బీజేపీ నేతలపై రాడ్లతో దాడి

ABN , First Publish Date - 2022-06-29T08:58:54+05:30 IST

బీజేపీ నేతలపై రాడ్లతో దాడి

బీజేపీ నేతలపై రాడ్లతో దాడి

ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లోకి చొరబడ్డ 20 మంది వైసీపీ కార్యకర్తలు 

రాడ్లు, కర్రలతో వీరంగం..  ఆరుగురికి తీవ్ర గాయాలు

అనంతపురం(ఆంధ్రజ్యోతి), ధర్మవరం, జూన్‌ 28: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నాయకులపై వైసీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రెస్‌క్లబ్‌ ఆవరణలో ఉన్న బీజేపీ నాయకులపై మూడు వాహనాల్లో 20 మందికిపైగా వచ్చి విరుచుకుపడ్డారు. మంగళవారం ఉదయం 10-30 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ధర్మవరంలో సోమవారం వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా విలేకరుల సమావేశం నిర్వహించేందుకు బీజేపీ ధర్మవరం పట్టణ, మండల కన్వీనర్లు డిష్‌ రాజు, చిగిచెర్ల అరవింద రెడ్డి, నాయకులు తుంపర్తి పరమేశ్‌, రాప్తాటి రాము, అప్పస్వామి, డిజైనర్‌ రాజశేఖర్‌రెడ్డి తదితరులు ప్రెస్‌ క్లబ్‌కు వెళ్లారు. మరో పది నిమిషాల్లో ప్రెస్‌మీట్‌ జరగనుండగా... వైసీపీ వర్గీయులు మూడు వాహనాల్లో వచ్చారు. కట్టెలు, రాడ్లు చేతపట్టుకుని ప్రెస్‌క్లబ్‌ ఆవరణలోకి చొరబడి ఒక్కసారిగా దాడికి దిగారు. అరవింద రెడ్డి, డిష్‌ రాజును గదిలోకి ఈడ్చుకెళ్లి విచక్షణా రహితంగా రాడ్లతో కొట్టారు. మిగిలిన వారిపై కట్టెలతో దాడి చేశారు. దర్మవరం పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు హోం గార్డులు బీజేపీ నేతల కదిలికలపై వైసీపీ వర్గీయులకు సమాచారం అందించారని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ హుటాహుటిన ధర్మవరానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని పరామర్శించారు. అనంతరం దాడిని నిరసిస్తూ డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, గొట్లూరు మారుతిరెడ్డి, వారి అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 


కేతిరెడ్డి గూండా మనస్తత్వానికి దర్పణం

అనంతపురంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గోనుగుంట్లతో కలిసి సత్యకుమార్‌ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మా పార్టీ నాయకులపై భౌతిక దాడులు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నియంతృత్వ, గూండా, రౌడీ మనస్తత్వానికి దర్పణం. ధర్మవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు సాగిస్తున్న భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకే దాడులకు దిగారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రకమైన భౌతికదాడులను బీజేపీ చూస్తూ ఊరుకోదు. నా మాటలు అధికార పార్టీకి అర్థం కాకపోతే.. అర్థమయ్యే రీతిలో బీజేపీ సమాధానం చెబుతుంది. ధర్మవరం పట్టణం నడిబొడ్డున, అందులోనూ ప్రెస్‌క్లబ్‌లోకి రాడ్లు, కట్టెలతో వెళ్లి దాడి చేసినా.. పోలీసులు కేసు పెట్టకపోవడం ఏమిటి? పోలీసులు అధికార పార్టీతో కుమ్మక్కై, వారిచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి, వారి మోచేతి నీళ్లు తాగేలా వ్యవహరిస్తున్నారు’’ అని సత్యకుమార్‌ మండిపడ్డారు. 

Updated Date - 2022-06-29T08:58:54+05:30 IST