ప్రజలపై దాడి పండుగనా?

ABN , First Publish Date - 2022-09-15T10:28:39+05:30 IST

తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని హంతక దినం సెప్టెంబర్‌ 17, 1948. నిజాంతో కుమ్మక్కైన నెహ్రూ–పటేల్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం...

ప్రజలపై దాడి పండుగనా?

తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని హంతక దినం సెప్టెంబర్‌ 17, 1948. నిజాంతో కుమ్మక్కైన నెహ్రూ–పటేల్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం సాకుతో 50వేల సైన్యంతో ప్రజలపై దండయాత్ర జరిపి దాడి చేసిన రోజు అది. ఈ దినాన్ని విలీనమని, విమోచనమని, విముక్తి అని, విధ్వంసమని వివిధ పక్షాలు ప్రకటిస్తున్నా తెలంగాణ ప్రజలపై ఇండియన్‌ పాలకుల దాడిగానే భావించాలి. విమోచన అనే పదాన్ని నెహ్రూ – పటేల్‌తో పాటు ఏ రాజకీయ పక్షమూ వాడలేదు. 1980ల నుంచి మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్‌ – బిజెపి సెప్టెంబర్‌ 17ను ‘విమోచన దినంగా’ ప్రకటించి ప్రభుత్వమే ఉత్సవంగా జరపాలని లొల్లి చేస్తున్నది. బిజెపి హడావుడి పెరిగిన నేపథ్యంలో కెసిఆర్‌ ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా’ దినంగా ప్రకటించి ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఎంఐఎం వంత పాడింది. ఈ వీరోచిత ప్రజాపోరాటంతో ఎలాంటి సంబంధంలేని పైగా దాన్ని అణచివేయడానికే సహకరించిన వారి వారసులైన ఈ పార్టీలు పోరాట త్యాగాలను ఓట్లుగా మలచుకునే కుట్రకు దిగుతున్నాయి.


ఆనాడు దేశంలో ఉన్న 565 హిందూ – ముస్లిం భూస్వామ్య సంస్థానాలన్నీ నిరంకుశమైనవే. ఇరు మతాల ప్రజలను, ఆదివాసులను బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల సైనిక బలం మీద ఆధారపడి పీడించుకుతిన్నవే. వీటిలో అత్యధికం హిందూ భూస్వాముల నిరంకుశ రాచరిక ప్రభుత్వాలే. ఈ సంస్థానాలలో ఎలాంటి స్వాతంత్య్ర పోరాట కార్యకలాపాలు జరపకూడదనేది కాంగ్రెస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ల అవగాహన. కశ్మీర్‌ను స్వతంత్రంగా ఉంచాలని, హైదరాబాద్‌ సంస్థానంలో ‘బాధ్యతాయుత’ ప్రభుత్వం కావాలని వైదిక, పునరుద్ధరణవాద ఆర్య సమాజ్‌, హిందూ మహాసభ వంటి హిందూ మత ఛాందస సంస్థలు డిమాండ్‌ చేశాయి. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో కుల, భూస్వామ్య దోపిడీ, వెట్టి, నిర్బంధ వసూళ్లు, కౌలు సమస్య, మహిళలపై లైంగిక దాడుల వంటి సమస్యలపై ప్రారంభమైన ప్రజాందోళనలు భూమి పంపిణీతో ముడిపడ్డ రాజ్యాధికార సాధనా సాయుధ పోరాటంగా బ్రద్దలైంది. పోలీస్‌ చర్య పేరుతో సైన్యాల దాడి జరిగే నాటికీ కమ్యూనిస్టుల సాయుధ పోరాట ధాటికి నిజాం ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఉంది. రెండు వేల గెరిల్లా సైన్యం, లక్షల మంది గ్రామ వాలంటీర్లు ప్రత్యక్షంగా పోరాటాలలో పాల్గొంటున్నారు. మూడు వేల గ్రామాలు విముక్తమయ్యాయి. 10 లక్షల ఎకరాలు పేద రైతాంగానికి, కూలీలకు పంచబడ్డాయి. ఈ పోరాటం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న సందర్భం.


సంస్థానపు అధిపతి, బడా భూస్వామి అయిన నిజాం పాలనకు పునాదిగా ఉన్న జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు మొదలైన ప్రజా పీడకులందరూ హిందూ మతానికి చెందినవారే. ప్రజాపోరాట ఉధృతికి తట్టుకోలేక వీరిలో అనేకులు గ్రామాలను వదిలి పారిపోయారు. మిగతా వారికి ఈ గతే పట్టే పరిస్థితి. నిజాం తన అధికారాన్ని, స్థిరచరాస్తులను కాపాడుకోలేని బలహీనుడుయ్యాడు. ముస్లిం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి నిర్మించుకున్న వివిధ సంస్థలు కానీ, ప్రైవేటు సైన్యం రజాకార్లు కానీ తన పాలనాధికారాన్ని రక్షించలేక పోతున్నాయి. ఈ సందర్భంలోనే బ్రిటిష్‌ వలసవాదుల నుంచి అధికార మార్పిడి జరగడం, నెహ్రూ–పటేల్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 1947, నవంబరు 29న నిజాం వీరితో మొదట తటస్థ ఒప్పందం చేసుకున్నాడు. అయితే పోరాటం తీవ్రమౌతూ ప్రభుత్వం కూలిపోయే స్థితిలో తన ఆస్తులకు అధికార హోదాకు గ్యారంటీ ఇచ్చే షరతు మీద లొంగిపోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే నిజాం సంస్థానం మీద నాలుగు వైపుల నుంచి జరిగిన యూనియన్‌ సైన్యాల దాడిని నిజాం బలగాలు ప్రతిఘటించలేదు. ఒక్క తూటా పేల్చకుండానే దాడి జరిగిన ఐదవ రోజునే నెహ్రూ– పటేల్‌ ప్రభుత్వానికి లొంగిపోయాడు.


