‘శ్రీకాకుళ’ సాహస సూరీడు

Published: Sat, 19 Mar 2022 00:42:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శ్రీకాకుళ సాహస సూరీడు

విప్లవోద్యమ నిర్మాణానికి అత్యంత అవసరమయిన రహస్య జీవితాన్ని గడపడంలో మెలకువలూ, సాహసాలూ అప్పలసూరిలో నిండుగా వుండేవి. అదే సందర్భంలో రహస్యోద్యమాన్నేకాక, బహిరంగ ప్రజాఉద్యమాన్ని నిర్మాణం చేయడంలోనూ అప్పలసూరి ఆదర్శంగా నిలిచేరు.


శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటంలో యెన్నెన్నో విశిష్టతలున్నాయి! అప్పటిదాకా దేశాన్ని విముక్తి చేయడానికి యెంచుకున్న మార్క్సిస్టు రాజకీయ సైద్ధాంతిక బాట– మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు బాటగా మరలడం, పార్లమెంటరీ పంథానుండి సాయుధపోరాట పంథాలోకి మళ్లడం, ప్రపంచవ్యాప్త రివిజనిజాన్ని తిరస్కరించి విప్లవబాట పట్టడం వంటి విశిష్టతల్లో ముఖ్యమయినది – కేంద్రీకృతమయిన నాయకత్వాన్ని ధిక్కరించి పునాది వర్గాలనుంచి విప్లవ నాయకత్వం యేర్పడడం! అఆ.. ఇఈ... రానోడు... ఆయుధం పట్టెరా, గోచిగుడ్డ గిరిజనుడు గొడ్డలి తిరగేసెరా అని వంగపండు శిక్కోలు యుద్ధం కంజరికథలో అన్నట్టుగా... నిరక్షరాస్యులు (తర్వాత వీళ్లు పోరాటక్రమంలో అక్షరాస్యులయినారు, మావో సూక్తుల్ని పాటలు కట్టినారు, కంఠోపాటం చేసినారు) నిరుపేద గిరిజనులు, రైతుకూలీలు, పునాది వర్గాల పేదలు విప్లవానికి నాయకత్వం వహించేరు. శ్రీకాకుళ పోరాట నాయకుల్లో అనేక విశిష్టతల సమీక‘రణ’యోధుడు మామిడి అప్పలసూరి! నిరాడంబరుడు, సాహసి, సడలని విప్లవదీక్షాదక్షుడు, ఆదర్శమానవుడు అప్పలసూరి!


కోమర్తి గ్రామం నుంచి అంచెలంచెలుగా – తొలినాళ్లలో సీపీఐ నాటి రోజుల్లో వ్యవసాయ–కార్మిక సంఘం నుండి శ్రీకాకుళ రైతాంగ విప్లవ పోరాట కాలంలో నిర్మాణమయిన రైతాంగ సంగ్రామసమితి నాయకత్వందాకా–ప్రతీ దశలోనూ పురోగమన దిశలో నడచినవాడు మామిడి అప్పలసూరి! శ్రీకాకుళ పోరాట విశిష్టతలలాగే, మామిడి అప్పలసూరి విశిష్టతలేమంటే – పీడితవర్గ విముక్త సిద్ధాంత రాజకీయాలకు చెందడమేకాదు, స్వయానా పీడితవర్గానికి చెందినవాడు! పాలేరు కొడుకు. ఎనిమిదవ తరగతి వరకే విద్యాభ్యాసం! ఆ రోజుల్లో ఆమాత్రం విద్యకు గూడా ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరికే అవకాశాలున్నాయి. అయితే విప్లవాన్నే వృత్తిగా స్వీకరించేడు అప్పలసూరి! హోల్‌టైమర్‌గా పనిచేస్తున్న రోజుల్లో గ్రామంలో వ్యవసాయ పనులకు కూలీగా, తాపీపనివానిగా, శ్రమజీవిగా తనను తాను రాటుదేల్చుకున్నాడు అప్పలసూరి! కనకనే తరువాత విప్లవోద్యమంలో యెదురయిన యిబ్బందులకూ, ఈతిబాధలకూ, నిర్బంధానికీ యిసుమంతయినా చలించలేదాయన! సుదీర్ఘకాల అఙ్ఞాతవాసంలో – మండుటెండలు, జడివానలు, వణికించే చలిరాత్రులు, కాలినడకనే దేశాటనలు, రోజుల తరబడి పస్తులు... తన విప్లవ దీక్షను సడలించలేకపోయేయి! కమ్యూనిస్టు విప్లవకారుడిగా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నవాడు.


