని’ కొంతమంది అక్రమార్కులు ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై అందరూ చూస్తుండగానే కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.

నీ చావుతో పదిమంది విలేకరులకు భయం కలగాలి
గాయపడ్డ విష్ణువర్దన్‌రావు

గతంలోనూ దందాలు చేశాం.. మా అక్రమాలపై వార్తలు రాస్తావా?

‘ఆంధ్రజ్యోతి’ ఎర్రుపాలెం విలేకరిపై అక్రమార్కుల దౌర్జన్యం

కర్రలు, ఇనుపరాడ్లతో దాడి.. ఎలాగైనా చంపేస్తామంటూ హెచ్చరిక

ఎర్రుపాలెం, ఫిబ్రవరి 23: ‘మేం చేసేదే అక్రమం. మట్టి తోలుకుంటాం. బెల్టుషాపులు నడుపు కుంటాం. గతంలోనూ ఇలాంటి దందాలు చేశాం. నువ్వు వార్తలు రాస్తావా? నీ చావుతో పదిమందికి విలేకరులకు భయం కలగాలని’ కొంతమంది అక్రమార్కులు ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై అందరూ చూస్తుండగానే కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యనమందల విష్ణువ ర్దన్‌రావు అనే వ్యక్తి ఎర్రుపాలెం మండలం ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిగా పని చేస్తున్నారు. మంగళవారం ఆయన తోటి విలేకరులతో కలిసి టీ తాగేందుకు ఓ హోటల్‌ వద్ద కూర్చున్నారు. ఈక్రమంలో అక్కడికి రామాపురం, ఎర్రుపాలేనికి చెందిన చెరుకుమల్లి నాగమల్లేశ్వరరావు, చెరుకుమల్లి దుర్గారావు వచ్చారు. వ చ్చీరాగానే మా అక్రమాలపై వార్తలు రాస్తావంటూ విష్ణువర్దన్‌పై దౌర్జన్యం చేశారు. దుర్భాషలాడుతూ రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో విష్ణువర్దన్‌రావు తలకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలో ఉండగా తోటి విలేకరులు మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతాని కి జనసమ్మర్థ ప్రాంతంలో ఉండటం వల్ల తప్పించుకున్నావని, ఎప్పటికైనా చంపేస్తామంటూ అక్రమార్కులు సవాల్‌ చేయడం గమనార్హం.

Updated Date - 2021-02-24T05:14:14+05:30 IST