నిజాం – కాంగ్రెస్‌ ప్రభుత్వ ఒప్పందం ప్రకారం, కమ్యూనిస్టులు వారి ఆధ్వర్యంలో పోరాడుతున్న ప్రజలే దాడికి లక్ష్యం అయ్యారు. దాడికి ముందు పదిహేను వందల మంది మాత్రమే చనిపోతే, దాడి అనంతరం 2500 మంది కమ్యూనిస్టులను సైన్యం అతి క్రూరంగా చంపేసింది. పదివేల మంది నిర్బంధ క్యాంపులలో చిత్రహింసల వల్ల చనిపోయారు. లక్షలాది మంది జైళ్లపాలయ్యారు. లైంగిక దాడులు, ఆస్తుల ధ్వంసం అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాదనల ప్రకారం హిందువులైన వీరందరిపై దాడి ఎందుకు జరిగింది? యూనియన్‌ సైన్యం, స్థానిక పోలీసులు, ఆర్య సమాజ్‌తో కలిసి హిందువులపై చేసిన దాడి విమోచనమా? ఈ సందర్భాన్ని పండుగలు, ఉత్సవాలు జేసుకోవాల్నా?


నిజాం సంస్థానంలో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని ఉస్మానాబాద్‌, గుల్బర్గా, బీదర్‌, నాందేడ్‌, ఔరంగాబాద్‌ తదితర జిల్లాల్లో సాగిన విధ్వంసాన్ని నెహ్రూ – పటేల్‌ అనుచరుడైన పండిట్‌ సుందర్‌ లాల్‌ నివేదిక ఆనాడే బట్టబయలు చేసింది. షోలాపూర్‌ నుంచి దిగుమతి అయిన హిందూ మతోన్మాద హంతక మూకలు హత్యలు, లైంగిక దాడులు, మహిళల అక్రమ నిర్బంధం, మహిళల అపహరణ, గృహాలు, పంటలు, వ్యాపార సంస్థల ధ్వంసం, భూముల ఆక్రమణ, మసీదుల ధ్వంసం వంటి ఎన్నో అకృత్యాలు చేశాయి. దాదాపు రెండు లక్షల మందిని హతమార్చాయి. ఈ విధ్వంసం, సామాన్య ప్రజలను మూకుమ్మడిగా హత్య చేయడం కూడా విమోచనమేనా? ఇందుకోసం ఏడాది పొడవునా వజ్రోత్సవాలు జరుపుతూ పాత గాయాలను కెలుక్కోవాల్నా? యూనియన్‌ సైన్యాల అండతో గ్రామాల్లోకి తిరిగి వచ్చిన భూస్వాములు, ప్రైవేట్‌ సైన్యాలు, ఆర్యసమాజ్‌, కాంగ్రెస్‌ వాలంటీర్లు మూడు సంవత్సరాల పాటు సాగించిన ఘోరమైన నేరాలన్నీ తెలంగాణ పీడిత ప్రజలు సాగిస్తున్న విమోచన పోరాటాన్ని ధ్వంసం చేయడానికి జరిగిన దాడిగానే భావించి, ప్రజలు ప్రతిఘటించారనేది దాచేస్తే దాగని సత్యం. విస్తరిస్తున్న ఈ ప్రజాపోరాటం దేశంలోని బడా భూస్వాముల – బడా పెట్టుబడిదారుల నియంతృత్వానికి సవాల్‌ విసురుతుందనే గ్రహింపుతోనే జరిగిన దాడి ఇది. కావున ఇది ఎంత మాత్రం విమోచన కాదు, విముక్తి కాదు. విధ్వంసక పూరితమైన ప్రజలకు తలపెట్టిన ద్రోహం. వాదన కోసం విమోచనే నిజమైతే నిజాంను 1950 జనవరి 26వ తేదిన రాజప్రముఖ్‌గా గుర్తించి, అతని ఆస్తులకు రక్షణ కల్పించి, రాజభరణాలు ఎందుకు ఇచ్చిర్రు? సర్ఫేఖాస్‌ భూములకు నష్టపరిహారం ఎందుకు ఇచ్చిర్రు? రజాకార్‌ మూకల అధిపతి ఖాసీం రజ్వీని క్షేమంగా దేశం నుంచి ఎందుకు పంపించిర్రు? పారిపోయిన భూస్వాములను గ్రామాల్లోకి ఎందుకు అనుమతిచ్చిర్రు? ప్రజలపై, వారు సాధించుకున్న విజయాలపై దాడులెందుకు జేసిర్రు?

ఆనంద్‌

Updated Date - 2022-09-15T10:28:39+05:30 IST