రైసు మిల్లులపై దాడులు

ABN , First Publish Date - 2021-06-23T07:40:53+05:30 IST

పౌరసరఫరాల శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. బియ్యం అక్రమ నిల్వ ల బాగోతాన్ని బహిర్గతం చేశారు.

రైసు మిల్లులపై దాడులు
వెల్లంపల్లి వద్ద రైసుమిల్లులో ఉన్న రేషన్‌ బియ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు

4298 బస్తాల బియ్యం స్వాధీనం

మరోరెండు చోట్ల వాహనాల్లో తరలిస్తున్న  100 బస్తాల పట్టివేత 

ఒంగోలు (కలెక్టరేట్‌), జూన్‌ 22 : పౌరసరఫరాల శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. బియ్యం అక్రమ నిల్వ ల బాగోతాన్ని బహిర్గతం చేశారు. జిల్లాలో రెండు రైసు మిల్లులపై దాడులు నిర్వహించి 4298 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 54లక్షలు ఉం టుందని అంచనా వేస్తున్నారు. నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదు చేశారు. అలాగే మరో రెండు చోట్ల వాహనాల్లో తరలిస్తున్న 100 బియ్యం బస్తాలను పట్టుకున్నారు.

 రైస్‌ మిల్లుల్లో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో డీఎస్‌వో సురేష్‌ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని మణికంఠ రైస్‌మిల్లుపైన, ఏఎస్‌వో మస్తాన్‌ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని లక్ష్మీదత్తా రైస్‌మిల్లుపై దాడులు  చేశారు. ఉప్పుగుండూరు రైస్‌ మిల్లులో 3398 బస్తాలు, వెల్లంపల్లిలో 900 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.  వీటితోపాటు పర్చూరు వద్ద ఆటోలో 25 బస్తాలు, తర్లుబాడు మండలంలో లారీలో 75 బస్తాల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు.  


గోతాలు కూడా మార్చకుండా మిల్లుకు..  

 ఉప్పుగుండూరులో పట్టుకున్న బియ్యం విలువ రూ.44.73 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పౌరసరఫరాల గోడౌన్‌ నుంచి రేషన్‌ షాపులకు వచ్చిన బియ్యాన్ని నేరుగా ఆ రైస్‌మిల్లుకు తరలించినట్లు తెలుస్తోంది. సాదారణంగా రేషన్‌ షాపుల వద్ద కొనుగోలు చేసే బియ్యం బస్తాలను గోతాల్లో మార్చుకున్న తర్వాత తరలిస్తారు. కానీ ఉప్పుగుండూరులోని రైస్‌మిల్లులో పట్టుకున్న బియ్యం బస్తాలు గోడౌన్‌నుంచి ఏవిధంగా వచ్చాయో అలాగే ఉండటంతో అధికారులు సైతం అవాక్కయ్యారు.ఈ దాడుల్లో డీఎ్‌సవో సురే్‌షతోపాటు డీటీలు వాసుదేవరావు, రామనారాయణరెడ్డి, మస్తాన్‌, డేవిడ్‌రాజు పాల్గొన్నారు. మిల్లు లీజుదారులైన శ్రీనివాసరావు, కోటిరెడ్డిపై 6ఏ కేసు నమోదు చేశారు. 


వెల్లంపల్లిలో 900 బస్తాల బియ్యం  సీజ్‌

వెల్లంపల్లిలోని లక్ష్మీదత్తా రైస్‌మిల్లుపైనా పౌరసరఫరాల సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. 900 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బియ్యం లోడుతో ఉన్న ఒక లారీని సీజ్‌ చేశారు. ఇక్కడ రేషన్‌  బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేయించి వివిధ రకాల బ్రాండ్లతో విక్రయిస్తున్నట్లు వారు గుర్తించారు. వెల్లంపల్లికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు ఈ వ్యవహారం నడుపుతున్నట్లు ప్రాథమికంగా  నిర్ధారణకు  వచ్చారు. ఇక్కడ దాడుల్లో ఏఎస్‌వో మస్తాన్‌ తో డీటీలు ఆర్‌వీఎస్‌ కృష్ణమోహన్‌, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-06-23T07:40:53+05:30 IST