పార్లమెంటు ముట్టడికి బీసీ సంఘం నేతల యత్నం

ABN , First Publish Date - 2021-07-27T07:22:33+05:30 IST

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌

పార్లమెంటు ముట్టడికి బీసీ సంఘం నేతల యత్నం

  • ఆర్‌.కృష్ణయ్య సహా 100 మంది పోలీ్‌సస్టేషన్‌కు 
  • ‘బీసీ బిల్లు’ పెట్టకపోతే మంత్రులను బయట తిరగనివ్వం: కృష్ణయ్య


న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో పార్లమెంటును ముట్టడించడానికి ఆ సంఘ నేతలు యత్నించారు. సోమవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెం టు వైపు వెళ్లడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 100 మంది నిరసనకారులను అరెస్టు చేసి మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


కృష్ణయ్యతో పాటు నాయకులు గుజ్జ కృష్ణ, లాకా వెంగల్‌ రావు, నీల వెంకటేశ్‌, నాగేశ్వర్‌ రావు, నరేశ్‌ తదితరులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య విలేకరులతో మాట్లాడా రు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. బీసీ బిల్లు పెట్టకపోతే కేంద్ర మంత్రులను బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు.



‘క్రిమిలేయర్‌’ను రద్దు చేయాలి


తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల విజ్ఞప్తి

బీసీల క్రిమిలేయర్‌ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, వీరేంద్ర కుమార్‌ను తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు మంత్రికి తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్‌ రావు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రం అందించారు.


Updated Date - 2021-07-27T07:22:33+05:30 IST