తొలిరోజు హాజరు అంతంతే!

ABN , First Publish Date - 2022-07-06T05:13:30+05:30 IST

సుదీర్ఘ విరామం తరువాత పాఠశాలలు మంగళవారం తెరుచుకున్నాయి. సుమారు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రుల్లో సందడి నెలకొంది. అయితే మంగళవారం సెంటిమెంట్‌తో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపలేదు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 1,91,417 మంది విద్యార్థులకుగాను.. మంగళవారం 88,702 మంది మాత్రమే హాజరయ్యారు. ఏకంగా 1,02,715 మంది విద్యార్థులు హాజరుకాలేదు. 85,678 మంది మధ్యాహ్న భోజనం తిన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

తొలిరోజు హాజరు అంతంతే!
పాఠశాలకు వెళుతున్న విద్యార్థులు

 1,91,417 మందికి హాజరైంది 88,702 మంది విద్యార్థులే

 మంగళవారం సెంటిమెంట్‌తో చాలామంది దూరం

 విద్యాకానుక కిట్లపై పెదవివిరుస్తున్న తల్లిదండ్రులు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/టెక్కలి, జూలై 5: సుదీర్ఘ విరామం తరువాత పాఠశాలలు మంగళవారం తెరుచుకున్నాయి. సుమారు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రుల్లో సందడి నెలకొంది. అయితే మంగళవారం సెంటిమెంట్‌తో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపలేదు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 1,91,417 మంది విద్యార్థులకుగాను.. మంగళవారం  88,702 మంది మాత్రమే హాజరయ్యారు. ఏకంగా 1,02,715 మంది విద్యార్థులు హాజరుకాలేదు. 85,678 మంది మధ్యాహ్న భోజనం తిన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 


 బ్యాగులు బలహీనం..

జగనన్న విద్యాకానుక పేరుతో విద్యార్థులకు అందించిన బ్యాగులు, కిట్లపై తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. టెక్కలి మండలంలోని ఓస్కూల్‌లో పంపిణీ చేసిన బ్యాగ్‌ బలహీనంగా ఉండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది ఇచ్చిన బ్యాగులతో పోల్చుకుంటే నాసిరకంగా ఉన్నాయంటున్నారు. నాలుగో తరగతి వరకూ చిన్నసైజు బ్యాగులు అందించారు. వాటిలో పుస్తకాలు పట్టే పరిస్థితిలో లేదు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు అందించిన బ్యాగులదీ అదే పరిస్థితి.  ఆరు రకాల టెస్ట్‌బుక్స్‌, ఆరురకాల వర్క్‌బుక్స్‌ ఉండాలి. కానీ అందులో సరిపడవని విద్యార్థులు చెబుతున్నారు. కొన్ని బ్యాగులు రంగుల వెలసి కనిపిస్తున్నాయి. జిల్లాలో 1,763 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 73,513 మంది విద్యార్థులు, 317 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 40,944 మంది విద్యార్థులు, 301 ఉన్నత పాఠశాలల్లో 72,278 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారందరికీ అందించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు జారీచేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బ్యాగులు నాసిరకంగా కనిపించడంతో తల్లిదండ్రుల నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాసిరకం బ్యాగుల పంపిణీపై ఎంఈవో దేవేంద్రరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ఎక్కడైనా నాసిరకం బ్యాగులు, కిట్లు వస్తే జిల్లా అధికారులు మార్చుతామని చెప్పారని పేర్కొన్నారు. 



Updated Date - 2022-07-06T05:13:30+05:30 IST