డబ్బు కోసం కిడ్నాప్‌ యత్నం

ABN , First Publish Date - 2022-06-25T06:30:29+05:30 IST

నాలుగు రోజుల క్రితం నగరంలో సంచలనం సృష్టించిన రియల్టర్‌ కేసును పీఎంపాలెం పోలీసులు ఛేదించారు. ఆరుగురు నింది తులను అరెస్టు చేశారు.

డబ్బు కోసం కిడ్నాప్‌ యత్నం
వివరాలు వెల్లడిస్తున్న ద్వారకా ఏసీపీ మూర్తి, చిత్రంలో సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ వెంకట్రావు ఉన్నారు

రియల్టర్‌ అపహరణ కేసును ఛేదించిన పోలీసులు 

ఆరుగురు నిందితులు అరెస్టు 

వివరాలు వెల్లడించిన ద్వారకా ఏసీపీ మూర్తి

కొమ్మాది, జూన్‌ 24: నాలుగు రోజుల క్రితం నగరంలో సంచలనం సృష్టించిన రియల్టర్‌ కేసును పీఎంపాలెం పోలీసులు ఛేదించారు. ఆరుగురు నింది తులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివ రాలను ద్వారాకా ఏసీపీ ఆర్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, పీఎం పాలెం సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ వెంకట్రావులతో కలిసి శుక్రవారం వెల్లడించారు. భీమునిపట్నం దరి జేవీ అగ్రహారానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పాసి రామకృష్ణను ఈనెల 20న రుషికొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని చెప్పారు. గొల్లల తాళ్లవలసకు చెందిన రౌడీషీట్‌ కోలా వెంకట హేమంత్‌కుమార్‌ ఇటీవలే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించాడని, భూములు కొనిపిస్తానని పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడని తెలిపారు.


 ఆర్థిక ఇబ్బందులు కారణంగా స్థలాలు ఇప్పించక పోవడం, డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగ డంతో ఈజీ మనీకోసం కిడ్నాప్‌ పథకం రచించాడని చెప్పారు. ఇందులో భాగంగా రుషికొండ ప్రాంతంలో ఎనిమిది ఎకరాల స్థలం ఉందని రామక్రిష్ణ దృష్టికి తీసుకువెళ్లి కొనిపించే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఈ క్రమంలో స్థలం యజమాని వచ్చాడని, ఎంబీకే గెస్ట్‌హౌస్‌లో ఉన్నామని ఈనెల 20న రామక్రిష్ణకు సమాచారం ఇచ్చి రమ్మన్నాడని తెలిపారు. దీంతో రామక్రిష్ణ తన ఇద్దరు స్నేహితులతో కలిసి గెస్ట్‌ హౌస్‌ వద్దకు వెళ్లాడని, స్నేహితులను బయటే ఉంచి తాను మాత్రం లోపలికి వెళ్లాడని తెలిపారు.


అప్పటికే రామక్రిష్ణ కిడ్నాప్‌కు పథక రచన చేసిన హేమంత్‌ మరో రౌడీషీటర్‌ అంబటి మధుసూదన రావు, పీఎం పాలేనికి  చెందిన సయ్యద్‌ రెహమాన్‌, కొలగాని పవన్‌రాజ్‌కుమార్‌, పెంటకోట కిరణ్‌లను గెస్ట్‌హౌస్‌కి రప్పించాడన్నారు. దీంతో  రామక్రిష్ణ గెస్ట్‌హౌస్‌లోకి రాగానే అక్కడే ఉన్న వారంతా అతనిని కత్తులతో బెదిరించి కాళ్లు, చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్‌ వేసి రిసార్ట్ప్‌కు మరోవైపు నుండి  బలవంతంగా కారులో విజయనగరం కొత్తరోడ్డు ప్రాంతానికి తీసుకువెళ్లారని తెలిపారు. అనంతరం రామక్రిష్ణ స్నేహితులకు ఫోన్‌చేసి కోటి రూపాయలు ఇస్తేనే వదులుతామని బేరం పెట్టారని చెప్పారు.


కాగా రిసార్ట్స్‌ యజమాని గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీని తన సెల్‌ఫోన్‌తో అను సంధానం చేసుకుని ఉండడంతో దాన్ని పరిశీలిస్తుం డగా రామక్రిష్ణను దుండగులు బలవంతంగా తీసుకు వెళ్తుండడం గుర్తించి అనుమానంతో పీఎం పాలెం సీఐ రవికుమార్‌కు సమాచారం ఇచ్చాడని తెలిపారు. వెంటనే ఆయన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని సీసీ పుటేజీ ఆధారంగా కారు నంబర్‌ గుర్తించి డ్రైవర్‌ కు ఫోన్‌ చేశారని, దీంతో సమాచారం పోలీసులకు అందిందని గుర్తించిన హేమంత్‌ బృందం రామక్రిష్ణను అక్కడే వదిలేసి, క్యాబ్‌ డ్రైవర్‌ను బయటకు తోసేసి ఆ కారులో పరారయ్యారని తెలిపారు.


రామక్రిష్ణ అక్కడి నుంచి ఆటోలో భీమునిపట్నం చేరుకుని జరిగింది అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశా డని ఏసీపీ వివరించారు. అప్పటి నుంచి నిందితులపై నిఘాపెట్టగా గురువారం సాయంత్రం హేమంత్‌ను మధురవాడ ఐటీ సెజ్‌వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే, హేమంత్‌ స్థల యజమానురాలిగా సుబ్బలక్ష్మి అనే మహిళ పేరు చెబుతూ అడ్వాన్స్‌ మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాకు జమచేయించడంతో ఆమెను కూడా అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు.  మిగిలిన నలుగురు నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకుని ఆరుగురినీ కోర్టు ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులు ఉపయోగించిన కత్తులు, సెల్‌ఫోన్‌లతోపాటు కారును సీజ్‌ చేశామన్నారు. 

Updated Date - 2022-06-25T06:30:29+05:30 IST