నిరాడంబరుడు (కేవలం రెండు జతల బట్టలూ, రెండు లుంగీలు, రెండు తువ్వాల్లూ అతని వస్త్రాలు), సాహసి! పోలీసుల కస్టడీ నుంచి రెండుసార్లు తప్పించుకున్నారు. 1969 జూన్‌లో హిరమండలం ఔట్‌పోస్టు వద్ద చౌదరి సంపూర్ణమ్మతో పాటూ పోలీసులకు రాత్రివేళ చిక్కేరు. వీరితో పాటూ మరో యిద్దరు కొరియర్లు! పోలీసులు అప్పటికి వీరెవరో పోల్చుకోలేదు, గానీ తెల్లవారితే తెలుసుకోగలరు. అప్పలసూరి అప్పటికే భారత కమ్యూనిస్టుపారీ, ఎం.ఎల్‌. కేంద్రకమిటీ సభ్యుడూ, శ్రీకాకుళ పోరాట నాయకుడూ! సంపూర్ణమ్మ చౌదరి తేజేశ్వరరావుగారి సహచరి! తన వలన మిగిలిన సహచరుల ప్రాణాలకూ ప్రమాదమని భావించేడు అప్పలసూరి! యేమంటే అప్పటికే చిక్కిన శ్రీకాకుళ పోరాట నాయకుల్ని బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతున్నారు! 27.5.1969న కంచిలి రైల్వేస్టేషన్‌లో చిక్కిన పంచాది కృష్ణమూర్తి, మరో నలుగుర్ని పట్టుకొని కాల్చిచంపేసి.. జలంతర్‌ కొండల్లో ఎన్‌కౌంటర్‌గా ప్రకటించేరు. కనుక సహచరుల ప్రాణాలు రక్షింపబడాలంటే తాను పరారీ కావాలి. తాను పరారయితే తన ఆచూకీకోసం సహచరులను వేధిస్తారు తప్పా చంపరని భావించి... ఆ రాత్రివేళ పోలీసుల కళ్లుగప్పి పరారీ అయ్యేరు. ఔట్‌పోస్టు పక్కనేగల చెరువులో మునిగి, ఊపిరి బిగబట్టి, గంటల తరబడి, చెరువులో జలగలు శరీరాన్ని పట్టి పీల్చుతున్నా చలించక దాక్కొని, తర్వాత తనకు రక్షణనిచ్చే గ్రామానికి చేరి, సహచరుల అరెస్టువార్తను అందించి, పత్రికల్లో వచ్చేట్టు చేసి, సహచరుల ప్రాణాల్ని కాపాడేరు! సంపూర్ణమ్మ నాటి నుంచీ కేసులన్నీ పోయేదాకా జైలులో వుండిపోయేరు.


మామిడి అప్పలసూరి మరో విశిష్ట సాహసమేమంటే – సడలని విప్లవదీక్ష! అప్పటికే శ్రీకాకుళ పోరాటం వెనుకంజ వేసింది. దాదాపుగా పోరాట నాయకత్వం అమరత్వమో, (పాణిగ్రాహి, తామాడ గుణపతి, చాగంటి భాస్కరరావు  వగైరా) ఎన్‌కౌంటర్‌. మరీ ముఖ్యంగా 1970 జూలై 10 శ్రీకాకుళ పోరాటానికి కీలక నాయకులయిన వెంపటాపు సత్యం, కైలాసాలు ఎన్‌కౌంటరయ్యేరు. మరికొందరు నాయకులు అరెస్టవటమో (చౌదరి తేజేశ్వరరావు, నాగభూషణ పట్నాయక్‌, దుప్పల గోవిందరావు) జరిగింది. కొండ, కొండా పోలీసు దండుల్తో నిండిపోయింది. అడవిలో ఆకు, ఆకూ రక్తంతో తడిసిపోయింది. దళాలు చెదిరిపోయేయి. సరండరులారంభమయినాయి! పార్టీలో చీలికలారంభమయినాయి. ఒక నిరాశామయ వాతావరణం అలముకుంది 1973 నాటికి. ఆ నిరాశామయ వాతావరణంలో కూడా మళ్లీ విప్లవాన్ని కొనసాగించగలనన్న ఆశతో, కోర్టు వాయిదాకు తీసుకు వస్తుండగా 1973 ఏప్రిల్‌ 13న పోలీసుల చెర నుండి అప్పలసూరి తప్పించుకున్నారు. రోజులతరబడి కాలినడకన రహస్యంగా తిరుగుతూ, ఉద్యమప్రాంతానికి చేరుకున్నారు!


