దాడి.. టీఆర్‌ఎస్‌ గూండాల పనే!

ABN , First Publish Date - 2022-01-27T08:49:34+05:30 IST

తనపై పసుపు రైతులు దాడి చేయలేదని, ఆ ముసుగులో టీఆర్‌ఎస్‌ గూండాలే దాడి చేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు.

దాడి.. టీఆర్‌ఎస్‌ గూండాల పనే!

  • రైతుల ముసుగులో హత్యాయత్నం
  • మా పార్టీ కార్యకర్తలే కాపాడారు: బీజేపీ ఎంపీ అర్వింద్‌
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటన


హైదరాబాద్‌/ఢిల్లీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తనపై పసుపు రైతులు దాడి చేయలేదని, ఆ ముసుగులో టీఆర్‌ఎస్‌ గూండాలే దాడి చేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. ఈ దాడితో తమకు ఏ మాత్రం సంబంధం లేదంటూ రైతు ఐక్య వేదిక ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డే ఈ పని చేయించారని, ఇందుకోసం పాతబస్తీ నుంచి పాతిక మంది గూండాలను నిజామాబాద్‌కు రప్పించారని ఆరోపించారు. సీపీ నాగరాజుకు తెలిసే.. ఆయన పర్యవేక్షణలోనే తనపై దాడి జరిగిందని, ఇందుకు సంబంధించి తన వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినా తనకు భద్రత కల్పించలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్వింద్‌ మాట్లాడారు. ‘‘మా కార్యకర్తలే నా ప్రాణాలు కాపాడారు. వారికి ధన్యవాదాలు. నన్ను చంపేందుకే పోలీసులు పథకం ప్రకారం ఓ ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నన్ను మా కార్యకర్తలే తప్పించారు. నాపై దాడి వెనుక నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ హస్తం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి పర్యవేక్షించారు’’ అని అర్వింద్‌ ఆరోపించారు.


ఈ దాడిపై లోక్‌సభ స్పీకర్‌, పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ, కేంద్ర హోంశాఖ సెక్రటరీ, రాష్ట్ర హోంమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఆర్మూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అర్వింద్‌ వెల్లడించారు. తనకు టిక్కెట్టు ఇచ్చే విషయంలో నిర్ణయాన్ని బండి సంజయ్‌కే వదిలేస్తానన్నారు. కాగా, ఎంపీ అర్వింద్‌పై దాడిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ ఖండించారు. టీఆర్‌ఎ్‌సకు రోజులు దగ్గర పడ్డాయని, అందుకే.. అసహనానికి గురై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ బలాన్ని చూసి ఓర్వలేకనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భౌతికదాడులకు దిగుతున్నారని విజయశాంతి విమర్శించారు. 

Updated Date - 2022-01-27T08:49:34+05:30 IST