సాయుధ పోరాట బాటను వీడకుండానే మైదానప్రాంతాన విప్లవోద్యమ నిర్మాణాన్ని సాగించడం అప్పలసూరి మరో విశిష్టత! 1973లో పోలీసుల కస్టడీ నుంచి పరారయి 1977 ఆగుస్టు 8న అనూహ్యంగా హైదరాబాద్‌లో అరెస్టయ్యే దాకా విప్లవోద్యమ నిర్మాణంలో శ్రమించి, ఆదివాసీ ప్రాంతమూ, మైదాన ప్రాంతమూ సంబంధాలను పునరుద్ధరించుకొని విప్లవ ఆశను రగిలించేరు. అప్పుడే యీ ప్రాంతంలో గద్దర్‌ ప్రదర్శనలు, భూపాల్‌ జననాట్యమండలి ప్రదర్శనలూ జరిగేయి. వీటివెనక అప్పలసూరి పాత్ర వుంది! విప్లవోద్యమ నిర్మాణానికి అత్యంత అవసరమయిన రహస్యజీవితాన్ని గడపడంలో మెలకువలూ, సాహసాలూ అప్పలసూరిలో నిండుగా వుండేవి. అదే సందర్భంలో రహస్యోద్యమ నిర్మాణమే గాక, బహిరంగ ప్రజాఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో కూడా అప్పలసూరి ఆదర్శంగా నిలిచేరు. తన చివరి రోజులదాకా ఉత్తరాంధ్రలో బహిరంగ ప్రజాఉద్యమ నిర్మాణాన్ని విజయవంతంగా సాగించేరు.


ఉత్తరాంధ్రలో రైతాంగ పేదలసమితి పేరిట వ్యవసాయాధార ప్రజలనూ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య పేరిట కార్మికులనూ సమీకరించి ఉద్యమాలను నిర్మించేరు. భూస్వాములూ, పెట్టుబడిదారులూ ఆయనను హత్య చేయించడానికీ, నిర్బంధించడానికీ చేయని ప్రయత్నంలేదు. కానీ అప్పలసూరి ప్రదర్శించిన మెలకువా, యెత్తుగడలూ, సాహసాలూ శతృవుని ఓడించేయి! అనేక సంక్లిష్ట ఉద్యమ రాజకీయ పరిస్థితుల మధ్య, ఎన్నెన్నో సిద్ధాంత రాజకీయ విభేదాల మధ్య విడివడిన విప్లవ సహచరులతో సంభాషణలు కొనసాగిస్తూ ఐక్యత కోసం కృషిచేసేరు. వివిధ విప్లవ పక్షాలమధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించడంలో అప్పలసూరి పాత్ర గణనీయమయినది! అఙ్ఞాతంలో వుంటున్నపుడే తీవ్రమయిన అస్వస్థతకు (హెపటైటిస్‌–బి) గురయి, రహస్యనామం (ముసలయ్య... పేరుతో, అప్పలసూరి తండ్రి పేరిది)తో ఆస్పత్రిలో చేరేరు. గానీ అప్పలసూరి ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయేరు 1997 మార్చి 21న అప్పలసూరి అమరులయినారు! ఎర్రా, యెర్రని బిడ్డ... ఎక్కడే నా బిడ్డ– మండేటి సూరీడమ్మో నాబిడ్డ– మామిడప్పలసూరమ్మో అని ఉత్తరాంధ్ర గ్రామాలు అప్పలసూరి అమరత్వాన్ని రెండున్నర దశాబ్దాలుగా తలచుకుంటున్నాయి! వర్ధంతి సభల్లో అప్పలసూరి వారసుల కోసం గ్రామాలు వెదుకుతున్నాయి.అట్టాడ అప్పల్నాయుడు

(మార్చి 21న కోమర్తిలో మామిడి అప్పలసూరి 

25వ వర్ధంతి సభ)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.